*చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.*
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యంవహించే కుప్పం నియోజకవర్గంలో ఇకపై ఐఫోన్ల తయారీలోనూ భాగస్వామ్యం కానుంది. ఇక్కడ యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్ చాసిస్ తయారీకి వినియోగించే ముడిపదార్థం ప్లాంట్ రాబోతోంది. ఇక్కడ ఐఫోన్ బాడీలను తయారు చేయనున్నారు. ఇందుకోసం రూ. 586 కోట్లతో సమీకృత అల్యూమినియం యూనిట్‌ను ప్రఖ్యాత కంపెనీ హిందాల్కో స్థాపించబోతోంది. ఈ సంస్థ ప్రతిపాదనలకు గురువారం ఎస్‌ఐపీబీ ఆమోద ముద్ర వేసింది. 2026 చివరి నాటికి నిర్మాణం పూర్తవుతుందని, హిందాల్కో ప్లాంట్‌లో 2027 నాటికి ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఈయూనిట్‌తో 613 మందికి ఉపాధి లభించనుంది. ఈ పెట్టుబడితో మన రాష్ట్రం యాపిల్ గ్లోబల్ సప్లై చైన్‌లో భాగస్వామ్యం అవుతుంది. ఈ విషయాలను కుప్పంలో శనివారం జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుప్పం ప్రజలకు వివరించనున్నారు.
ఈ యూనిట్‌లో తయారయ్యే అల్యూమినియం భాగాలు, ఆపిల్ ఐఫోన్ స్మార్ట్‌ఫోన్‌లకు ఛాసిస్ లేదా ఎన్‌క్లోజర్ తయారీలో ప్రాథమిక ముడి పదార్థాలుగా ఉపయోగించనున్నారు. ఈ ప్రాజెక్టుకు ఏపీ ఎలకా్ట్రనిక్స్ కాంపొనెంట్ మాన్యుఫాక్చరింగ్ పాలసీ 2025-30 కింద ఆమోదం తెలిపారు. ఇప్పటికే బెంగళూరులో ఐఫోన్ తయారీ యూనిట్ ప్రారంభమైంది. ఇక్కడకి సమీపంలోని కుప్పంలో ఈ ప్లాంట్ రాబోతుండడం ప్రాముఖ్యం సంతరించుకుంది.ఇది ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే కాకుండా భారతదేశానికి కూడా ఒక ప్రధాన మైలురాయిగా నిలవనుంది. ఎందుకంటే ఇది నేరుగా ఆపిల్ గ్లోబల్ సరఫరా గొలుసుతో రాష్ట్రాన్ని అనుసంధానిస్తుంది. హిందాల్కో కుప్పంలో ప్రాజెక్ట్‌ను ఎంచుకోవడం యాదృచ్ఛికం కాదని తెలుస్తోంది. ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు నియోజకవర్గం.అలాగే కుప్పం భౌగోళికంగా ఒక వ్యూహాత్మక ప్రదేశంగా ఉంది. బెంగళూరు నుండి కేవలం 120 కి.మీ దూరంలో ఉండటం ప్లస్ పాయింట్. అలాగే చెన్నై నుండి కేవలం 200 కి.మీ. దూరంలో ఉండటం వలన, రెండు నగరాల మౌలిక సదుపాయాలను ఉపయోగించుకునే అవకాశం ఉంది. వాస్తవానికి, బెంగళూరు నగరానికి చెందిన విమానాశ్రయానికి కుప్పం మరింత దగ్గరగా ఉంటుంది. అంతేకాకుండా, ఇది చెన్నై, బెంగళూరు మధ్య ఉన్న మూడు రాష్ట్రాల ప్రాంతంలో ఉండడం వలన, మొత్తం పర్యావరణ వ్యవస్థను ఉపయోగించుకోవడానికి అనువైన స్థానం అవుతుంది. ఇక్కడ ఫాక్స్‌కాన్ ఇప్పటికే తన రెండవ అతిపెద్ద యూనిట్‌ను ప్రారంభించి, చిన్న స్థాయిలో ఐఫోన్ 17 ఉత్పత్తి కూడా మొదలుపెట్టింది. ఈ కొత్త అల్యూమినియం సౌకర్యం మార్చి 2027 నాటికి వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించనుంది. నాలుగేళ్లలో సుమారు 613 ఉద్యోగాలను సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు. తుది ఉత్పత్తి ఐఫోన్ తయారీ యూనిట్లకు వెళుతుంది. దీని వలన ఆంధ్రప్రదేశ్ ఐఫోన్ సరఫరా గొలుసులోకి అధికారికంగా ప్రవేశం చేయనుంది. ఈ ప్రాజెక్ట్ ఏపి ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మాన్యుఫాక్చరింగ్ పాలసీ 2025-30 కింద ఆమోదం పొందుతుంది. దీని ద్వారా సంస్థకు సబ్సిడీ భూమి, ఇతర ప్రత్యేక ప్రోత్సాహకాలు లభిస్తాయి. హిందాల్కో ప్రాజెక్ట్‌తో పాటు, ఎస్ఐపిబి మరో ముఖ్యమైన పెట్టుబడిని ఆమోదించనుంది. ఎస్ఐఆర్ఎంఏ ఎస్జిఎస్ టెక్నాలజీ సంస్థ సుమారు రూ. 1,800 కోట్ల పెట్టుబడితో భారతదేశంలోనే అతిపెద్ద మల్టీ-లేయర్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్, కాపర్ క్లాడ్ లామినేట్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. తద్వారా కుప్పం క్రమంగా హై-టెక్ ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా రూపుదిద్దుకునే అవకాశం ఉంది. ఈ అంశాలన్నీ ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ తయారీ పర్యావరణంలో ఒక కీలక భాగస్వామిగా మార్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఐఫోన్ తయారీలో ఉపయోగించే చాసిస్, భాగాలు, పీసీబీలు దేశంలోనే తయారవడం వలన, భారతదేశం మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి దగ్గర కానుంది. ఏదేమైనా హిందాల్కో ప్రాజెక్ట్ అమలు అయితే ఆంధ్రప్రదేశ్ కేవలం ఒక తయారీ కేంద్రం మాత్రమే కాకుండా భవిష్యత్తులో ఆపిల్ సరఫరా గొలుసులో కీలక రాష్ట్రంగా మారుతుందని చెప్పవచ్చు. ఈ ప్రాజెక్ట్ కేవలం ఉద్యోగాల కల్పనకే పరిమితం కాదు. "మేక్ ఇన్ ఇండియా" మరియు "మేక్ ఫర్ ది వరల్డ్" అంటున్న భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఇది ఒక ముందడుగు. ఇంతకు ముందు ఐఫోన్ విడిభాగాలను దిగుమతి చేసుకుని ఇక్కడ అసెంబ్లింగ్ చేసేవారు. ఇప్పుడు ఆ ఫోన్లలో ఉపయోగించే చాసిస్‌ను ఇక్కడే తయారు చేస్తుండటం ఐఫోన్ మేకింగ్ ఇన్ ఇండియా డ్రీమ్‌లో కీలకమైన అంశం.
యాపిల్ ఫోన్ల తయారీలో కీలక అడుగు
యాపిల్ ఫోన్ల తయారీ యూనిట్ ఫాక్స్‌కాన్ను ఏపీకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు తీవ్రంగా కృషి చేస్తున్నారు. తైవాన్‌కు చెందిన ఈ ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్ కంపెనీ భారత్‌లో విస్తరణకు ప్రణాళికలు వేసుకుంటోంది. ఇప్పటికే ఏపీలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. శ్రీ సిటీలో ఫాక్స్‌కాన్‌ను అసెంబ్లింగ్ యూనిట్ ఉంది. అప్పట్లో ఇక్కడ ఐ ఫోన్ టెస్టింగ్, అసెంబ్లింగ్ చేశారు. ఇంకా శ్రీపెరంబదూర్, బెంగళూరులో కూడా ఫాక్స్‌కాన్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇటీవలనే యూపీలో యూనిట్ ప్రారంభించడానికి సన్నాహకాలు చేస్తున్నారు. అయితే వియత్నాం తరహాలో పెద్ద ఎత్తున మాన్యుఫాక్చరింగ్ చేసేందుకు ఫాక్స్‌కాన్ సిటీని నిర్మించాలని ఆ కంపెనీ యోచిస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం చాలా రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే కుప్పంలో వ్యవసాయాధారిత పరిశ్రమలు కొన్ని ఉన్నాయి. హిందాల్కో అక్కడ అడుగుపెడితే మరిన్ని పరిశ్రమలు అక్కడకు రావడానికి ఆస్కారం ఉంది. ఈ మధ్యనే నెల్లూరు- బెంగళూరు హైవే నుంచి కుప్పంకు నాలుగు వరుసల రహదారి నిర్మించారు. బెంగళూరుకు అతి దగ్గరగా ఉండటంతో దీనిని పారిశ్రామిక కేంద్రంగా మలిచేందుకు ప్రయత్నిస్తున్నారు.