8, ఆగస్టు 2025, శుక్రవారం

ఈ నెలలో జిల్లాకు పదవులే పదవులు

 తొలుత ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల భర్తీ

అనంతరం పార్టీ పదవుల పందారం 

ఉత్కంఠగా ఎదురుచూస్తున్న జిల్లా నేతలు  

(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)

కష్టపడి పనిచేసిన వారికి పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తగిన గుర్తింపు తప్పకుండా ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడంతో కూటమి పార్టీ నేతలలో ఆశలు రేకెత్తుతున్నాయి. వారం రోజులలో నామినేటెడ్ పోస్టుల భర్తీ జరుగుతుందని ప్రస్తుతం జోరుగా ప్రచారం జరుగుతోంది. జిల్లాలో పలువురు నాయకులు నామినేటెడ్ పదవులపైన ఆశలు పెట్టుకున్నారు. ఈ నెలలో ప్రభుత్వ నమినేటెడ్ పదవులు, పార్టీ పదవులు భారీగా భర్తీ చేసే అవకాశం ఉంది. జిల్లాలో పలువురికి పదవులు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో కొందరికి ప్రభుత్వ నామినేటెడ్ పదవులు, మరికొందరికి పార్టీ పదవులను కేటాయించి, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ క్యాడర్ ను సమాయత్తం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చిత్తూరు జిల్లాలో ఆశించిన స్థాయిలో నామినేటెడ్ పదవుల భర్తీ జరగలేదు. నామినేటెడ్ పదవులను కొంతమందికి మాత్రమే ఇచ్చారు. పదవుల భర్తిలో పార్టీ ఎన్నికలలో అభ్యర్థుల గెలుపు కోసం పనిచేసిన వారికి, పార్టీకి ఆర్థిక సహాయం చేసిన వారికి, ఎన్నికలలో ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసిన వారికి అధిక ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. ఇందులో భాగంగా నాలుగైదు రకాలుగా సర్వేలను చేయించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా నియోజకవర్గ స్థాయి నుంచి గ్రామ, మండల స్థాయి కార్యకర్తల వివరాలు తెప్పించుకున్నారు. అలాగే రాబిన్ శర్మ గ్రూపు నుంచి కూడా నివేదికలను తెప్పించుకున్నారు. యువనేత నారా లోకేష్ తనదైన శైలిలో నివేదికలను తెప్పించుకుంటున్నారు. వీరికి తోడుగా నియోజకవర్గ పరిశీలకుల నుండి కూడా నివేదికలను కోరారు. వీటి అన్నిటిని సమన్వయం చేసి పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టిన నేతలకు మెంబర్ షిప్ బాగా చేసిన వారికి పదవుల్లో ప్రోత్సాహం ఇవ్వనున్నారు.  ఈ సందర్భంగా జిల్లా నేతలు, మంత్రుల అభిప్రాయాలను చంద్రాబాబు కూడా  తెలుసుకున్నారు. ఈ నెలాఖరులోపు ప్రభుత్వంలో ఉన్న అన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని సీఎం స్పష్టం చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి కంటే.. ఎప్పటి నుంచో పార్టీలో ఉండి పనిచేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. ఐదేళ్ల కాలంలో ఇబ్బందులు పడ్డ వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. తొలి నుంచి పార్టీని నమ్ముకున్న వారికే పదవులు దక్కేలా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదేనని చంద్రబాబు స్పష్టం చేశారు. మార్కెట్ కమిటీలు, ట్రస్ట్ బోర్డులు, సింగిల్ విండోలతో పాటు, గతంలో ప్రకటించిన కార్పొరేషన్లకు డైరెక్టర్ల నియామకం చేయాల్సి ఉంది. పదవి ఆశిస్తున్న వారి రెండేళ్ల పనితీరుపై సమీక్ష చేసి, దాని ఆధారంగా నిర్ణయాలు, భవిష్యత్ అవకాశాలు ఉంటాయి.  వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీల నియామకంపై ఎమ్మెల్యేలు సరైన ప్రతిపాదనలు పంపాలని ఇప్పటికే సూచించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీల్లో పదవి ఆశిస్తున్న వాళ్లు క్యూబ్స్ (క్లస్టర్, యూనిట్, బూత్ సెక్షన్) విభాగాల్లో సభ్యులుగా ఉండాలని నిబంధన విధించారు. కష్టపడిన నాయకులు, కార్యకర్తలకు న్యాయం చేసేలా నామినేటెడ్ పదవులు రానున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ వ్యవహారాలు, నేతల పని తీరు వంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకుంటారు. ఎన్నికల హామీల్లో ఇచ్చిన పథకాలను అమలు చేస్తూనే నామినేటెడ్ పదవులు విషయంలో కూడా చంద్రబాబు దృష్టిని సారించారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో భాగంగా జిల్లాకు రెండు మూడు కార్పొరేషన్ పదవులు రావచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే బోయకొండ గంగమ్మ పాలకమండలి నియామకం కోసం నోటిఫికేషన్ జారీ అయింది. జిల్లా స్థాయిలో జిల్లా గ్రంధాలయ సంస్థ వంటి పదవులు కూడా ఉన్నాయి. నామినేటెడ్ పదవులు భర్తీ మీద జిల్లాకు చెందిన నేతలు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. తొలిత ప్రభుత్వానికి సంబంధించిన నామినేటెడ్ పదవులను భర్తీ  చేసే అవకాశం ఉంది. అనంతరం ఈనెలాఖరులో లేక సెప్టెంబర్ మొదటి వారంలో  పార్టీ పదవులను ప్రకటించే అవకాశం ఉంది. నామినేటెడ్ పోస్టుల భర్తీ, పార్టీ పదవుల భర్తీ కోసం జిల్లా నేతలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *