28, ఏప్రిల్ 2023, శుక్రవారం

చిత్తూరు BJPలోకి భారీగా చేరికలు ?

 చిత్తూరు BJPలోకి భారీగా చేరికలు 

జిల్లాలో మాజీ మంత్రులకు BJP గాలం

మాజీ MLAలు, MLC లతో మంతనాలు

బలమైన నాయకులతో చర్చలు  







                       ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరడంతో సొంత జిల్లాలో ఆ పార్టీకి ఆదరణ పెరిగే అవకాశం ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటికే జిల్లాలో చేరికల మీద దృష్టిని సాధించారు. రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉండి, విభజన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్న రాజకీయ నాయకుల మీద దృష్టిని సారించారు. ఒక జాబితాను రూపొందించుకొన్నట్లు సమాచారం.  చిత్తూరు జిల్లాలో కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహం ఫలిస్తే జిల్లాలో భారీగా చేరికలు ఉండే అవకాశం ఉంది. బలమైన నాయకులు బిజెపిలోకి రానున్నారు. ఇదే జరిగితే రాష్ట్రంలో పార్టీ పరంగా అత్యంత పటిష్టమైన జిల్లాగా చిత్తూరులో రూపుదిద్దుకోనుంది.


                       రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు రాజకీయాలకు  దూరంగా ఉండిపోయారు. కొంతమంది జగన్ తో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరి కొంతమంది తెలుగుదేశం పార్టీలో చేరారు. మిగిలిన వారు రాజకీయాలకు దూరం అయ్యారు. అలాంటి వారి విషయంలో బిజెపి నేతలు దృష్టిని సారించారు.  అలాగే పార్టీలో ఉంటూ పార్టీకి దూరంగా, అసంతృప్తిగా ఉన్న నాయకులపై కూడా బిజెపి నాయకులు దృష్టిని సారించినట్లు  తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి ఆ నాయకులకు స్పష్టమైన హామీ ఇవ్వగలిగితే, రాబోవు కాలంలో చిత్తూరు జిల్లాలో బిజెపి అత్యంత పటిష్టంగా తయారు కానుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలకు దీటుగా రాజకీయ వైభవాన్ని  సంతరించుకోనుంది.


                   చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన గల్లా అరుణ కుమారి కాంగ్రెస్ పార్టీలో ఈ మహిళా విభాగం అధ్యక్షురాలుగా, మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి, చంద్రగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అలాగే ఆమె కుమారుడు, గుంటూరు పార్లమెంటు సభ్యుడు జయదేవ్ గల్లా కూడా ఇటీవల పార్టీ కార్యక్రమాలకు ఆంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అమర రాజా పార్టీపై ఫ్యాక్టరీ పైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాదింపు దోరణితో వ్యవహరిస్తుండడంతో గల్లా జయదేవ్ ఫ్యాక్టరీ విస్తరణను చెన్నైకి తరలించారు. వీరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో బిజెపి నాయకులు వీరిపైన దృష్టిని సాధించారు.


                     చిత్తూరు  మాజీ శాసనసభ్యులు CK బాబు చిత్తూరు నుండి నాలుగు పర్యాయాలు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత తొలుత బిజెపిలో చేరినా, తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. పార్టీలోని విభేదాలు కారణంగా ఆయన తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్న స్తబ్దతగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలల్లో  పాల్గొనడం లేదు. సీకే బాబు చిత్తూరు ఎమ్మెల్యే టికెట్లను తిరిగి ఆశిస్తున్నారు. అయితే చిత్తూరులోని ఒక వర్గం సీకే బాబుకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. కావున సీకే బాబు పైన కూడా బిజెపి నాయకులు దృష్టిని సాధించారు.


                శ్రీకాళహస్తికి చెందిన ఎస్ సి వి నాయుడు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.  ఎమ్మెల్యే సీటు కోసం చేసిన  ప్రయత్నం  ఫలించలేదు. ఈ పర్యాయం ఆయనకు టికెట్ ఇవ్వకుంటే బిజెపి వైపు ఆకర్షించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే నగరికి చెందిన మాజీ మంత్రి రెడ్డివారి జంగారెడ్డి రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన కుమార్తె ఇందిరా ప్రియదర్శిని తన రాజకీయ వారసురాలుగా తెర మీదికి  మీదగా తీసుకురావాలన్న ఆయన కల నెరవేరడం లేదు. ప్రస్తుతం ఆయనను అధికార ప్రతిపక్ష పార్టీలు విస్మరించడంతో బిజెపి నాయకులు సంప్రదింపులు జరపడానికి సిద్ధమవుతున్నారు.


                 వేపంజేరి నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి, ఉప సభాపతి గుమ్మడి కుతూహలమ్మ రాష్ట్ర విభజన  తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆమె రాజకీయ వారసుడుగా కుమారుడు హరికృష్ణ గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓటిపోయారు. ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసిన సుబ్రహ్మణ్యం రెడ్డి రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనకు తగిన గుర్తింపు రాలేదు. అలాగే పలమనేరుకు చెందిన సుధాకర్  జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు.  సుధాకర్ కూడా ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. పెద్ద పంజానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ రెడ్డప్ప రెడ్డి, మదనపల్లికి చెందిన మున్సిపల్ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిలు కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇమడ లేక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.


                            వి. కోటకు చెందిన రెస్కో మాజీ చైర్మన్ కొంగాటం జయరాం రెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. బైరెడ్డిపల్లికి చెందిన శ్రీనివాసులు రెడ్డి కూడా క్రియాశీలక రాజకీయాలలో లేరు. తిరుపతికి చెందిన నవీన్ కుమార్ రెడ్డి TTD విషయంలో జరుగుతున్న తప్పొప్పులను ఎత్తిచూపుతో క్రియాశీలకంగా ఉంటున్నారు. ఆయన కిరణ్ కుమార్ రెడ్డికి సన్నిహితుడు. అలాగే చిత్తూరు నియోజకవర్గంలో  సమైక్యాంధ్ర పార్టీ తరఫున పోటీ చేసిన సుధాకర్ రెడ్డి ప్రస్తుతం రాజకీయాలకు  దూరంగా ఉంటున్నారు. ఆయన చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబుకు సన్నిహితుడు. జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అనుచర గణం ఉంది. కార్యకర్తల గణం కూడా ఉంది. జిల్లాలో కిరణ్ కుమార్ రెడ్డి వెంట నడిచే నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. కావున కిరణ్ కుమార్ రెడ్డి చిత్తూరు జిల్లాలో బిజెపిని బలోపేతం చేయడానికి ఇప్పటికే చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *