టిడిపి జాతీయ కమిటిలో జిల్లాకు స్థానం దక్కేనా?
(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)
తెలుగు దేశం పార్టీ జాతీయ కమిటీలో చిత్తూరు జిల్లా నేతలకు సముచిత స్థానం దొరుకుతుందని పార్టీ నాయకులు ఆశాభావంతో ఉన్నారు. గతంలో జిల్లా నుంచి మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి పొలిట్ బ్యూరో సభ్యురాలిగా ఉన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. సారి ఆ రెండు పదవులు జిల్లాకు దక్కుతాయని భావిస్తున్నారు. జిల్లాకు మంత్రి పదవి కూడా లేకపోవడంతో జిల్లాలో పార్టీని పటిష్టం చేయలేకపోయారు. నియోజకవర్గాలలో సమన్యయం కూడా లోపించింది. కొన్ని నియోజక వర్గాలలో ఇంచార్జిని సైతం లెక్కచేయడం లేదు. పార్టీకి పటిష్టమైన నాయకత్వం ఏర్పాటుచేసి, స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం చేయనున్నారు.
సెప్టెంబర్ మూడవ తేదీ లోపల జాతీయ కమిటీతో పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్ర కమిటీల ఏర్పాటు చేయాలని జాతీయ కమిటీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. బుధవారం సాయంత్రం ఆయన మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో దీనిపై కీలక నేతలతో సమావేశం నిర్వహించారు. ఇందులో రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ వర్ల రామయ్య, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు, పార్టీ సంస్థాగత వ్యవహారాలు చూసే కార్యాలయ ప్రతినిధులు పాల్గొన్నారు. పార్టీని పటిష్ఠంగా నడపడానికి వీలుగా సమర్థులను ఎంపిక చేయాలని సూచించారు. ఒక పదవిలో మూడు సార్లు లేదా ఆరేళ్లు ఉన్న వారిలో సమర్థులైన వారికి ప్రమోషన్ ఇవ్వాలని చెప్పారు. సరిగా పనిచేయని వారిని పక్కన పెట్టాలని ఆదేశించారు. ఈ నేపధ్యంలో చిత్తూరు జిల్లా నుంచి పలమనేరు ఎమ్మెల్యే ఎన్ అమరనాథ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డికి జాతీయ కమిటీలో చోటు కల్పిస్తారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. జిల్లా వైసీపీలో మాజీ మంత్రి ఆర్ కె రోజా, ఆర్టీసీ మాజీ వైస్ చైర్మన్ ఎం సి విజయానంద రెడ్డి, మాజీ ఎంపీ ఎం జ్ఞానేంద్ర రెడ్డి ఉన్నారు. పుంగనూరు నియోజక వర్గాన్ని అన్నమయ్య జిల్లాలో కలపాలని నిర్ణయించి నప్పటికీ మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభావం ఉంటుంది. వారిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అదే సామాజిక వర్గానికి చెందిన అమరనాథ రెడ్డికి కీలక పదవి ఇవ్వాలని భావిస్తున్నారు. గతంలో ఆయన జిల్లా సహకార బ్యాంకు చైర్మన్, మంత్రి, జిల్లా అధ్యక్షుడు, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయనకు పొలిట్ బ్యూరో సభ్యుడు లేదా జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి దక్కే అవకాశం ఉందంటున్నారు. వైసిపి అధికారంలో ఉన్నప్పటి నుంచి వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న సుధాకర్ రెడ్డికి కూడా జాతీయ కమిటీలో చోటు లభిస్తుందని అంటున్నారు. ప్రముఖ సైకాలజిస్టు అయిన ఆయన యువజనత, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. గతంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా పోటీ చేసారు. ఆయనకు జాతీయ అధికార ప్రతినిధి లేదా పొలిట్ బ్యూరో సభ్యుడుగా అవకాశం కల్పించవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర అధికార ప్రతినిధులుగా ఉన్న డాక్టర్ సప్తగిరి ప్రసాద్, సురేంద్ర కుమార్ లను కొనసాగించే అవకాశం ఉంది. మరో అధికార ప్రతినిధి గౌనివారి శ్రీనివాసుల రాష్ట్ర కమిటీలో పదవి కల్పించే అవకాశం ఉంది. సీనియర్ నేత ఎన్ పి జయప్రకాశ్ నాయుడు, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి భీమినేని చిట్టిబాబు నాయుడులలో ఒకరికి పార్లమెంటు అధ్యక్ష పదవి ఇచ్చి మరొకరిని రాష్ట్ర కమిటీలో తీసుకుంటారని భావిస్తున్నారు. సీనియర్ నేత అయిన మాజీ ఎమ్మెల్సీ బి ఎన్ దొరబాబుకు సముచిత స్థానం లభించే అవకాశం ఉంది. పార్లమెంటు నియోజక వర్గం ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్ కు రాష్ట్ర కమిటీలో స్థానం దక్కుతుందని తెలిసింది. మాజీ ఎమ్మెల్యే సి కె బాబు సతీమణి లావణ్య, పాలసముద్రం మాజీ ఎంపిపిలు ఇందిర, రాజేంద్ర, సీనియర్ నేత గ్యాస్ రవి తదితరులు రాష్ట్ర కమిటీలో పదవులు ఆశిస్తున్నారు.

