సదుం ఎస్ ఐ మారుతీ సస్పెన్షన్
ఇది వరకు వి ఆర్ కు బదిలీ
ఏకపక్షంగా వ్యవహరించారని సస్పెన్షన్
జిల్లాలో సస్పెండ్ అయిన తొలి అధికారి.
ప్రభ బ్యూరో న్యూస్, చిత్తూరు.
చిత్తూరు జిల్లా సదుం ఎస్ ఐ గా పనిచేసిన మారుతిని సస్పెండ్ చేస్తూ అనంతపురం రేంజ్ డి ఐ జి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సస్పెన్షన్ ఆదేశాలు మారుతికి అందినట్లు సమాచారం. ఎన్నికల విధులలో సస్పెండ్ అయిన తొలి పోలిస్ అధికారి మారుతీ. గత శుక్రవారం భారత యువజన చైతన్య పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్రా యాదవ్ సదుం మండలంలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా, వైసిపి నాయకులు అడ్డుకున్నారు. వారి వాహనాలను తగులపెట్టారు. వారు రక్షణ కోసం పోలీస్ స్టేషనుకు వెళ్లినా, వెంటాడి దాడులు చేశారు. తిరిగి వారి మీదనే హత్యాయత్నం కేసులు బయాయించారు. ఈ సంఘటన జరిగిన రెండు రోజుల తరువాత అనంతపురం డి ఐ జీ సదుం వచ్చి పరిశీలించారు. ఆయన అదేశాలతోనే తన మీద హత్యాయత్నం కేసు నమోదు చేశారని, పుంగనూరులో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, బిసి కమిషన్, మానవహక్కుల సంఘాలకు ఫిర్యాదు చేశారు. పుంగనూరులో జరుగుతున్న అరాచకాలపై వెంటనే చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుందని ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజా జీవితంలో ఉంటూ భారత చైతన్య యువజన పార్టీని స్ధాపించి అనేక సమస్యలపై పోరాటం చేస్తున్న తనపై అనేక తప్పుడు కేసులు పెట్టారన్నారు. పుంగనూరులో తాను అడుగు బయటపెడితే కేసులు పెట్టి వేధించారని తెలిపారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా సదుం మండలంలో ప్రచారం చేస్తుంటే తనపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులు దాడి చేసి, తన అనుచరులను గాయపరిచారన్నారు. తనను హతమార్చేందుకు ప్రయత్నించారని తెలిపారు. తమకు చెందిన ప్రచార రధాలను, వాహనాలను ధ్వంసం చేసి తగులబెట్టారన్నారు. ఒక భయానక వాతావరణాన్ని స్రుష్టించారని ఆ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. సదుం పోలీస్ స్టేషన్ ఎదుటే తన ప్రచార వాహనాన్ని ధ్వంసం చేసి తగులబెట్టారన్నారు. కొందరు పోలీసలు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల్లో కీలు బొమ్మలుగా మారారని, ఆయన చెప్పినట్టే పోలీసులు వ్యవహరిస్తున్నారని బోడె రామచంద్రయాదవ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏప్రిల్ 29న తనపై దాడి చేసి, తన మనుషులను గాయపరిచి, వాహనాలను ధ్వంసం చేస్తే తిరిగి తనపైనే కేసులు పెట్టారన్నారు. ఘటన జరిగిన రెండు రోజుల తరువాత అనంతపురం రేంజ్ డిఐజి వచ్చి పరిశీలించి తనపై కేసులు పెట్టాలని పురమాయించినట్టు తెలిపారు. సిఐ రాఘవరెడ్డి, ఎస్సై మారుతిలు పెద్దిరెడ్డి ఇచ్చిన స్కిట్ ను అమలు చేస్తున్నారన్నారు. తన మనుషులకు గాయాలైతే హాస్పిటల్ కు తీసుకువెళుతున్నామని చెప్పి తీసుకువెళ్లి అరెస్ట్ చేసి రెండు రోజుల తరువాత మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి రిమాండ్ కు తరలించారని చెప్పారు. తనపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు చెప్పినా కూడా పోలీసులు కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారన్నారు. ఏవేవో కేసులు, నోటీసుల పేరుతో తనను ప్రజల మధ్యలో ఉండకుండా చేయాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారన్నారు. తన ఇంటి చుట్టూ పోలీసులు మోహరించి తనను అక్రమంగా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారని తెలిపారు. పుంగనూరులో జరుగుతున్న ఘటనలపై అనేకసార్లు ఫిర్యాదు చేశానని గుర్తు చేశారు. ఎన్నికల విధుల నుంచి రాష్ట్ర పోలీసులను తప్పించి పూర్తిగా కేంద్ర బలగాల పహారాలో పుంగనూరులో ఎన్నికలు నిర్వహించాలని రామచంద్రయాదవ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. లేకపోతే పుంగనూరులో అరాచకాలు, అల్లర్లు జరిగే అవకాశం ఉందని, ఎన్నికల్లో ప్రజలు స్వేచ్చగా ఓటు హక్కు వినియోగించుకోలేరని ఆ ఫిర్యాదులో తెలిపారు. పుంగనూరును హైసెన్నిటివ్ నియోజకవర్గంగా గుర్తించి ఎన్నికలను సజావుగా నిర్వహించాలని కోరారు. పుంగనూరులో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని విజ్ణప్తి చేశారు. సదుం సంఘటనలో జరిగిన అల్లర్ల వివరాలతో పాటు అన్ని సాక్ష్యాధారాలను రామచంద్రయాదవ్ ఫిర్యాదుతో పాటు జత చేశారు. పోటోలు, వీడియోలు, మీడియాలో వచ్చిన కధనాలతో పాటు పూర్తి సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేశారు. ఏఏ వాహనాలు దగ్దమయ్యాయి, ఏఏ వాహనాలు ధ్వంసం అయ్యాయో వాటి వివరాలను కూడా ఫిర్యాదుతో పాటు అంజేశారు. దీంతో ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. ఈ సంఘటన మీద పూర్తి నివేదికను తెప్పిమ్చుకుంది. ఇందుకు భాధులను చేస్తూ.. తొలుత అనంతపురం రేంజ్ డి ఐ జీ అమ్మిరెడ్డి మీద ఎన్నికల సంఘం వేటు వేసింది. తక్షణం ఆయనను బదిలీ చేసింది. అనంతరం పలమనేరు డి ఎస్ పి మహేశ్వర రెడ్డి, సదుం ఎస్ ఐ మరుతీలను బదిలీ చేసింది. వారి స్థానాల్లో కొత్తవారిని నియమించాలని అదేశించింది. ఈ సంఘటన మీద విచారణ జరిపి సదుం ఎస్ ఐ మారుతీ ఏకపక్షంగా వ్యవహరించారని రుజువు కావడంతో అనంతరపురం వి ఆర్ లో ఉన్న మారుతిని సస్పెండ్ చేస్తూ డి ఐ జీ ఆదేశాలు జారీ చేశారు. ఈ అదేశాలు బుధవారం అందచేశారు. అయితే పోలిస్ విభాగం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచింది. జిల్లా ఎస్పి మణికంఠ చందోలు ఈ విషయాన్ని ద్రువీకరించారు.