4, ఆగస్టు 2025, సోమవారం

విభేదాల మధ్య నేడే జీడి నెల్లూరు టిడిపి సమావేశం

అమీతుమీ తేల్చుకోవడానికి ఇరువర్గాలు సిద్ధం 

ఇప్పటికే ఒక వర్గం ఎమ్మెల్యే పిఏ పైన జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు 

ప్రజాస్వామ్యబద్ధంగా మండల కమిటీ ఎన్నికలు జరగాలని ఒక వర్గం పట్టు 

తమకు అనుకూలురలను నియమించుకోవాలని మరో వర్గం కసరత్తు 

ముగ్గురు పరిశీలకుల సమక్షంలో నియోజకవర్గ సమావేశం


(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)

వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్న గంగాధర నెల్లూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం మంగళవారం చిత్తూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో జరగనుంది. ఈ సమావేశంలో నియోజకవర్గ మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులను ఎన్నుకోనన్నారు. నియోజకవర్గానికి చెందిన ముగ్గురు పరిశీలకుల పర్యవేక్షణలో ఈ సమావేశం జరగనుంది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుకూల వర్గం, వ్యతిరేక వర్గం అనే రెండు వర్గాలుగా తెలుగుదేశం పార్టీ నిట్టనిలువునా చిలిపోయింది. ఇటీవల ఒక వర్గం ఎమ్మెల్యే పి ఏ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు కూడా చేశారు. ఈ విషయమై అధిష్టానం వరకు వెళ్లడంతో ఎవరు ఎటువంటి ప్రకటనలు చేయవద్దని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జరగనున్న సర్వసభ్య సమావేశంలో అమీతుమీ తేల్చుకో వడానికి ఇరువర్గాలు సమాయత్తం అవుతున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలని ఒక వర్గం నేతలు కోరుకుంటున్నారు. ఎమ్మెల్యే ఒక జాబితాను రూపొందించి ఆ ప్రకారం మండల పార్టీ అధ్యక్షులను నియమించాలని భావిస్తున్నారు. దానికి బ్రేక్ వేయాలని ఒక వర్గం భావిస్తోంది. ఈ నేపథ్యంలో జరగనున్న సర్వసభ్య సమావేశం ఆసక్తికరంగా మారింది.



గంగాధర నెల్లూరు నియోజక వర్గంలో టిడిపి మండల కమిటీల ఎన్నికలకు ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. మంగళవారం  ఉదయం చిత్తూరు పార్లమెంటు టిడిపి కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం ఏర్పాటు చేసారు. ఈ మేరకు ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ కార్యకర్తలకు సమాచారం పంపారు. నియోజకవర్గ పరిశీలకులు  బొమ్మి సురేంద్ర  ఎన్నికల అధికారులు జె రమణా రెడ్డి,,  రెడ్డివారి గురవారెడ్డి  ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో నియోజక వర్గంలోని ఆరు మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను ఎన్నుకుంటారు. రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాలలో మండల కమిటీల ఏర్పాటు జరిగినా పలు కారణాల వల్ల ఇక్కడ వాయిదా పడుతూ వస్తోంది. థామస్ తనకు అనుకూలమైన వారినే అధ్యక్షులుగా నియమించుకునే ప్రయత్నం చేసారు. అయితే ఆయన వ్యతిరేక వర్గం ఆయనకు అడ్డు పడుతుండటంతో వీలు పడలేదు. మొదట ఆరు మండలాలలో పాలసముద్రం, వెదురుకుప్పం మినహా మిగిలిన నాలుగు చోట్ల పాతవారినే కొనసాగించాలని భావించారు. పాలసముద్రం అధ్యక్షునిగా శివా నాయుడు, వెదురుకుప్పం అధ్యక్షునిగా కిషన్ చంద్ పేరు ప్రసిపాదించారు. అయితే పెనుమూరు మండల అధ్యక్షుడు రుద్రయ్య నాయుడు, కార్వేటినగరం అధ్యక్షుడు చెంగల్రాయ యాదవ్, ఎస్ ఆర్ పురం అధ్యక్షుడు జయశంకర్ నాయుడు మూడు కంటే ఎక్కువ సార్లు పదవిలో ఉన్నందున వారిని మార్చాలని పలువురు అధిష్టాన వర్గం దృష్టికి తీసుకుని వెళ్లారు. పాలసముద్రం మండల అధ్యక్షుడు రాజేంద్ర విషయం గత మార్చిలో చంద్రబాబు  ప్రస్తావించారు. రాజేంద్ర చంద్రబాబు దృష్టిలో ఉన్నందున ఆయనను తిరిగి కొనసాగించాలని కొందరు పట్టుపడుతున్నారు. నియోజక వర్గంలో 50 వేల మందికి పైగా రెడ్లు ఉన్నందున ఒకటైనా ఆ సామాజిక వర్గానికి ఇవ్వాలని అధిష్టానం సూచించింది. దీనితో వెదురుకుప్పం అధ్యక్షుడు కె లోకనాథ రెడ్డిని కూడా కొనసాగించాలని భావించారు. అయితే ఇక్కడ తమకు అవకాశం కల్పించాలని ఎస్సీ, బిసి నేతల పట్టుబడుతున్నారు. దీనితో అన్ని మండలాలలో పారదర్శకంగా ఎన్నికలు జరపాలని అధిష్టానం పరిశీలకులను ఆదేశించిందని రాష్ట్ర నాయకుడు ఒకరు చెప్పారు. కాగా పాలసముద్రం మండలానికి రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి, రాజంపేట పరిశీలకుడు భీమినేని చిట్టిబాబు ఎమ్మెల్యే ఏక పక్ష నిర్ణయాలకు అడ్డుపడుతున్నారు. పెనుమూరు మండలానికి చెందిన రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి అన్ని మండలాలలో ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని కోరుకుంటున్నారు. ఈ నేపధ్యంలో టిడిపి సర్వసభ్య సమావేశం వాడిగా, వేడిగా ఉంటుందని భావిస్తున్నారు. పెనుమూరు మండల అధ్యక్షుడు రుద్రయ్య నాయుడును మార్చాలని మాజీ ఎంపిపి హరిబాబు నాయుడు గట్టిగా పట్టుబడుతున్నారు. ఏక పక్షంగా వ్యవహరిస్తే పోటీ కమిటీ వేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇక్కడ సుబ్రమణ్యం నాయుడు, సతీష్ రెడ్డి, మనోహర్ రెడ్డి, షణ్ముఘ వర్మ, నాగరాజ తమలో ఒకరికి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నారు. వెదురుకుప్పంలో లోకనాథ రెడ్డి కొనసాగాలని భావిస్తుండగా మునిచంద్రా రెడ్డి, కిషన్ చంద్, మోహన మురళీ పోటీకి సిద్ధం అవుతున్నారు. పాలసముద్రంలో రాజేంద్రతో పాటు శివా నాయుడు, వాసు నాయుడు పోటీ పడుతున్నారు. జి డి నెల్లూరులో దేవసుందరం, స్వామిదాసు మధ్య పోటీ ఉంటుంది. ఎస్ ఆర్ పురంలో జయశంకర్ నాయుడు, రాజశేఖర్ నాయుడు, వేమా నాయుడు, భాస్కర్ నాయుడు, పైనేని మురళి పదవి ఆశిస్తున్నారు. కార్వేటినగరంలో చెంగల్రాయ యాదవ్ తో పాటు రాజేంద్ర రెడ్డి, వాసుదేవ రెడ్డి, రవియాదవ్, రామచంద్ర రాజు, భద్రరాజు పోటీకి సిద్ధం అవుతున్నారు. కాగా చర్చలు జరిపినా,  ఎన్నికలు నిర్వహించిన గొడవలు జరిగే అవకాశం ఉన్నందున ఆశావహుల నుంచి నామినేషన్లు స్వీకరించి మండలానికి మూడు పేర్లతో జాబితా రూపొందించి అధిష్టాన వర్గానికి పంపే అవకాశం ఉందంటున్నారు. తరువాత అధిష్టానం ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా మండల అధ్యక్షులను ఎన్నుకుంటుందని రాష్ట్ర నాయకుడు ఒకరు చెప్పారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *