23, ఆగస్టు 2025, శనివారం

చిత్తూరు జిల్లాలో వాటర్ గ్రిడ్ ఏర్పాటుకు సర్వే పూర్తి

రూ. 6,830 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్దం 
చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు కృష్ణ నది జలాలు 
30 సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాటర్ గ్రిడ్ రూపకల్పన
8,767 గ్రామాలకు తాగునీటిని సరఫరా, 64,459 ఇళ్లకు కొళాయిలు 

ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు 

కృష్ణానది జలాలను మళ్ళించి  చిత్తూరు జిల్లాలో వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన సర్వే పూర్తి అయింది. తొమ్మిది నెలల పాటు వాటర్ గ్రేడ్ అమలుకు సంబంధించి సర్వే చేశారు. 6,830 కోట్ల రూపాయలతో వాటర్ గ్రిడ్ను చిత్తూరు జిల్లాలో అమలు చేయనున్నారు. దీని ద్వారా 8,767 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తారు. చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలలోని 64,459 ఇళ్లకు కొళాయిల ద్వారా కృష్ణ జలాలను సరఫరా చేయనున్నారు. 30 సంవత్సరాల వరకు జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా 30 సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాటర్ గ్రిడ్ ను రూపొందించారు. వాటర్ గ్రిడ్ పూర్తి నివేదికను గ్రామీణ నీటి సరఫరా అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు.  రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి టెండర్లను పిలిచి పనుల ప్రారంభించాల్సి ఉంది.

నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత చిత్తూరు జిల్లా తాగునీటి సమస్య మీద ప్రత్యేక దృష్టిని సారించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నిత్యం కరువు కాటకాలతో సతమతం అవుతుంది. వేసవి వస్తే తాగనీటి సమస్య ప్రతి సంవత్సరం పునరావృతం అవుతుంది. తాగునీటి సమస్యను తీర్చడానికి ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయల  వ్యయం చేస్తున్న, శాశ్వత పరిష్కారం లభించడం లేదు. జిల్లాలో జీవనదులు, భారీ నీటిపారుదల ప్రాజెక్టులు లేకపోవడంతో చిన్న చిన్న జలాశయాలు, బోర్ల మీదనే తాగునీటి కోసం ఆధారపడాల్సి వస్తుంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి చిత్తూరు జిల్లాలో వాటర్ గ్రిడ్ ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. సుబ్  అనే సంస్థకు సర్వే బాధ్యతను అప్పగించారు. ఈ సంస్థ గత తొమ్మిది  నెలలుగా జిల్లాలో సర్వే చేసింది. రానున్న 30 సంవత్సరాల తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ పథకానికి రూపకల్పన చేసింది. గండికోట నుంచి కృష్ణా జలాలను పుంగనూరు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాలకు అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి నియోజకవర్గానికి తిరుపతి జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో కొంత భాగానికి తాగునీటిని సరఫరా చేస్తారు. ఈ పథకం కింద 2,930 కోట్ల రూపాయలతో ప్రణాళికను రూపొందించారు. జిల్లాకు 2.14  టీఎంసీల నీరు అవసరమని భావించారు. ఈ పథకం కింద 443 పంచాయితీల్లోని 3,332 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తారు. 46,716 ఇళ్లకు నీటి కొళాయిల ద్వారా కృష్ణా జలాలను అందచేస్తారు. అలాగే కుప్పం, పలమనేరు, మదనపల్లి, పుంగనూరు మున్సిపాలిటీలకు కూడా ఈ జలాలను సరఫరా చేస్తారు. నీటి సరఫరాకు  28 సంపులు, 163 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, 73 ఓవర్ హెడ్ బ్యాలెన్స్ రిజర్వాయర్లు, 2,224 ఓవర్ హెడ్ ట్యాంకులు అవసరమని ప్రతిపాదనలు తయారు చేశారు. మొత్తం 5,451 కిలోమీటర్లు పైపులైన్లను నిర్మించడం ద్వారా ఇంటింటికి తాగుడేటిని సరఫరా చేయనున్నారు.  కండలేరు రిజర్వాయర్ ద్వారా చంద్రగిరి, చిత్తూరు, గంగాధర నెల్లూరు, నగరి, పూతలపట్టు, సత్యవేడు, శ్రీకాళహస్తి, నియోజకవర్గం తాగునీటిని సరఫరా చేయనున్నారు. ఇందుకు 3,900 కోట్ల రూపాయలతో అంచనాలను తయారు చేశారు.1.63 టీఎంసీల నీట అవసరం ఉంటుంద భావించారు. 33 మండలాల్లోని 5,435 గ్రామాలకు తాగునీటి సరఫరా జరుగుతుంది. ఈ గ్రామాల పరిధిలోని 17,743 ఇళ్లకు నీటి కొళాయిల ద్వారా కృష్ణ జలాలను అందజేస్తారు. ఈ పథకం అమలుకు 70 సంపులు, 125 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, 15 గ్రౌండ్ లెవెల్ బ్యాలెన్స్  రిజర్వాయర్లు, 327 ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించనున్నారు. 5,203 కిలోమీటర్లు పైప్ లైన్ లను నిర్మిస్తారు.  జిల్లాలో ఏటా వేసవికాలం ప్రారంభం నుంచే భూగర్భ జలాలు అడుగంటిపోతుంటాయి. బోర్లలో నీటి లభ్యత తగ్గుతుంది. మళ్ళి వర్షాలు పడే వరకు  వేసవి నాలుగు నెలలూ దాదాపు ఇదే పరిస్థితి. బోర్లపై ఆధారపడే తాగునీటి పథకాల ద్వారా వేసవిలో నీరు అందించడం కుదరదు. దీంతో  మునిసిపాలిటీల్లో, మండలాల్లో  ట్యాంకర్లతో సరఫరా చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితులకు శాశ్వత పరిష్కారం చూపాలనన్న ధ్యేయంతో  రాష్ట్ర ప్రభుత్వం  కృష్ణా జలాలను చిత్తూరు తాగునీటికి మళ్ళించాలని నిర్ణయించింది.  దీంతో  గ్రామాల్లోని గృహాలకు ఇచ్చిన కుళాయి కనెక్షన్ల ద్వారా 365 రోజులూ తాగునీరు సరఫరా అయ్యేలా ప్రణాళికలు చేపడుతోంది. సమీప జలాశయాలు, నదుల నుంచి పైపులైన్ల ద్వారా నీటిని తరలించి, వేసవిలోనూ ప్రజలకు సరఫరా చేసేలా డిజైన్లను మార్చనున్నారు.  సీఎం చంద్రబాబు ఆదేశాలపై గ్రామాల్లో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి అధికారులు నివేదికలు సిద్ధం చేశారు.  ప్రాజెక్టు వ్యయాన్ని భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉంది. రాష్ట్రస్థాయి అంచనాల కమిటీ ఆమోదంతో వాటిని త్వరలో కేంద్రానికి పంపనున్నారు.  జలాశయాలు, నదుల నుంచి నీటిని పైపులైన్లు, కాలువల ద్వారా సేకరించి సరఫరా చేయడం ద్వారా గ్రామాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఏపీ సర్కార్ భావిస్తోంది. గ్రామాల్లో ఇప్పటికే 2.67  లక్షల కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. దీంతో పాటు అదనంగా మరో 50,546 కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రక్రియను పూర్తి చేయడంతోపాటు ఖర్చు ఎక్కువైనా గ్రామాలకు సమీపంలోని జలాశయాల నుంచి సంవత్సరం పొడవునా నీరు ఇచ్చేలా పనులు చేపట్టాలని గ్రామీణ తాగునీటి సరఫరా విభాగాన్ని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇందుకోసం కండలేరు, గండికోట జలాశయాల నుంచి గ్రామాలకు నీటి సరఫరా కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదికలు రూపొందించారు.  పైపులైన్ల ద్వారా తెచ్చే నీటిని శుద్ధి చేశాక గ్రామాల్లోని ఓవర్‌ హెడ్‌ సర్వీస్‌ రిజర్వాయర్, బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్, సంపులకు అనుసంధానించి ప్రజలకు కుళాయిల ద్వారా సరఫరా చేస్తారు. దీనిపై కేంద్రాన్ని ఒప్పించి ఆమోదం తీసుకోవాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌తో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు కొద్దిరోజుల క్రితం వేర్వేరుగా సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాగునీటి ప్రాజెక్టులకు సహకారం అందించేందుకు వారు సుముఖత వ్యక్తం చేశారు. జల్​జీవన్‌ మిషన్‌లో ఇప్పటివరకు చేసిన పనులు, మిగిలిన పనులు సహా పలు విషయాలపై చర్చించారు. జలజీవన్‌ మిషన్‌ కింద చిత్తూరు జిల్లాలో గత ఐదు సంవత్సరాల కిందట 5041 పనులను ప్రతిపాదించగా, ఇప్పటివరకు 2,432 పనులు మాత్రమే పూర్తయ్యాయి. అంచనా వ్యయం 431.45 కోట్ల రూపాయలు కాగా, ఇందులో 101.21 కోట్ల రూపాయలను మాత్రమే వ్యయం చేశారు. ఇందులో 286 పనులు గత ఐదు సంవత్సరాలుగా జరుగుతూనే ఉన్నాయి. 1,921 పనులను అధికారులు రద్దు చేశారు. చిత్తూరు జిల్లాలోని గ్రామాలలో 3,17,818 కుటుంబాలు ఉన్నట్లు ఇరిగేషన్ శాఖ లెక్కలు కట్టారు. ఇందులో 2, 67,272 కుటుంబాలకు నీటి కొళాయి కనెక్షన్లు ఇచ్చారు. 50,456 కుటుంబాలకు ఇంకా నీటి కుళాయిల కనెక్షన్ ను ఇవ్వాల్సి ఉంది. జల్ జీవన్ మిషన్ కింద జిల్లాలో ఇంకా 330 కోట్ల రూపాయలు వ్యయం కాకుండా అలాగే ఉంటాయి ఈ నిధులను కూడా కృష్ణా జలాల మళ్లింపు పథకాలకు వాడనున్నారు. కండలేరు, గండికోట జలాశయాల నుంచి చిత్తూరు జిల్లాకు  తాగునీటి ని తీసుకుని వచ్చి పథకాలకు సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే సిద్ధమయ్యాయి వీటిని రాష్ట్ర ప్రభుత్వ ఆమోదానికి జిల్లా అధికారులు పంపారు. తొందర్లోనే ఈ పథకాలకు సంబంధించిన జీవోలను ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది, జీవోలు విడుదల కాగానే యుద్ధ ప్రాతిపదికన ఈ పనులను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. తిరిగి ఎన్నికలకు వెళ్లే సమయానికి జిల్లాలో తాగునీటి సమస్య అనేది లేకుండా జిల్లా మొత్తానికి కృష్ణా జలాలతో తాగునీటిని అందించాలనిపట్టుదలతో ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం ఉన్న బోర్లను ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకునేఅవకాశం ఉంది. ఏది ఏమైనా రెండు మూడు సంవత్సరాలలో చిత్తూరు జిల్లా వాసులు కృష్ణాజిల్లాలను తాగనున్నారు. వేసవిలో కూడా తాగునీటి సమస్య ఉండదు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *