మళ్ళీ మొదటికి వచ్చిన మండల కమిటీల ఎన్నికలు !
ఏకగ్రీవానికి కుదరని సయోధ్య, విమర్శల వెల్లువ
20 రోజులు అయినా, సిద్ధం కానీ జాబితా
23 నుండి మండల అధ్యక్షుల కోశాన్ మళ్ళి కసరత్తు
ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.
గంగాధర నెల్లూరు నియోజక వర్గంలో టిడిపి మండల కమిటీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ మళ్ళీ మొదటికి వచ్చింది. ఈ నెల ఐదవ తేదీ జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్, పరిశీలకులు బొమ్మి సురేంద్ర యాదవ్, జె రమణా రెడ్డి, రెడ్డివారి గురువా రెడ్డి ఏకగ్రీవంగా ఎంపిక చేయాలని ప్రయత్నించారు. అయితే పెనుమూరు మాజీ ఎంపిపి హరిబాబు నాయుడు బహిరంగంగా విమర్శలకు దిగడంతో, ఆరవ తేదీ చిత్తూరులోని ఒక ప్రైవేటు హోటల్లో పరిశీలకులు సమావేశమై రెండేసి పేర్లతో జాబితా రూపొందించారు. నియోజకవర్గ సమావేశం జరిగి 20 రోజులు గడిచిన ఇప్పటివరకు నియోజకవర్గ సమన్వయకర్తలు ఒక జాబితాను రూపొందించలేదు. నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ మీద భారీగా విమర్శలు వచ్చాయి. ఎన్నికల పరిశీలకుల మీదనే విమర్శలను గుప్పించారు. దీంతో మండల పార్టీ అధ్యక్ష ఎన్నికలను ఏకగ్రీవం చేయాలనుకున్న ఆలోచన విరమించుకున్నారు.
నియోజకవర్గ ఎమ్మెల్యే, పరిశీలకుల వైఖరి మీద కొందరు అధిష్టాన వర్గానికి ఫిర్యాదులు చేశారు. జాబితాలో తమ పేర్లు కూడా చేర్చాలని నేరుగా పార్టీ కార్యాలయానికి విజ్ఞాపన పత్రాలు పంపారు. రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి భీమినేని చిట్టిబాబు నాయుడు కూడా ఎంపిక ప్రక్రియపై అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిసింది. ఎంపిక ప్రక్రియ ఏక పక్షంగా ఉందని అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్లారు. సామాజిక న్యాయం పాటించలేదంటూ ఎస్సీ, బిసి, రెడ్డి సామాజిక వర్గం నేతలు కొందరు చంద్రబాబుకు ఫిర్యాదులు చేశారు. దీనితో అధిష్టానం పునరాలోచించాలని పరిశీలకులను ఆదేశించింది. దీనితో పరిశీలకులు జాబితా పంపకుండా చేతులు ముడుచుకుని కూర్చున్నారు. ఈ నేపధ్యంలో సోమవారం పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్య నేతలతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ నెల 25 లోపల అన్ని నియోజక వర్గాలలో మండల కమిటీలు పూర్తి చేయాలని ఆదేశించారు. అన్ని వర్గాలకు ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. దీనితో మంగళవారం చిత్తూరు పార్లమెంటు అధ్యక్షుడు సి ఆర్ రాజన్, ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్ అన్ని నియోజక వర్గాలకు సూచనలు చేశారు. చంద్రబాబు ఆదేశాల ప్రకారం ఈ నెల 23,24,25 తేదీలలో సమావేశాలు ఏర్పాటు చేసి అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉండేలా సమర్థులతో కమిటీలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ నేపధ్యంలో గంగాధర నెల్లూరు నియోజక వర్గంలోని ఆరు మండలలో మూడు చోట్ల ఎస్సీ, బిసి లకు అవకాశం కల్పించే అవకాశం ఉంది. మిగిలిన మూడు మండలాలలో రెండు కమ్మ, ఒకటి రెడ్డి సామాజిక వర్గానికి కేటాయిస్తారని తెలిసింది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ప్రతి మండలం నుంచి మూడు పేర్లు తెరపైకి వచ్చాయని తెలిసింది. జి డి నెల్లూరు మండలంలో ఇప్పటి వరకు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన స్వామి దాసు, దేవ సుందరం పేర్లు ఉన్నాయి. మరొక పేరు కూడా చేర్చే అవకాశం ఉంది. పాలసముద్రం మండలం నుంచి రాజేంద్ర ( ఎస్సీ) శివా నాయుడు, వాసు నాయుడు పేర్లు ఉంటాయి. ఎస్ ఆర్ పురం నుంచి జయశంకర్ నాయుడు, వేమా నాయుడు, పైనేని మురళి ( కమ్మ) పేర్లు ఉండే అవకాశం ఉంది. కార్వేటినగరం నుంచి బిసి సామాజిక వర్గానికి చెందిన చంగల్రాయ యాదవ్, రవి యాదవ్ తో పాటు మరొకరి పేరు జాబితాలో చేరుతారని సమాచారం. వెదురుకుప్ప మండలం నుంచి మునిచంద్రా రెడ్డి, కిషన్ చంద్ (బిసి), మోహన్ మురళీ ( ఎస్సీ) పేర్లు ఉంటాయని భావిస్తున్నారు. పెనుమూరు మండలం నుంచి రుద్రయ్య నాయుడు, కృష్ణమూర్తి నాయుడు, సుబ్రమణ్యం నాయుడు పేర్లు జాబితాలో ఉండే అవకాశం ఉంది. ఈ జాబితాలను రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ వర్ల రామయ్య, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, ప్రోగ్రామ్స్ ప్రతినిధులు పరిశీలించి సమర్ధులు ఎంపిక చేస్తారని చంద్రబాబు చెప్పినట్టు తెలిసింది. దీనిపై రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డిని వివరణ కోరగా మండల కమిటీల ఎన్నిక పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు. పార్టీకి కష్టపడి పనిచేసిన వారికి అవకాశం ఉంటుందని చెప్పారు.

