2, మే 2024, గురువారం

పెనం మీద నుండి పొయ్యిలో పడినట్లు పించానుదారుల పరిస్థితి

బ్యాంకుల కోసం 5 -10 కిలో మీటర్లు వెళ్ళాలి

మండుటెండలతో  సోమ్ముసిల్లిపోతున్న అవ్వా, తాతలు 

బస్సులు లేక ఆటోలలో అవస్థలు 

బ్యాంకులలో సిబ్బందిలేక గంటల తరబడి నిరీక్షణ 

కొందరు లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు కట్‌

మైనస్‌ ఖాతాల్లో జమ చేయడంతో కోత

ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.

పించందారుల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడినట్లు అయ్యింది. ఏప్రిల్ నెలలో గ్రామ సచివాలయాల వద్ద పించన్ పంపిణి చేయగా, మే నెలలో బ్యాంకు ఖాతాల్లో జమ చేయడంతో డబ్బులు తీసుకునేందుకు చాలా చోట్ల ఇబ్బంది పడ్డారు. వృద్ధాప్య పెన్షన్‌ వచ్చిందో లేదో తెలుసుకునేందుకు బ్యాంకు వద్ద వృద్దులు పడిగాపులు గాస్తున్నారు. మేడే కారణంగా బుధవారం బ్యాంకుకు సెలవన్న విషయం తెలియక చాలా మంది బ్యాంకులకు వచ్చారు. రెండవ తేదిన పించన్ పంపిణి మీద జిల్లా స్థాయిలో శిక్షణ ఇచ్చారు. ఇలా రెండు రోజులు కూడా బ్యాంకుల చుట్టూ తిరగాల్చి వచ్చింది. 


చిత్తూరు జిల్లాలో సామాజిక పెన్షన్లు 2,72,864 మందికి 7987.1`9లక్షల రూపాయలను అందజేయాలి. ఇందులో వృద్ధాప్య పెన్షన్లు1,46,023  కాగా, చేనేత కార్మికులకు 2,575, వితంతువులకు 59,903, వికలాంగులకు 35,927, అభయహస్తం కింద 11,358, కల్లుగీత కార్మికులకు 562, ఒంటరి మహిళలకు 5,751, చేపలు పట్టే వారికి 248, డబ్బు కళాకారులకు 6,296, చెప్పులు కుట్టే వారికి 794, కళాకారులకు 71, సైనిక వెల్ఫేర్ తరపున 62, డిఎం అండ్ తరఫు2764 మందికి పింఛన్లు ఇవ్వాలి. వీరికి గ్రామ సచివాలయాలు అందుబాటులో ఉన్నాయి. కిలో మీటరు నుండి రెండు కిలో మీటర్ల దూరం వెళ్తే సరిపోతుంది. బ్యాంకుల కోసం 5 నుండి 10 మైళ్ళ దూరం వెల్లాల్చి వస్తుంది. బస్సు సౌకర్యాలు లేకుండా, ఆటోలలో వెళ్లి అక్కడ పడిగాపులు కాయడానికి ఇబ్బంది పడుతున్నారు. నగదు తీసుకోవడానికి ఫారం నింపి లైన్లో వేచి ఉండాలి. ఎండలు ఎక్కువగా  ఉండటంతో సోమ్ముసిల్లిపోతున్నారు. పలువురు లబ్ధిదారులకు బ్యాంక్‌ ఖాతాల్లో పింఛను సొమ్ము జమ కాగానే డబ్బులు కట్‌ అయ్యాయి. మైనస్‌ బ్యాలెన్స్‌ ఉన్న ఖాతాల్లో పింఛను జమ చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడిందనీ బ్యాంకు సిబ్బంది అంటున్నారు. చేతికి వస్తుందనుకున్న సొమ్ములో కొంత భాగం బ్యాంక్‌ చార్జీల రూపంలో కట్‌ కావడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. ఒక వృద్ధుడికి మూడు వేల రూపాయలకు బదులు 2,662 రూపాయలు చేతికొచ్చాయి. మరొకరికి 338 రూపాయలు కట్‌ చేశారని బాధితుడు వాపోయారు. మే రెండవ తేదీ వచ్చినా పెన్షన్ అందక మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ఏ గ్రామంలోకి వెళ్లినా సచివాలయాల దగ్గర మహిళలు పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. మాకీ కష్టం ఎందుకురా భగవంతుడా అనే మహిళలు కూడా లేకపోలేదు.సాధారణంగా ఒకటవ తేదీకే వాలంటీర్లు ఇంటికొచ్చి తలపుతట్టి అర్హులైన వారికి పెన్షన్ అందజేసేవారు. అయితే గత నెల నుంచి పెన్షనర్లు తమకు పెన్షన్ అందుతుందో లేదో అన్న అయోమయానికి గురవుతున్నారు. వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు ఇచ్చే ఇంటింటికి ఇచ్చే పెన్షన్లు ఆగిపోయాయి. సిటిజెన్స్ ఫర్ డెమొక్రసీ అనే సంస్థకు చెందిన నిమ్మగడ్డ ప్రసాద్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో పింఛన్ల పంపిణీకి బ్రేక్ పడింది. ఇంటివద్దకు వాలంటీర్లు ప్రభుత్వ పథకాలు, సంక్షేమ ప్రయోజనాలు అందించకుండా ఈ కార్యక్రమంపై నిషేధం విధిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇంటివద్దకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిలిచిపోవడంతో జిల్లాలో  2,72,864 మంది లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత నెల అంటే ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల్లో పింఛన్ పంపిణీ చేపట్టింది. అయితే మండుటెండలో వృద్ధులు పింఛన్ కోసం వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో కొందరు సొమ్మసిల్లిపడిపోయారు. ఇక మే నెలలో కూడా అదే పరిస్థితి కొనసాగింది. పింఛన్ అందలేదు. బ్యాంకులకు వెళ్లాలి. కొందరు లబ్ధిదారులకు బ్యాంకులో అకౌంట్ లేదు. వారు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది.

ఓట్ల కోసం అవ్వా తాతలను ఇబ్బంది  పెడుతున్న జగన్‌: దగ్గుమళ్ళ ఆగ్రహం

రాజకీయ స్వార్ధం కోసం సీఎం జగన్.. పింఛనర్ల జీవితాలతో ముఖ్యమంత్రి జగన్ అడుకున్తున్నారని చిత్తూరు టిడిపి పార్లమెంటు అభ్యర్థి దగ్గుమళ్ళ ప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరులో అయన 'ప్రభ న్యూస్ బ్యూరో' తో మాట్లాడుతూ.. జనసేన బీజేపీ టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే చంద్రబాబు రూ.4 వేల పింఛన్ ఇస్తారని  హామీ ఇచ్చారు. అవ్వా తథలకి పించన్లు ఇంటి వద్దనే ఇవ్వాలని తాము ప్రభుత్వాన్ని, ఎన్నికల కమిషన్టీ కు విజ్ఞప్తి చేసినా, పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి వచ్చాక కూడా వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామన్నారు. రాష్ట్రంలో పింఛనర్లకు నగదు ఇవ్వకపోవడంపై దగ్గుమళ్ళ ఘాటుగా స్పందించారు. రాజకీయ స్వార్ధం కోసం సీఎం జగన్.. పింఛనర్ల పొట్టకొట్టారని.. జనసేన బీజేపీ టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే  పింఛన్ రూ.4 వేలకు పెంచి  ఇస్తామని తెలిపారు. ఈ రెండు పింఛన్ అందనివారికి.. తమ ప్రభుత్వం రాగానే కలిపి చెల్లిస్తామన్నారు.  గద్దె దిగుతూ కూడా జగన్ పైశాచికంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటికీ జగన్ రూ.13 వేల కోట్లను కాంట్రాక్టర్లకు చెల్లించారని.. ఎవరెవరికి ఎన్ని బిల్లులు ఇచ్చారో ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. వాలంటీర్లకు నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ ఇచ్చి మంచి జీతం వచ్చేలా చేస్తామని వివరించారు. కాగా.. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపీలో వాలంటీర్ల విధులపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించిన విషయాన్నీ గుర్తు చేశారు. పింఛన్లు సహా నగదు పంపిణీని వాలంటీర్లతో చేయించొద్దని ప్రభుత్వాన్ని ఈసీ ఆదేశించిందన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించినా, ప్రభుత్వం ఘోరంగా విఫలం అయ్యిందన్నారు. ఎన్నికల కోడ్ కారణంగా వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయక పోతే, సచివాలయ సిబ్బంది చేత పంపిణి చేసే అవకాశం ఉన్నా, ప్రభుత్వం కావాలని పించానుదారులను ఇబ్బంది పెడుతుందని వివరించారు.పించానుదారులు తెలుగుదేశం పార్టీకి అండగా నిలువాలని, టిడిపి అధికారంలోకి వస్తే, 4 వేలకు పెంచిన పించన్ ఇంటి వద్దనే అందచేస్తామనీ దగ్గుమళ్ళ ప్రసాదరావు హామీ ఇచ్చారు.


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *