రాష్ట్ర రాజకీయాలలో భారీ మార్పులు
రాష్ట్ర రాజకీయాలలో భారీ మార్పులు
BJPతో మళ్ళి జతకట్టడానికి TDP రెడీ
జగన్ ప్రభుత్వ అవినీతి మీద BJP అధిష్టానం కమిటీ
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీల వ్యూహాలు చక చకా మారిపోతున్నాయి. రాజకీయాలలో శాశ్వత మిత్రుడు, శాశ్వత శత్రువు ఉండరని మరోసారి రుజువు అవుతోంది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మరోసారి బిజెపితో జత కట్టడానికి సమాయత్తమవుతోంది. అధికారంలో ఉన్న వైయస్ కాంగ్రెస్ పార్టీ మీద చార్జిషీట్ దాఖలు చేయడానికి భారతీయ జనతా పార్టీ అధిష్టానం కమిటీని నియమించింది. వీటిని పరిశీలిస్తే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నట్లు తెలుస్తోంది.
నారా చంద్రబాబు నాయుడు జాతీయస్థాయిలో బిజెపికి వ్యతిరేకంగా జాతీయ పార్టీలను ఏకతాటి పైకి తేవడానికి కాంగ్రెస్ పార్టీతో కలిసి కృషి చేశారు. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేశారు. అంతకుముందు కూడా భారతీయ జనతా పార్టీతో బిజెపి పొత్తు పెట్టుకుని మధ్యలో ఎన్డీఏ నుండి బయటికి వచ్చింది. ఇలా రెండు పర్యాయాలు ఎన్డీఏ నుంచి తెలుగుదేశం పార్టీ బయటికి రావడంతో భారతీయ జనతా పార్టీ నాయకులు చంద్రబాబు మీద వ్యతిరేకత పెంచుకున్నారు. అప్పుడు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలైంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బాబు మీద వ్యతిరేకత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, జగన్ కు భారతీయ జనతా పార్టీని దగ్గర చేసింది. అధికారికంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి పొత్తులేకున్నా, రాష్ట్రంలో జగన్ కు వ్యతిరేకంగా బిజెపి ఉద్యమిస్తున్నా, కేంద్ర ప్రభుత్వంతో మాత్రం సత్సంబంధాలు కొనసాగాయి. జగన్ మోడీ దత్త పుత్రుడు అంటూ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వర్ణించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఎప్పుడు చిక్కుల్లో పడ్డ వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటూ స్నేహ హస్తాన్ని అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా కాపాడుకుంటూ వస్తోంది.
అయితే ఇటీవల కాలంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని భాజపా అధిష్టానం కొంత దూరం పెట్టినట్లు తెలుస్తోంది. గతంలో లాగా మోడీ, అమిత్ షా ఇంటర్వ్యూలు అంత తేలిగ్గా జగన్మోహన్ రెడ్డికి దొరకడం లేదు. వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు కోరుకుపోతున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద, అధినేత జగన్మోహన్ రెడ్డి మీద ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. ఈ నేపధ్యంలో తెలుగుదేశం పార్టీ బిజెపికి దగ్గర ఇవ్వడానికి ప్రయత్నాలను ప్రారంభించింది. జగన్ దాడిని ఎదుర్కోవడానికి మొదటినుంచి బిజెపి స్నేహాస్తాన్ని తెలుగుదేశం పార్టీ ఆశిస్తుంది. అయితే భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడును నమ్మడం లేదు. అంటిముట్టనట్లు వ్యవహరిస్తూ, చూసి చూడనట్లు వదిలేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులపైన, కార్యాలయాలపైన దాడులు జరిగిన భారతీయ జనతా పార్టీ నుండి పెద్దగా స్పందన లేదు.
ఇటీవల చంద్రబాబు నాయుడు మోడీ మీద చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపిస్తున్నాయి. మోడీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఇటీవల కాలంలో మోడీకి వ్యతిరేకంగా చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని నిర్ణయాలను సమర్థిస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కానీ, ఇతర విషయాలలో గాని కేంద్ర ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుంది. మరోసారి బిజెపితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుగుదేశం పార్టీ నుంచి సంకేతాలు అందుతున్నాయి. అయితే ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ఆ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలియడం లేదు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బిజెపి కలిసి పని చేయాలన్న ప్రతిపాదనలుకు బిజెపి అధిష్టానం సుముఖంగా స్పందించలేదు. కావున పవన్ కళ్యాణ్ కొంతకాలంగా బిజెపికి దూరంగా ఉంటున్నారు.
అయితే కిరణ్ కుమార్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత ఆ పార్టీ వైఖరిలో కొంత మార్పు వస్తున్నట్లు తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి జగన్ కు అంత మంచి సంబంధాలు లేవు. ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి పట్ల పలుమార్లు జగన్మోహన్ రెడ్డి అనుచితంగా ప్రవర్తించినట్లు కూడా తెలుస్తోంది. దీంతో కిరణ్ కుమార్ రెడ్డి బిజెపికి, తెలుగుదేశం పార్టీకి పొత్తు కుదరచడానికి తనదైన శైలిలో పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి కృషి ఫలితంగా ఎన్నికల్లో పొత్తుల్లో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది
అన్నింటికంటే ముఖ్యంగా జగన్ ప్రభుత్వం అవినీతి మీద భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఒక కమిటీని నియమించడం రాజకీయ వర్గాలలో కలకలం లేపింది. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జగన్ మీద పోరాడుతున్నా, కేంద్రంలో మాత్రం మిత్రపక్షం లాగా వ్యవహరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కోరినా, కోరకపోయినా జగన్మోహన్ రెడ్డి NDA ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందిస్తున్నారు. మిత్ర పక్షం లాగే వ్యవహరిస్తున్నారు. అందుకు ప్రతిఫలంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని విధాలుగా ఆదుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం మీద ఎన్ని ఆరోపణలు, విమర్శలు వచ్చిన కేంద్రం పట్టించుకోవడం లేదు. జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో కూడా సహకారం అందిస్తుంది.
ఇది ఇలా ఉండగా నుండి నలుగురు సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వం అవినీతి పైన ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి బిజెపి అధిష్టానం ఒక కమిటీని నియమించడం రాజకీయ వర్గాలలో ఆశక్తిని లేపింది. మోడీ, అమిత్ షా సూచనల మేరకే ఈ కమిటీ నియామకమైంది. ఇందులో సీఎం రమేష్, పురందేశ్వరి, సత్య కుమార్, మాధవులు సభ్యులుగా ఉంటారు. ప్రతి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం అవినీతి పైన సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తారు. చివరలో ఈ విషయాల మీద భారీ ఆందోళన కార్యక్రమాలను కూడా రూపొందించనున్నారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం, మరోవైపు ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీకి అనుకూలంగా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాలలో కలకలం రేపుతోంది. రాబోయే కాలంలో రాజకీయంగా రాష్ట్రంలో భారీ మార్పులకు ఉండవచ్చని భావిస్తున్నారు. తిరిగి ఎన్డీఏ గూటికి చేరడానికి తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఏ మాత్రం సఫలీకృతం అవుతాయో వేసి చూడాల్సిందే.