చిత్తూరు జిల్లాలో ఓటర్లలో వెల్లువెత్తిన చైతన్యం
6 గంటల నుండే వరసలో నిలబడ్డ మహిళలు
ఇతర రాష్ట్రాల నుండి తరలి వచ్చిన ఓటర్లు
ఉత్సాహంగా ఓటింగులో పాల్గొన్న యువత
తరలివచ్చిన వృద్దులు, బాలింతలు
పుత్రమద్దిలో మొరాయించిన ఇ వి ఎం
అరగంట ఆలస్యంగా పోలింగ్ ,
నిడలేక మహిళల ఇబ్బంది
జడలేని ముద చక్రాల సైకిళ్ళు
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటర్లలో చైతన్యం పోటెత్తింది. సార్వత్రిక ఎన్నికలలో ఓటు వేయడానికి ఓటర్లు ఉదయం 6 గంటల నుంచి బారులు తీరారు. వారికి సరైన వసతులను కల్పించడంలో ఎన్నికల సంఘం విఫలమైన, ఓపిగ్గా నాలుగైదు గంటల పాటు క్యూలో వేచి ఉన్నారు. పనిచోట్ల తొలిత ఈవీఎంలు మొరాయించాయి. కొన్నిచోట్ల 30 నిమిషాలు, మరికొన్నిచోట్ల గంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ లో ఎమ్మెల్యే, ఎంపీలకు రెండు ఓట్లు వేయడంతో పోలింగ్ చాలా మందకుడిగా సాగింది. ఎండలను సైతం లెక్కచేయకుండా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవడానికి బారులు తీరారు. పోలింగ్ కేంద్రాలలో ఎక్కడ చూసినా క్యూలైన్లు కనిపించాయి. ఐరాల మండలం పుత్రమద్ది గ్రామంలో తొలిట ఈవీఎం మొరాయించడంతో అరగంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 6 గంటలకు వరసలో నిలుచుకున్న ఓటర్లు 10 గంటలకు ఓటు వేసి బయటకు వచ్చారు. నాలుగు గంటల పాటు సమయం తీసుకున్నా, ఓపిగ్గా ఓటు వేసి వెలుపలికి రావడం గమనార్హం. ఇక్కడ షామియానా కొద్ది మాత్రం వేయడంతో ఓటర్లు ఎండలోని నిల్చుకోవాల్సి వచ్చింది. మహిళా ఓటర్లకు సౌకర్యం లేకపోవడంతో మహిళలు, వృద్ధులు, చిన్న బిడ్డల తల్లులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నడవలేని వారికి మూడు చక్రాల సైకిల్ అందుబాటులో లేకపోవడంతో సహాయకులు వారిని తీసుకెళ్లాల్చి వచ్చింది. ఉదయం ఏడు గంటల నుంచి వృద్దులు, నడవలేని వారు పోలింగ్ కేంద్రంలోకి రావడంతో వరుసలో నిలుచుకున్న ఓటర్లు చాలా ఇబ్బంది పడ్డారు. వృద్దులతో తోపాటు వారి బంధువులు ఓటు వేయడానికి వెళ్లే విషయంలో జిల్లాలో పలుచోట్ల వైసిపి, తెలుగుదేశం ఏజెంట్ల మధ్య వాగ్వాదాలు జరిగాయి. కొద్దిసేపు పోలింగ్ నకు అంతరాయం కూడా ఏర్పడింది. ఈ విషయంలో గుడిపాల మండలంలో ఒక ఏజెంట్ కత్తిపోట్లకు గురయ్యారు. చిత్తూరు పట్టణంలో వాలంటీర్లను ఏజెంట్లుగా నియమించడంతో టీడీపీ వైసీపీ నాయకుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. టిడిపి, వైసిపి నాయకులు ఎదురు ఎదురుగా రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జిల్లా జాయింట్ శ్రీనివాసులు, పోలీసులు నచ్చజెప్పి సర్దుబాటు చేశారు. ఎన్నికలలో ఓట్లు వేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున ఓటర్లు తరలివచ్చారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాదులో నుంచి పలువురు ఓటర్లు ఓట్లు వినియోగించుకోవడానికి భారీ ఎత్తున తరలివచ్చారు. తగినన్ని బస్సులు, రైలు సౌకర్యాలు లేకుండా ఏదో ఒక విధంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పట్టుదలతో గమ్యస్థానాలు చేరుకున్నారు. మొదటిసారిగా ఓటు హక్కు వచ్చిన యువత ఉత్సాహంగా ఓటింగ్ లో పాల్గొంది. మహిళలు కూడా ఉదయం 6 గంటలకే పోలింగ్ బూత్ చేరుకున్నారు. తర్వాత ఎండలో ముదిరి ఇబ్బంది పడుతామన్న భావంతో ముందుగానే పోలింగ్ కేంద్రానికి రావడం జరిగింది. కొందరు బిపి షుగర్ ఉన్న వ్యక్తులు నాలుగైదు గంటల పాటు వరుసలో నిలుచుకోవాల్సిన రావడంతో కళ్ళు తిరిగి అక్కడికక్కడే కుప్పకూలిన సంఘటనలు కూడా ఉన్నాయి. చంటి పిల్లలను కూడా తీసుకొని బాలింతలు వరుసలో నిల్చుకొని ఓట్లు వేశారు. వృద్ధులు కూడా చాలా ఆసక్తితో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ పర్యాయం ఓటు శాతాన్ని పెంచడానికి ఎన్నికల కమిషన్ భారీగానే ప్రచార కార్యక్రమాలను నిర్వహించింది. ముందుగానే ఓటర్లకు స్లిప్పులను అందజేసింది. వీటికి తోడు అభ్యర్థులు ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. చెన్నై, బెంగళూరులో ఉన్న వారిని చిత్తూరుకు చెందిన ఓటర్లను రప్పించడానికి ఉచితంగా రెండు, మూడు వందల బస్సులను ఏర్పాటు చేశారు. ఈ పర్యాయం ఓటర్లకు భారీగానే నగదు ముట్టింది. ఎస్సీ నియోజకవర్గాలలో ఓటుకు 1500 రూపాయలు వంతున, ఇతర నియోజకవర్గాలలో 2000 నుంచి 4 వేల రూపాయల వరకు అందజేసినట్లు తెలుస్తోంది. ఇది కూడా ఓటింగ్ శాతాన్ని పెంచడానికి దోహదం చేసినట్లు తెలుస్తోంది. మొత్తం మీద చిత్తూరు జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున పోలింగ్ నమోదయింది. గతంలో 65 శాతం నమోదయ్యే పోలింగ్ ఈ పర్యాయం 80% దాటడం గమనార్హం. పెరిగిన ఓటింగ్ శాతం ఎవరికి లభిస్తుంది అన్న విషయం మీద జిల్లాలో చర్చలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇరు పార్టీలు ఈ ఎన్నికలను పటిస్తాత్మంగా తీసుకొని అందరిని పోలింగ్ కేంద్రాలకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యలు, అభ్యర్థుల ఆర్థిక సహాయం, పార్టీలు ఎన్నికలను ప్రతిష్టాత్మంగా తీసుకోవడంతో చిత్తూరు జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 80 శాతానికి పైగా ఓటింగ్ నమోదు అయ్యింది.