5, ఆగస్టు 2025, మంగళవారం

పోలీసు బందోబస్తు మధ్య జీడి నెల్లూరు టిడిపి సమావేశం

అరుపులు, కేకలతో వాగ్వివాదానికి దిగిన నేతలు 

మండల పార్టీ అధ్యక్ష పదవులకు భారీగా ఆశవాహుల పోటీ

ఏకగ్రీవం చేయడానికి నాయకుల, పరిశీలకుల విపల యత్నం 

మండల పార్టీ నేతలతో కొనసాగుతున్న చర్చలు


(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)

గంగాధర నెల్లూరు నియోజక వర్గం టిడిపి సర్వసభ్య సమావేశం పోలీసు బందోబస్తు మధ్య జరిగింది. మండల కమిటీ ఎన్నికల నిమిత్తం ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఒక దశలో అరుపులు కేకలు చోటుచేసుకున్నాయి. పోలీసుల జోక్యంతో సద్దుమణిగింది. జిల్లా నాయకులు, పార్టీ పరిశీలకులు ఎవరు గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని మండల నాయకులను ఏక తాటి మీదికి తేవడంలో విఫలమయ్యారు. మండల పార్టీ అధ్యక్ష పదవులకు భారీగా పోటీపడ్డారు. నాయకులు ఎంత నచ్చచెప్పినా ఆశావాహులు వినిపించుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఏకగ్రీవం చేయడానికి నాయకులు, పరిశీలకులు శతవిధాల ప్రయత్నం చేశారు. అయినా, ఒక మండలాన్ని కూడా ఏకగ్రీవం చేయలేకపోయారు. మండల స్థాయిలో నాయకులు రెండు, మూడు వర్గాలుగా విడిపోయి మండల పార్టీ అధ్యక్ష పదవిని దక్కించుకోవడానికి పోటీ పడుతున్నారు చేశారు ఉదయం ప్రారంభమైన సమావేశం రాత్రి వరకు కొనసాగింది. చివరి నిమిషం వరకు నాయకులు కొన్ని మండలాలైన ఏకగ్రీవం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.


మంగళవారం చిత్తూరు పార్లమెంటు నియోజక వర్గం కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్, నియోజక వర్గం పరిశీలకుడు బొమ్మి సురేంద్ర యాదవ్, ఎన్నికల అధికారులు జె రమణా రెడ్డి, రెడ్డివారి గురవారెడ్డి కార్యకర్తలకు మార్గదర్శనం చేశారు. పార్లమెంటు అధ్యక్షుడు సి ఆర్ రాజన్, ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయని, అధ్యక్ష పదవి ఆశించేవారు తమ పేర్లు ఇవ్వాలని కోరారు.  ప్రారంభంలో ఒక్కో మండలం నుంచి ఆశావహులు పేర్లు ఇచ్చారు. వెదురుకుప్పం మండలంలో 40 మంది పోటీకి సిద్ధం అయ్యారు. మిగిలిన ఐదు మండలాలలో 20, 30 మంది మండల అధ్యక్ష పదవులను ఆశించారు. తరువాత మండలాల వారీగా ఆశావహులను పిలిచి రాజీ చేసే ప్రయత్నం చేశారు. వెదురుకుప్పం మండల నేతలు మూడు వర్గాలుగా చీలిపోయి ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలకు దిగారు. ఆ సమయంలో కొందరు గట్టిగా మాట్లాడుతూ అరుపులు, కేకలు వేశారు. దీంతో బయట కాపలావున్న పోలీసులు సమావేశం లోపలి వెళ్లి అడ్డుకుని సద్దుమణిగేలా చేశారు. ప్రస్తుత అధ్యక్షుడు లోకనాథ రెడ్డిని జిల్లా కమిటీలో తీసుకుంటామని బుజ్జగించారు. ఆఖరికి మునిచంద్రా రెడ్డి, కిషన్ చంద్, మోహన మురళీ పేర్లు ఎంపిక చేశారు. కార్వేటినగరం మండల అధ్యక్షుడు చంగల్రాయ యాదవ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి ప్రయత్నం చేశారు. అయితే ఆయన ఇప్పటికే మూడు సార్లు పదవిలో ఉన్నందున తనకు అవకాశం కల్పించాలని రవియాదవ్ పట్టు పట్టినట్టు తెలిసింది. దీనితో వారిద్దరి పేర్లు పరిగణనలోకి తీసుకున్నారు. ఎస్ ఆర్ పురం మండలంలో కూడా జయశంకర్ నాయుడు కనసాగించాలని ప్రయత్నించగా మూడుసార్లు పదవిలో ఉన్నందున చెల్లదని పైనేని మురళి అడ్డుపడినట్టు తెలిసింది. ఆఖరికి వీరిద్దరితో పాటు వేమా నాయుడు పేరు జాబితాలో చేర్చారు. జి డి నెల్లూరు మండలంలో స్వామి దాసు, దేవ సుందరం మధ్య పోటీ నెలకొన్నది. పెనుమూరు మండలంలో ఐదుగురు పోటీ పడినప్పటికీ ఆఖరికి మండల కమిటీ అధ్యక్షుడు రుద్రయ్య నాయుడు, మాజీ సర్పంచ్ కృష్ణమూర్తి నాయుడు ఇద్దరేమిగిలారు. వారిద్దరిని ఒక అవగాహనకు రావాలని పరిశీలకులు కోరారు. పాలసముద్రం మండలంలో శివా నాయుడు, వాసు నాయుడు ఇద్దరు మిగిలారు. ఇప్పటి వరకు ఒక మండలం కూడా ఏకగ్రీవం కాలేదని తెలిసింది. అయితే మరొక విడత చర్చలు జరిపితే పెనుమూరు, పాలసముద్రం, కార్వేటినగరం మండలాల్లో ఏకగ్రీవంగా ఎన్నిక జరిగే అవకాశం ఉందని తెలిసింది. మిగిలిన మండలాల్లో ఐవిఆర్ఎస్ ద్వారా ఎన్నుకుంటారని తెలిసింది. ఇప్పటి పరిస్థితుల ప్రకారం పాలసముద్రం, ఎస్ ఆర్ పురం, పెనుమూరు మండల అధ్యక్షులుగా కమ్మ సామాజిక వర్గం నేతలు ఎన్నికయ్యే అవకాశం ఉంది. జి డి నెల్లూరులో ఎస్సీ, కార్వేటినగరంలో యాదవ ( బిసి) సామాజిక వర్గం నేతను అధ్యక్ష పదవి వరిస్తుంది. కాగా గతంలో లాగే వెదురుకుప్పం రెడ్డికి కేటాయించే అవకాశం ఉందని అంటున్నారు. జిల్లా పార్టీ నాయకులు నియోజకవర్గ పరిశీలకులు ఒక్కొక్క మండలానికి సంబంధించిన ఆశావాహులను విడివిడిగా పిలిచి మాట్లాడుతున్నారు. వారి మధ్య రాజీ చేసి, ఎన్నికను ఏకగ్రీవం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు ఫలించకపోతే పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను రాష్ట్ర పార్టీ కార్యాలయానికి అందజేయమన్నారు. రాష్ట్ర పార్టీ కార్యాలయం ఐ వి ఆర్ ఎస్ ద్వారా మండల పార్టీ అధ్యక్షులను ఎన్నిక చేయనుంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *