నాడు టిడిపి అభ్యర్థులు నేడు వైసీపీ ప్రచార సారధులు
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండారని చిత్తూరు జిల్లా రాజకీయాలలు మరో మారు రుజుఉ చేశాయి. పుంగనూరు, పూతలపట్టు నియోజకవర్గాల నుండి గతంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసిన వారు ప్రస్తుతం వైసీపీలో చేరారు. ఆనాడు వైసిపి అభ్యర్థులను సూటిగా విమర్శించి, ఆరోపణలు గుప్పించి ఓడించడానికి ప్రయత్నం చేసిన వారు, నేడు వైసీపీ విజయానికి కృషి చేస్తున్నారు. ఆనాడు రేయింబవుళ్లు వైసీపీని ఓడించడానికి పథకాలు పన్నిన నేతలు నేడు వైసిపిని గెలిపించడానికి రేయింబవళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఆనాడు వైసిపి మీద ఎక్కుపెట్టిన విమర్శలను విస్మరించి, నేడు తెలుగుదేశం పార్టీ మీద విమర్శలను ఎక్కుపెడుతున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలను వైసీపీ పార్టీలోకి ఆహ్వానిస్తూ, వారికి వైసీపీ కండువాలు కప్పుతూ, ప్రచార కార్యక్రమంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.
పుంగనూరు నుండి గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నూతనకాల్వ అనీషా రెడ్డి పోటీ చేశారు. ఇద్దరు హోరా హోలీగా ఒకరిని ఒకరు ఓడించడానికి పోటీలు పడ్డారు. మొదటిసారిగా అనీషా రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేయడంతో, ఆమె చివరి వరకు ఎంతో పట్టుదలతో రామచంద్రారెడ్డిని ఓడించడానికి గట్టి ప్రయత్నం చేశారు. హోరాహోలీగా పోరాడారు. చివరకు 42, 710 ఓట్ల తేడాతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయం సాధించారు. ఎన్నికల అనంతరం కొన్ని నెలలకు నియోజకవర్గ ఇన్చార్జిగా అనీషారెడ్డిని తప్పించి, పులిచెర్లకు చెందిన చల్లా రామచంద్రారెడ్డిని నియోజకవర్గ ఇన్చార్జిగా నిర్మించారు. ఆమెకు పార్టీ పదవి కూడా ఇవ్వకపోవడంతో ఆనాటి నుండి అనీషా రెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఆమె భర్త శ్రీనాథ రెడ్డి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆమె బావ అమర్నాథరెడ్డి మాజీ మంత్రి ప్రస్తుతం పలమనేరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమె మరోసారి తెలుగుదేశం పార్టీ తనకు పుంగనూరు అభ్యర్థిగా అవకాశం వస్తుందని భావించారు. అయితే పార్టీ ఆమెను సంప్రదించకుండా చల్లా రామచంద్రారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడంతో, ఆమె వైసీపీ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో కలిసి పుంగనూరులో వైసీపీ విజయానికి కృషి చేస్తున్నారు. అన్ని మండలాల్లో పర్యటించి తెలుగుదేశం కార్యకర్తలకు వైసిపి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి, వైసిపిని పటిష్టం చేస్తున్నారు.
2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పూతలపట్టు నుండి లలితకుమారి పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థిగా సునీల్ కుమార్ ను ఆ పార్టీ రంగంలోకి దించింది. లలిత కుమారి సునీల్ ని ఓడించడానికి తాను సర్వశక్తులను వడ్డారు. లలిత కుమారిని ఓడించడానికి సునీల్ ప్రయత్నం చేశారు. ఘాటుగా విమర్శలు చేశారు. విమర్శలు, ప్రతి విమర్శలతో ఎన్నికల బరి వేడెక్కింది. లలిత కుమారి 902 ఓట్ల తేడాతో సునీల్ మీద ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో కూడా లలిత కుమారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆమె వైసీపీ అభ్యర్థి ఎమ్మెస్ బాబు చేతుల్లో 29,163 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎన్నికల అనంతరం దేశం పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసిపిలో చేరారు. తనను ఓటించడానికి ప్రయత్నం చేసిన సునీల్ తో కలిసి గ్రామ గ్రామాన పర్యటిస్తున్నారు. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎండను కూడా లెక్కచేయకుండా ప్రచార కార్యక్రమంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. వైసీపీ అభ్యర్థి సునీల్ గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. గత ఎన్నికలలో విమర్శలు ప్రతి విమర్శలను మర్చిపోయి పార్టీ కోసం అంకితభావంతో చేస్తున్నారు. ఈ ఎన్నికలలో పుంగనూరు నుండి వైసీపీలో జరిగిన అనీషా రెడ్డి, పూతలపట్టు నుండి వైసీపీలో చేరిన లలిత కుమారి ప్రచారం ఆ పార్టీకి ఎంతవరకు కలిసి వస్తుందో, విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే.