అటవీ కార్మికులను పట్టించుకోకపోవడం అన్యాయం: CITU
అటవీ కార్మికులను టిటిడి బోర్డు పట్టించుకోకపోవడం అన్యాయం
కందారపు మురళి
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం 900 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న అటవీ కార్మికుల గురించి చర్చించి ఓ నిర్ణయం చేయకపోవడం సమంజసం కాదని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ఓ ప్రకటనలో తీవ్రంగా విమర్శించారు. ధర్మాన్ని రక్షించండి ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుందని ప్రతినిత్యం ప్రచారం చేసే టిటిడి పేద అటవీ కార్మికుల పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తున్నదని ఆరోపించారు.
రాష్ట్ర హైకోర్టు చెప్పిన సూచనలను పాటించకుండా, తాను చేసిన తీర్మానాన్ని సైతం బోర్డు అమలు చేయకుండా, 362 మంది కార్మికుల్లో 162 మందిని పర్మినెంట్ చేసి 200 మందిని వీధుల పాలు చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ వివక్షకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. దేవదేవుని ఎదుటే యాజమాన్యం పేద కార్మికుల పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తుంటే ఎవరికి చెప్పుకోవాలని ఆయన సూటిగా ప్రశ్నించారు. టిటిడి యాజమాన్యం అటవీ కార్మికులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.