నేల పాలైన మామిడి పంట, నేలవాలిన చెట్లు
కొనే దిక్కులేక మామిడి రైతుల ఎదురుచూపు
విరిగిపడిన మామిడి చెట్ల కొమ్మలు
నష్టం అంచనాలో ఉద్యానవన శాఖ వైఫల్యం
మొక్కుబడిగా అంచనాల తయారీ
పూతలపట్టు నియోజకవర్గాన్ని విస్మరించిన అధికారులు
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
అకాల వర్షాలు, ఈదురు గాలులు చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకు అపార నష్టాన్ని మిగిల్చాయి. కాయలు ఇంకా పక్వానికి వస్తుంది అనుకున్న దశలో గాలులతో కూడిన వర్షానికి మామిడి నేలపాలయ్యింది. మామిడికాయలు ఇంకా పక్వానికి రాకపోవడంతో వాటిని కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. పంట సగానికి పైగా నేలపాలు కావడంతో మామిడికాయ రైతులు ఆందోళన చెందుతున్నారు. మామిడి రైతులు రాలిన మామిడికాయలను కుప్పలుగా పోసి ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఎదురుచూస్తున్నారు. కొంతమంది దళారీలు మూడు నుంచి నాలుగు రూపాయలకు కిలో మామిడికాయలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతన్నకు ఏమాత్రం గిట్టుబాలు కాకుండా ఆవేదన చెందుతున్నారు. కాయలు రాలడమే కాకుండా భారీగా చెట్లు కొమ్మలు విరిగిపడ్డాయి. చాలా చోట్ల మామిడి చెట్లు వేళ్ళతో పెకలింపబడి కింద పడ్డాయి. అకాల వర్షాలు రైతులను కోలుకోలేని దెబ్బకొట్టింది. జిల్లాలో ఈ పర్యాయం మామిడి దిగుబడి అంతంత మాత్రమే. రావలసిన దిగుబడిలో 10 శాతం కూడా రాలేదని ఉద్యానవన శాఖ అధికారులు అంచనా వేశారు. సాధారణంగా ఐదు లక్షల టన్నుల దిగుబడి రావాల్సి ఉండగా, ఈ సంవత్సరం లక్ష టన్నులు మాత్రమే వస్తాయని అంచనా వేశారు. పది శాతం మాత్రమే కాసిన మామిడికాయలను మామిడి రైతులు అపురూపంగా కాపాడుకుంటూ వచ్చారు. వేసవికాలంలో విద్యుత్తు సరిగా లేకపోయినా, భూగర్భ జలాలు అడుగంటిననా ఏదో ఒక విధంగా మామిడి పంటకు నీళ్లు పెడుతూ వచ్చారు. రెండు దపాలుగా పురుగు నివారణ మందులను పిచికారి చేశారు. మామిడి తోటలకు అవసరమయ్యే ఎరువులను వేశారు. ఈసారి కాపు తక్కువగా ఉండటంతో ధర బాగా పలుకుతుందని ఆశపడ్డారు. వ్యాపారస్తులు టన్నుకు 25 వేల రూపాయలు వస్తుందని అంచనాతో మామిడి కాయలను తోపుల మీద కొనుగోలు చేశారు. దీంతో ఈ పర్యాయం దిగుబడి తక్కువ వచ్చినా, కాపుకు కొంతైనా గిట్టుబాటు ధర వస్తుందని రైతులు భావించారు. అయితే ఈ అకాల వర్షాలు, ఈదురు గాలులు రైతుల ఆశలను అడిఅశాలు చేసేయి. జిల్లాలో మూడవ తేదీన 4.8 మిల్లీమీటర్ల, నాలుగో తేదీన 2.0, ఐదో తేదీన 3.7, ఏడవ తేదీన 19 మిల్లీమీటర్లు, 8వ తేదీన16.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. పూతలపట్టు నియోజకవర్గంలో భారీగా వర్షపాతం నమోదయింది. ఈ వర్షపాతానికి మూడో తేదీ మామిడి పంట చాలావరకు రాలింది. అప్పట్లో కొందరు వ్యాపారస్తులు రాలిన మామిడికాయలను కిలో ఏడు రూపాయలు చొప్పున కొనుగోలు చేశారు. ఏడవ తేదీన కురిసిన వర్షం ఈదురు గార్ల కారణంగా భారీగా పంట నష్టం జరిగింది. అలాగే 6,7 తేదీల్లో కూడా భారీగా పంట నష్టం జరిగిం.ది దాదాపుగా ముప్పాతిక భాగం పంట నేలపాలు అయింది. ఈ కాయలను మూడు రూపాయల నుంచి నాలుగు రూపాయలకు కొనుగోలు చేయడానికి వర్తకులు ముందుకు వచ్చారు. జిల్లాలో మామిడి ప్రాసెసింగ్ యూనిట్లను ఇంకా ప్రారంభించలేదు. కాయలు పక్వానికి రాని కారణంగా జ్యూస్ ఫ్యాక్టరీల ప్రారంభం కాలేదు. దీంతో మామిడికాయలను ఏం చేయాలో తెలియకుండా రైతులు అయోమయ పరిస్థితిలో పడ్డారు. దామలచెరువు, పాకాల, ఐరాల, పూతలపట్టు, తవణంపల్లి,, బంగారుపాలెం, యాదమరి మండలాల్లో భారీగా పంట నష్టం జరిగింది. పంట నష్టంతో పాటు మామిడి కొమ్మలు విరిగిపడ్డాయి. పలుచోట్ల మామిడి చెట్లు కూడా పడిపోయాయి. పంట నష్టాన్ని అంచనావేయడంలో ఉద్యానవన శాఖ పూర్తిగా విఫలం అయింది. ఏదో నామమాత్రంగా కొన్ని మండలాల్లో పంట నష్టం జరిగినట్లు అంచనాకు వచ్చారు. ఉద్యానవన శాఖ అధికారులు పూతలపట్టు నియోజకవర్గాన్ని పూర్తిగా విస్మరించారు. పుంగనూరులో 20 యాక్టర్లలో, గంగవరంలో 34 హెక్టార్లలో, పెద్దపంజణిలో 60 ఎకరాలలో, చిత్తూరులో నాలుగు హెక్టార్లలో మామిడి పంటలు దెబ్బతిన్నాయని, వీటి నష్టం 59 లక్షలు గా పేర్కొన్నారు. 110 మంది రైతులు దెబ్బతిన్నారని లెక్కల తయారు చేశారు. గ్రామ గ్రామాన ఉద్యానవన శాఖకు సిబ్బంది ఉన్న నష్ట పరిహారం అంచనాలను తయారు చేయడంలో పూర్తిగా వైపల్యం చెందారు. పూతలపట్టు నియోజకవర్గంలో భారీగా పంట నష్టం కదా జరిగింది. అయితే ఉద్యానవన శాఖ అధికారులు ఎన్ని నియోజకవర్గాన్ని పూర్తిగా విస్మరించి, తమకు అందిన అంచనాలతో ఒక తప్పుడు నివేదికను తయారుచేసి ప్రభుత్వానికి పంపించారు. ఈ నివేదిక ప్రకారం మామిడి 114 హెక్టార్లలో, అరటి రెండు హెక్టార్లలో, ఇతర పంటలు రెండు హెక్టార్లలో దెబ్బతిన్నట్లు సూచించారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ కలుగచేసుకొని, వాస్తవ నష్టాన్ని అంచనా వేయల్చిన అవసరం ఉంది. రాజకీయ పార్టీలు కూడా ఈ విషయంలో వత్తిడి తేవాల్చిన అవసరం ఉంది.