31, ఆగస్టు 2025, ఆదివారం

రెండు రోజుల్లో చిత్తూరు టిడిపి పార్లమెంట్ అధ్యక్షుని నియామకం

కమ్మ సామాజిక వర్గం పట్ల త్రిసభ్య కమిటీ మొగ్గు 

మూడు పేర్లతో అధిష్టానానికి ప్రతిపాదనలు 

తుది నిర్ణయం తీసుకోనున్న పార్టీ నేత చంద్రబాబు


*చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.* 

తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షుడిని మరో రెండు రోజుల్లో ప్రకటిస్తారని విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజక వర్గాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల జాబితాలను సిద్ధం చేసి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు సమర్పించినట్టు తెలిసింది. పార్లమెంటు నియోజక వర్గాలలో పర్యటించిన ముగ్గురు పరిశీలకులు ( త్రిసభ్య కమిటీ) ఆశావహుల పేర్లు సేకరించి, విశ్లేషించి అధిష్టాన వర్గానికి అందించారు. రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ వర్ల రామయ్య, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు, ప్రోగ్రామ్స్ కమిటీ కీలక సభ్యులు అన్ని అంశాలు వడబోసి పార్లమెంటు నియోజక వర్గానికి మూడు పేర్లతో జాబితా రూపొందించి చంద్రబాబుకు సమర్పించారు. ఆయన పరిశీలించి సోమ లేదా మంగళవారం నియామక ఉత్తర్వులు ఇస్తారని సమాచారం.  

పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు, జిల్లా కమిటీ, అనుబంధ విభాగాల కమిటీల నియామకంపై పార్టీ పరిశీలకులుగా రాష్ట్ర రోడ్లు  భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, లిడ్ క్యాప్ ఛైర్మన్ పిల్లి మాణిక్యాలరావులు పాల్గొన్నారు. ఈనెల 25వ తారీఖున ఉదయం నుంచి సాయంకాలం వరకు పార్లమెంటరీ పార్టీ సమావేశం ఏర్పాటుచేసి రాశావాహుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం దరఖాస్తు చేసిన అభ్యర్థులతో ముఖాముఖి మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్ష పదవి కోసం 25 మంది దరఖాస్తు చేసినట్లు తెలిసింది. ఇందులో కమ్మ సామాజిక వర్గానికి చెందిన 16 మంది, బిసి సామాజిక వర్గానికి చెందిన నలుగురు, బలిజ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు, దళిత సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు దరఖాస్తు చేసినట్లు సమాచారం. కమ్మ సామాజిక వర్గం నుంచి పాలసముద్రానికి చెందిన చిట్టిబాబు, ఐరాల మండలానికి చెందిన మహదేవ సందీప్, గిరినాయుడు, జడ్పిటిసి సభ్యురాలు లత, చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన హేమాంబ రావు, చిన్నబాబు, చిత్తూరుకు చెందిన వసంత కుమార్, పెనుమూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు అరుణ, బంగారు పాల్యం చెందిన ఎన్పీ జయప్రకాష్ నాయుడు, నగిరి నియోజకవర్గం నుంచి పోతుగుంట విజయబాబు, తవణంపల్లి మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వర చౌదరి తదితరులు దరఖాస్తు చేసినట్లు సమాచారం. బలిజ సామాజిక వర్గం నుంచి చిత్తూరు మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్, చిత్తూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాజూరు బాలాజీ దరఖాస్తు చేశారు. దళిత సామాజిక వర్గం నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్, నగిరి నియోజకవర్గంలో నుంచి దశరధవాసు, చిత్తూరు రూరల్ మండలానికి చెందిన శశికర బాబు, బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కుప్పం నియోజకవర్గానికి చెందిన గౌనివారి శ్రీనివాసులు, బీసీ నాగరాజు, ప్రస్తుత పార్లమెంటుది పార్టీ అధ్యక్షుడు సిఆర్ రాజన్, చిత్తూరు నియోజకవర్గంలో నుంచి న్యాయవాది అశోక్ ఆనంద్ యాదవ్ దరఖాస్తు చేసినట్లు తెలిసింది. టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి పదవికి 15 మంది దరఖాస్తు చేశారు. దరఖాస్తు చేసిన వారిలో ప్రధానంగా ప్రస్తుత జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, మోహన్ రాజ్, కార్పొరేటర్ అశోక్, కార్వేటి నగరానికి చెందిన చంద్రారెడ్డి ఉన్నారు. భారీగా దరఖాస్తు చేసినా, చివరకు ఐరాల మండలానికి చెందిన మహదేవ సందీప్, పాలసముద్రం మండలానికి చెందిన దేవినేని చిట్టిబాబు, బంగారుపాలెం మండలానికి చెందిన ఎన్పీ జయప్రకాష్ పేర్లు షార్ట్  లిస్టులో ఉన్నట్లు సమాచారం. సందీప్ మహాదేవకు ముగ్గురు శాసనసభ్యులు, ఒక పార్లమెంటు సభ్యులు, ఒక మాజీ మంత్రి సిఫార్సు చేసినట్లు తెలిసింది. భీమనేని చిట్టి బాబుకు ఇద్దరు ఎమ్మెల్యేలు సిఫార్సు చేయగా, ఒక ఎమ్మెల్యే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. చిట్టిబాబుకు జిల్లా అధ్యక్ష పదవి ఇస్తే తాను పార్టీ వీడుతానని అన్నట్లు సమాచారం. ఎన్పీ జయప్రకాష్ కు ఒక శాసనసభ్యుడు మద్దతిస్తున్నట్లు తెలిసింది. ఈ ముగ్గురి పేర్లను త్రిసభ్య కమిటీ సిఫార్సు చేసి రాష్ట్ర ఎన్నికల అధికారికి అందజేయనున్నట్లు సమాచారం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సమర్థవంతమైన నాయకుడిని ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు సమాచారం. అయితే కుల సమీకరణాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజక వర్గాలలో ఏడు చిత్తూరు పార్లమెంటు పరిధిలో ఉన్నాయి. రాజంపేట పార్లమెంటు పరిధిలో నాలుగు, తిరుపతి పరిధిలో మూడు  నియోజక వర్గాలు ఉన్నాయి. కొద్ది తేడాతో పార్లమెంటు నియోజక వర్గాలు జిల్లాలుగా ఏర్పడ్డాయి. ఈ నేపధ్యంలో మూడు పార్లమెంటు నియోజక వర్గాలలో అధ్యక్షులుగా మూడు వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలన్న ఉద్దేశ్యంతో చంద్రబాబు ఉన్నారని తెలిసింది. చిత్తూరు పార్లమెంటు అధ్యక్షునిగా కమ్మ సామాజిక వర్గం నేతను నియమిస్తారని భావిస్తున్నారు. తిరుపతి పార్లమెంటు నియోజక వర్గం అధ్యక్ష పదవి బిసి, ఎస్సీ, రెడ్డి సామాజిక వర్గాలకు చెందిన ఒకరికి కేటాయిస్తారని తెలిసింది. అలాగే రాజంపేట పార్లమెంటు అధ్యక్ష పదవి కోసం రాజు, బలిజ, మైనారిటీ నేతల పేర్లు పరిశీలనలో ఉన్నాయని తెలిసింది. ఒక వేళ కుల సమీకరణలో సర్దుబాటు చేయాల్సి వస్తే చిత్తూరులో మార్పుకు అవకాశం ఉంటుందని అంటున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు సి ఆర్ రాజన్ ను కొనసాగించే అవకాశాలు కూడా ఉన్నట్లు సమాచారం. కుప్పం పర్యటనకు వచ్చిన చంద్రబాబు సి ఆర్ రాజన్ ను ఉద్దేశించి బాగా ఆక్టివ్ గ పనిచేయాలని సూచించినట్లు తెలిసింది. గతః ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చే సమయంలో కూడా ఉమ్మడి జిల్లాను ఒక యూనిట్ గా తీసుకున్నారు. పార్టీ పదవుల కేటాయింపులో కూడా అదే సూత్రాన్ని పాటిస్తారని అంటున్నారు.  అయితే ఎవరికి వారు తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. శుక్ర, శనివారాలలో కుప్పంలో పర్యటించిన చంద్రబాబును పలువురు నేతలు కలసి పార్టీ పదవులతో పాటు, కార్పోరేషన్ పదవుల కోసం పట్టుపట్టారు. ఆయన ఎవరికీ ఎలాంటి హామీ ఇవ్వకుండా తన సహజ దోరణిలో చూద్దాం, పరిశీలిద్దాం అంటూ దాటవేసినట్టు తెలిసింది.


 


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *