ఉపాధి హామీ పథకం నిధులు దుర్వినియోగం: BJP
ఉపాధి హామీ పథకం నిధులు దుర్వినియోగం
విచారణకు BJP జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు డిమాండ్
జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నిధులు దుర్వినియోగం మీద సోషల్ ఆడిట్ ను ముమ్మరం చేయాలని భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కే. చిట్టిబాబు డిమాండ్ చేశారు. అయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. పేద ప్రజలను ఆదుకోవడానికి ప్రవేశపెట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి పథకం, గతంలో మన రాష్ట్రంలో అత్యంత సమర్థవంతంగా అమలుఅయ్యిందన్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే ఈ పథకం అమలుపై ప్రభుత్వ యంత్రాంగానికి శ్రద్ధ ఉన్నట్లు లేదన్నారు. క్షేత్రస్థాయిలో పనులు చేపట్టకుండానే రికార్డులు సృష్టించి ఎక్కువ పనులు చేపట్టినట్లు కేంద్ర ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించడం, తదనుగుణంగా, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ చెప్పే లెక్కలపై వివరణ కూడా కోరిన విషయాన్నీ గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధి హామీ నిధులను రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు, సచివాలయ భవనాలు, అంగన్వాడి కేంద్రాలు, పాఠశాల అదనపు గదులు, గ్రామీణ హెల్త్ సెంటర్ల నిర్మాణానికి వినియోగించుకుంటుందని తెలిపారు. ఈ క్రమంలో కేంద్రం నుంచి వచ్చిన మెటీరియల్ కాంపోనెంట్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోలేకపోతోందనీ, ఈ భవనాలను నిర్మించినటువంటి వారికి బిల్లులను చెల్లించకపోవడం వల్ల కూడా ఈ పథకం నత్త నడకన నడుస్తుందని ఆవేదన చెందారు.
క్షేత్రస్థాయిలో అధికారుల చేతివాటం వల్ల కొందరికి పనులు చేయకుండానే డబ్బులు అందించి తద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతుందని తెలుస్తుందన్నారు. జిల్లా యంత్రాంగం, రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ ఈ విషయంపై దృష్టి సారించి సోషల్ ఆడిట్ ను ముమ్మరం చేయాలని భారతీయ జనతా పార్టీ తరపున డిమాండ్ చేశారు. ఇదే కాకుండా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే ఉపాధి హామీ పథకం నిధులతో రాష్ట్రంలో అనేక భవనాలు నిర్మిస్తున్నప్పటికీ ఎక్కడ కూడా ప్రధానమంత్రి ఫోటో గాని, కేంద్ర ప్రభుత్వం పేరును గాని ప్రస్తావించకపోవడం, వాటన్నిటిపై తన స్టిక్కర్లు వేసుకోవడం చాలా దారుణంగా వర్ణించారు. ఇప్పటికైనా అధికారులు నూటికి నూరు శాతం కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టే పనుల ప్రదర్శనలో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోను చిత్రించాలని కోరారు.