జీడి నెల్లూరు నియోజకవర్గంలో ఆగని అక్రమ గ్రావెల్ దందా..!
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
పాలసముద్రం నుండి ఎస్ ఆర్ పురం వరకు నియోజకవర్గంలో అక్రమ గ్రావెల్ రవాణ
రవాణా యదేచ్చగా జరుగుతోంది. గ్రావెల్ అక్రమ రవాణాకు అధికార పార్టీకి చెందిన ఒక ప్రజాప్రతినిధి అండదండలుగా ఉండడంతో నియోజకవర్గానికి చెందిన మండల స్థాయి అధికారుల సైతం అడ్డుకోలేకపోతున్నారు. పైగా మండల స్థాయి అధికారులు కూడా గ్రావెల్ అక్రమ రవాణానకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. స్థానికులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా, వారి ఆదేశాలను మండల స్థాయిలో అమలు చేయడం లేదు. దీంతో గత కొంతకాలంగా నియోజకవర్గంలో నుంచి అక్రమ రవాణా మూడు ట్రిప్పర్లు, ఆరు లారీలుగా కొనసాగుతోంది. ఒక ప్రజాప్రతినిధి అండదండలతో గ్రావెల్ అక్రమ రవాణా జరుగుతుండడం, ఇది లాభసాటి వ్యవహారం కావడంతో నియోజకవర్గానికి చెందిన మరో 15 మంది తాము కూడా గ్రావెల్ తవ్వుకోవడానికి అనుమతులు మంజూరు చేయాల్సిందిగా మైన్స్ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో మరి కొంతమందికి అనుమతులు లభించే అవకాశం ఉంది. ఫలితంగా నియోజకవర్గంలో గ్రావెల్ అక్రమ రవాణా అధికార పూర్వకంగా ఊపు అందుకోనుంది.
కేసిసి బిల్డ్ కాన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ చిత్తూరు నుండి తచ్చురు ( చెన్నై) నేషనల్ హైవే రోడ్డు పనులు 0.00 చైనేజ్ నుండి 43.800 వరకు కాంట్రాక్టు చేస్తుంది. ఈ రోడ్డు పనులు 95 శాతం పూర్తయ్యాయి. అయితే ఇప్పుడు ఉన్న దశలో గ్రావెల్ తో ఎటువంటి అవసరం లేకపోయినా, ఒక ప్రజా ప్రతినిధి సహాయంతో కేసిసి బిల్డ్ కాన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తనకు 1లక్ష 50 వేల క్యూబిక్ మీటర్ గ్రావెల్ ఎస్ ఆర్ పురం మండలం, 56 కనికాపురం గ్రామం సర్వే నెంబర్ 109లో 2 నుండి తీసుకుంటాము అని డిడి మైన్స్ కు ధరఖాస్తు చేసుకొన్నారు. ఈ విషయాన్ని పరిశీలించాల్సిందిగా ఎస్ ఆర్ పురం మండలం తహసీల్దార్ కు డిడి మైన్స్ కోరారు. అయితే లక్షా 50 వేల క్యూబిక్ మీటర్లు క్వాంటిటీ వీలుకాదన్నారు. ఆ ప్రాంతంలో ఇండస్ట్రీస్ వస్తున్న కారణంగా ఎక్కువ మొత్తంలో గ్రావెల్ తవ్వకం కుదరదని స్పష్టం చేశారు. 30 వేల క్యూబిక్ మీటర్లకు తాత్కాలిక ఎన్ఓసి ఇస్తూ, మేము మధ్యలో కూడ నిలుపదల చేయడానికి అవకాశం ఉందని డిడి మైన్స్ కి తెలిపారు. అయితే డిడి మైన్స్ నుండి తహసీల్దారికి గ్రావెల్ తవ్వుకోవచ్చు అనే ఎటువంటి ఆర్డర్స్ రాలేదు. అయితే, ఒక ప్రజాప్రతినిది ఈ దరఖాస్తును అడ్డం పెట్టుకొని రోడ్డు పనులు అనే నెపంతో పశువులు మేత మేసే గుట్టల మట్టిని అక్రమంగా వాహనాలతో ఎటువంటి పర్మిట్లు లేకుండా తమిళనాడుకు రాత్రి, పగలు అనే తేడాలేకుండా తరలిస్తున్నారు. ఈ వ్యవహారం మీద కొంతమంది రాజకీయ నాయకులు గ్రామస్థులు ఈనెల 26న వ తహసీల్దార్, కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. వెంటనే అక్రమ గ్రావెల్ తరలింపును నిలుపుదల చేయాలని వారు ఆదేశాలు జారీ చేశారు. ఇదే విషయాన్ని తహసీల్దారు ప్రెసమీట్ లో చెప్పారు. అయితే, సోషల్ మీడియలో వచ్చినట్టు 17 టిప్పర్లు సీజ్ చేయలేదు. యజమానులు వాటిని వెనెక్కి తీసుకెళ్లిపోయారు. 4 ప్రొక్లెయిన్స్ మాత్రం తవ్వకాలు జరిగిన ప్రదేశంలో ఉన్నాయి. ఒక వేళ డిడి మైన్స్ వాళ్లు ఆర్డర్స్ ఇచ్చినా, మిగతా పొల్యూషన్ కంట్రోల్, భూ పరిమితి స్కెచ్ ఇతరత్ర సర్టిఫికెట్ లు పొందవలసి ఉంటుంది. ఇవి ఏమీ లేకుండా సరైన అనుమతులు లేకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొందరు నియోజకవర్గంలోంచి తమిళనాడుకు అక్రమంగా గ్రావెల్ రవాణా చేస్తున్నారు. ఈ విషయమై కాంట్రాక్టరు మీద ఆరోపణలు వచ్చినప్పుడు వాళ్లు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే, ఒక ప్రజా ప్రతినిధి అయివుండి బాధ్యత లేకుండా కాంట్రాక్టర్ ని వెనుకేసుకొని ఎటువంటి అక్రమ రవాణా జరగలేదని ఒక ఆడియో, ప్రెసనోట్ విడుదల చేయడం పట్ల నియోజకవర్గంలోని నాయకులు ప్రజలు విస్మయానికి గురవుతున్నారు. ఇతనే కంపెనీ ముసుగులో అక్రమంగా తరలిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు ఇలా చేస్తుంటే మేము ఎవరికి చెప్పుకోవాలని గ్రామస్తులు వాపోతున్నారు. పశువులను మేపడానికి కేటాయించిన ఆ భూములలో గ్రావెల్ తవ్వకాలను నిలుపుదల చేసి, ఆ భూములను కాపాడాల్సిందిగా గ్రామస్తులు మనవి చేస్తున్నారు.
గంగ 1 గ్రావెల్ అక్రమ రవాణకు ఉపయోగిస్తున్న ప్రొక్లెయిన్స్, టిప్పర్లు.

