వైఎస్సార్ జలకళ ఇదో పగటి కల
దరఖాస్తులు 1889, బోర్లు వేసినవి 141
ఆమోదం 1117, పెండింగ్ 772
వేసిన బోర్లు 83 పుంగనూరు నియోజకవర్గంలోనే
బిల్లులు అందక ముందుకు రాని కాంట్రాక్టర్లు
రైతుల ఆశల మీద నీళ్ళు
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
సొంతంగా బోరుబావులు తవ్వుకొని వ్యవసాయం చేయలేని సన్నాచిన్న కారు రైతులను ఆదుకోవాలని వైసిపి ప్రభుత్వం చేపట్టిన వైఎస్ఆర్ జలకళ పథకం చిత్తూరు జిల్లాలో అందని ద్రాక్షగా మారింది. లక్ష్యాల సాధనకు ఆమడ దూరంలో నిలచింది. బోర్ల తవ్వకం బిల్లులను గుత్తేదారులకు చెల్లించకపోవడంతో అర్ధాంతరంగా ఈ పథకం ఆగిపోయింది. బోర్లు వేయడానికి బోర్ వెల్ యజమానులు ముందుకు రాకపోవడంతో చిత్తూరు జిల్లాలో ఈ పథకం ముందుకు సాగలేదు. ఎన్నో ఆశలతో ఉచిత బోర్ల కోసం దరఖాస్తు చేసుకున్న రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ పథకం కింద 2.5 ఎకరాల నుండి 5 ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు ఉచితంగా బోరు వేసి, విద్యుత్తు కనెక్షన్ ఇవ్వాలని భావించారు. మోటారు కూడా ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుంది.
చిత్తూరు జిల్లాలో ఇప్పటి వరకు 1889 రైతులు వైఎస్సార్ జలకళ పథకం కోసం ధరఖాస్తు చేస్తుకున్నారు. ఇందులో 1117 ధరఖాస్తులను ఆమోధించారు. 772 ధరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 141 బోర్లను తవ్వారు. జిల్లాను అయిదు క్లాస్టర్లుగా విభజించారు.చిత్తూరు క్లాస్టర్ లో 43 బోర్లు, కుప్పంలో 1, నగరిలో 23, పుంగనూరులో 45, సదంలో 38 బోర్లు తవ్వారు. జిల్లాలో తవ్విన బోర్లలో ముప్పాతిక భాగం 83 పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఇలాఖలోనే వేశారు. రైతుల భూముల్లో ఉచితంగా బోర్లు తవ్వే వైఎస్సార్ జలకళ పథకం అమలు ఒకడుగు ముందుకు, రెండడుగుల వెనక్కి అన్నట్లు తయాయ్యింది. రైతుల నుంచి స్పందన బాగున్నా, అదే స్థాయిలో బోర్లు తవ్వడం లేదు. వీటిని తవ్వే గుత్తేదారు సంస్థలకు 50 కోట్లకుపైగా బిల్లులు చెల్లించాలి. మొదట్లో ఉత్సాహం చూపిన గుత్తేదారులు..బిల్లుల చెల్లింపులో జాప్యంతో పలు చోట్ల పనులు అర్ధాంతరంగా నిలిపేశారు. ఇంకొన్ని ప్రాంతాల్లో అధికారుల ఒత్తిడితో ఒకటి, అర బోర్లు వేశారు. 2022 మే నుంచి గుత్తేదారులకు చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో బోరు బండ్లతో గుత్తేదారులు వెనుతిరికి వెళ్లిపోయారు. రైతుల దరఖాస్తులపై జియాలజిస్టులు సర్వే పూర్తి చేయడంలోనూ జాప్యమవుతోంది. క్షేత్ర స్థాయిలో వీఆర్వో పరిశీలించి అర్హత కలిగిన రైతుల దరఖాస్తులను డ్వామా సహాయ పథక సంచాలకులకు పంపుతారు. అక్కడ కూడా పరిశీలన పూర్తయ్యాక జియాలజిస్టు సర్వే మొదలవుతుంది. బోరు తవ్వేందుకు ఉన్న అనుకూలతలపై రైతుల భూముల్లో వీరు సర్వే చేసి నివేదిక ఇస్తారు. బోర్లు తవ్వే గుత్తేదారు సంస్థలే అర్హత కలిగిన జియాలజిస్టులతో సర్వే చేయించేలా గ్రామీణాభివృద్ధి శాఖ ఒప్పందం చేసుకుంది. జియాలజిస్టుల కొరత, గుత్తేదారులకు బిల్లుల చెల్లింపులో జాప్యంతో సర్వే మందకొడిగా సాగుతోంది. రైతుల భూముల్లో ఉచితంగా బోర్లు తవ్వించాలని తొలుత నిర్ణయించిన ప్రభుత్వం తరువాత పంపుసెట్ సమకూర్చి విద్యుత్ కనెక్షన్ కూడా ఇప్పించేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 8వేల బోర్లు తవ్వినా ఒక్కదానికీ విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదు. గ్రామీణాభివృద్ధిశాఖ ప్రతిపాదనలపై విద్యుత్ పంపిణీ సంస్థలు ఇటీవల సర్వే చేసి దాదాపు 300 బోర్లకు సంబంధించి ఎన్ని కిలోమీటర్లలో విద్యుత్ లైన్లు, స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు అవసరమో అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు అవసరమయ్యే నిధులు గ్రామీణాభివృద్ధి శాఖ విడుదల చేస్తే విద్యుత్ సంస్థలు తదుపరి చర్యలు తీసుకోనున్నాయి.ఈ ప్రక్రియ పూర్తయ్యాక రైతులకు పంపుసెట్లు పంపిణీ చేయాలి. గుత్తేదారు సంస్థలకు పెండింగు బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. చెల్లింపుల్లో జాప్యం పనులపై కొంత ప్రభావం చూపినా, ఎన్నికలు రావడంతో బోర్లు తవ్వే అవకాశం లేదని వివరించారు. ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వం మళ్లీ వస్తే బోర్ల తవ్వకం జరుగుతుందని, లేకుంటే ఇంతటితో మంగళం అని ఒక అధికారి తెలిపారు.