వ్యతిరేక ఓటు అంటున్న ప్రతిపక్షం
అంగీకరిస్తున్న అధికార పక్షం
అధికార పార్టీ అభ్యర్థుల్లో గుబులు
జిల్లాలో భారీగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు
2,469 మంది ఒతటింగునకు దూరం
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో భారీగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ పర్యాయం పోస్టల్ బ్యాలెట్లు పోల్ కావడం విశేషం. దీంతో ఈ సంవత్సరం పోస్టల్ బ్యాలెట్లులలో ఎవరికి మెజారిటీ వస్తుందన్న విషయం చర్చనీయంశంగా మారింది. ఈ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ సునామీలాగా ఏకపక్షంగా ఉంటుందని పలువురు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ లలో అత్యధిక భాగం తమకే వస్తుందని ప్రతిపక్షత తెలుగుదేశం పార్టీ అభిప్రాయపడుతుంది. ఈ విషయాన్ని అధికార వైసిపి నాయకులు కూడా అంగీకరిస్తున్నారు. ఈసారి పోస్టల్ బ్యాలెట్లు టిడిపికి అనుకూలంగా ఉంటుందని రాజకీయ పరిశీలనతో పాటు రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా భావిస్తున్నారు.
చిత్తూరు జిల్లాలో 17,385 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఇందులో చిత్తూరు జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 14,761 ఓట్లు కాగా, చిత్తూరు జిల్లా నుండి ఇతర జిల్లాలకు 3,124 ఓట్లు పోలయ్యాయి. తొలిత పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ రెండు రోజులు ఉంటుందని భావించినా, దానిని మూడు రోజులపాటు పొడిగించారు. పోస్టల్ బ్యాలెట్ వేయడానికి ఉద్యోగులు గంటలు తరబడి క్యూలైన్లో నిలబడి తమ ఓటును వినియోగించుకున్నారు. చిత్తూరు జిల్లాలో పోలింగ్ విధులను నిర్వహించిన 15,554 మంది పోస్టల్ బ్యాలెట్ కోసం నమోదు చేసుకోగా, అందులో 14,114 మంది మాత్రం పోస్టల్ బ్యాలెట్ లను తీసుకుని, తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 1,440 మంది ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకోలేదు. అలాగే అత్యవసర సేవా విభాగాలు విద్యుత్తు, తగు నీటి సరఫరా విభాగాలకు సంబంధించి 4,331 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 3,302 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా, 1029 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. జిల్లాలో మొత్తం మీద 19,885 మంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకొని, అందులో 17,416 మంది పోస్టల్ బ్యాలెట్లు తీసుకుని, తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2,469 మంది మాత్రం పోస్టు పోస్టల్ బ్యాలెట్ లను ఉపయోగించుకోలేదు.
జిల్లాలో భారీ ఎత్తున పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ఎవరికి అనుకూలంగా ఉంటుందన్న చర్చ జిల్లాలో జోరుగా జరుగుతోంది. కౌంటింగ్ ప్రక్రియ దగ్గర పడే కొద్ది ఉహగానాలు జోరందుకున్నాయి. గత ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉగ్యోగ వ్యతిరేక వైఖరిని అవలంభించిన కారణంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తమకే ఎక్కువ పడ్డాయని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, నాయకులు అంటున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు కూడా ఇదే విషయాన్ని అంగీకరిస్తున్నారు. జగన్ ప్రభుత్వం ఎన్నికల విధుల నుండి ఉపాధ్యాయులను తప్పించి, గ్రామ సచివాలయ సిబ్బంది చేత నిర్వహించాలని పథకం ప్రకారం పావులుకలిపింది. ఉపాధ్యాయులకు బోధనేతర విధుల నుండి మినహాయించాల్సిందిగా కోరుతూ, అలాగే ఎన్నికల విధులను గ్రామ సచివాలయ సిబ్బందితో నిర్వహించాలని ఎన్నికల కమిషన్ కు ప్రతిపాదనలు పంపింది. అయితే ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. ఎన్నికల విధులను ఉపాధ్యాయులతో మాత్రమే నిర్వహించాలని స్పష్టం చేసింది. అలాగే గతంలో ఇచ్చిన పిఆర్సి రివర్స్ లో ఉండడం కూడా ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆగ్రహావేశాలతో ఉన్నట్లు తెలుస్తోంది. పిఆర్సి నిర్వహిస్తే జీతాలు పెరగడం పోయి, తగ్గడంతో పాత పిఆర్సినే అమలు చేయాల్సిందిగా ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు రోడ్డు కెక్కిన విషయం తెలిసిందే. అలాగే విద్యాశాఖ ఉన్నతాధికారి ప్రవీణ్ ప్రకాష్ జిల్లాల్లో పర్యటిస్తూ అధ్యాపకులను భయభ్రాంతులకు గురి చేశారు. వారు ఎక్కడికి వెళితే అక్కడ ఉపాధ్యాయుల మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం ఉపాధ్యాయులను కలిసివేసింది. దీనికి తోడు ఉద్యోగ ఉపాధ్యాయులు జీతాల కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో ప్రతినెల 1వ తేదీన ఉద్యోగ ఉపాధ్యాయులకు జీతాలు అందిస్తుండగా జగన్ ప్రభుత్వంలో జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. 1వ తారీకు నుంచి 15వ తారీకు లోపు ఎప్పుడైనా జీతాలు పడే పరిస్థితి ఏర్పడింది. నిర్దిష్టంగా జీతాలు ఒక తేదీ అంటూ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు పడడంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురయ్యారు. ఒకటవ తారీఖున చెల్లించాల్సిన ఈ ఎం ఐ లు, ఇతర విషయాలను వాయిదా వేసుకోవలసి వచ్చింది. ఈ ఎం ఐ లు సక్రమంగా చెల్లించకపోవడంతో అపరాధ వడ్డీని ఎదుర్కోవల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే ఉపాధ్యాయ ఉద్యోగుల ఖాతాల్లోని పిఎఫ్ మొత్తాలు కూడా మాయమయ్యాయి. ఈ విషయాన్ని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన సాంకేతిక కారణాలతో పొరపాటు జరిగిందని అంటూనే, వాటిని పునరుద్ధరించే కార్యక్రమాన్ని చేపట్టలేదు. పిఎఫ్ మీద ఉద్యోగులు రుణం కోసం దరఖాస్తు చేసుకున్న ఆమోదం లభించలేదు. పదవి విరమణ చేసిన ఉద్యోగ ఉపాధ్యాయులకు కూడా సకాలంలో బెనిఫిట్స్ అందలేదు. వీటికి తోడు అంగన్వాడి ఉపాధ్యాయులు 15 రోజులు పాటు సమ్మె చేసిన ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించలేదు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంటు చేస్తామని హామీని నెరవేర్చలేదు. దీంతో జగన్ ప్రభుత్వం మీద ఉద్యోగ ఉపాధ్యాయ వ్యతిరేక ప్రభుత్వంగా ముద్రపడింది. దీనితో ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఈ పర్యాయం భారీగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదైనట్లు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ప్రతిపక్ష వైసిపి పార్టీకి అత్యధికంగా పోల్ అయ్యాయి. ఈ పర్యాయం కూడా పోస్టల్ బ్యాలెట్లు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే పరిస్థితి ఉందని భావిస్తున్నారు. అసలు విషయం తేలాలంటే మరో పది రోజులు పాటు వేసే ఉండాల్సిందే !