14, ఆగస్టు 2025, గురువారం

నేటి నుండి మహిళలకు ఉచిత ప్రయాణం

నేడు చిత్తూరులో ప్రారంభించనున్న మంత్రి 

మహిళలకు కూటమి ప్రభుత్వ వరం

స్ర్తీశక్తి పేరుతో శ్రీకారం

ఏర్పాట్లు పూర్తిచేసిన ఆర్‌టీసీ అధికారులు

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.

మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి రంగం సిద్ధమైంది. ఇందుకోసం ఆర్టిసి అధికారులు దాదాపు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పథకానికి స్త్రీశక్తి పేరును ఖరారు చేసింది. ఇందుకు చిత్తూరు జిల్లాలో 388 బస్సులను సిద్ధం చేశారు మహిళలకు బస్టాండ్లలో  అదనపు సౌకర్యాలను కలగచేస్తున్నారు. ఇప్పటివరకు బస్ సర్వీసులు వెళ్ళని 38 గ్రామాలకు సైతం బస్సులను నడపడానికి చర్యలు తీసుకుంటున్నారు. అదనంగా 200 మంది డ్రైవర్లను సిద్దం చేశారు. ఉచిత బస్సు సౌకర్యాన్ని శుక్రవారం రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమం, వైద్య విద్యాశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చిత్తూరులో  ప్రారంభించనున్నారు.


జిల్లాలోని ఐదు డిపోల పరిధిలో పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల ద్వారా ప్రతిరోజు 773 గ్రామాలకు సర్వీసులను నడుపుతున్నారు. 1.65 లక్షల  కిలోమీటర్ల దూరంలో 1.31 లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నారు. ఉచిత ప్రయాణం ప్రారంభమైన తర్వాత సర్వీసులు లేని 38 గ్రామాలకు సైతం బస్సులు నడపడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ సేవలు మొదలవుతే రోజుకు 20 వేల మంది ప్రయాణికులు బస్ సర్వీసులను వినియోగించుకుంటారని అంచనా వేస్తున్నారు. మహిళలు ప్రతిరోజు ఎంత మంది ప్రయాణించే ఆవకాశం ఉందన్న విషయంపై ఇప్పటికే అధికారులు సర్వే చేసుకుని ఓ అంచనాకు వచ్చారు. జిల్లాలో 18.73 లక్షల మంది జనాభా ఉండగా, వారిలో మహిళలు 9.33 లక్షల మంది ఉన్నారు. వీరిలో కనీసం 20వేల మంది ప్రతి రోజు ఉచిత బస్సుల్లో ప్రయాణించే అవకాశం ఉందని అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు తెలిసింది. మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి ఐదు రకాల బస్సులను ప్రభుత్వం ఎంపిక చేసింది. పల్లె వెలుగు, అల్ర్టా పల్లెవెలుగు, సిటి ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి మహిళలను అనుమతించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. జిల్లా పరిధి దాటి రాష్ట్రంలోని ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. ప్రయాణ పరిధిని రాష్ట్ర మంతటికీ వర్తింపజేయడంతో సుదూర ప్రాంతాల్లోని బంధువుల ఇళ్లకు, ప్రముఖ దేవాలయాలకు, ఆధ్యాత్మిక కేంద్రాలకు టిక్కెట్‌ తీయకుండా చేరుకోవచ్చు. ఈ నేపథ్యంలో బస్సులకు డిమాండ్‌ పెరిగే అవకాశం ఉంది. 

గుర్తింపు కార్డు తప్పనిసరి

ఉచిత బస్సుల్లో ప్రయాణం చేసే మహిళలు తమ గుర్తింపు కార్డులను తప్పనిసరిగా వెంట తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ప్రధానంగా వారు ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి. ఆధార్‌ కార్డు గాని, రేషన్‌ కార్డు గాని, ఓటర్‌ గుర్తింపు కార్డు గాని తీసుకువెళ్తే సరిపోతుంది. ఉచిత బస్సుల్లో ప్రయాణించే మహిళలకు కండక్టర్‌ స్ర్తీ శక్తి పేరుతో ఉన్న 0 ధర టిక్కెట్‌ను ఇస్తారు. తద్వారా ప్రయాణించే వారి సంఖ్య, దూరం వివరాలను ఆర్టీసీ ప్రతిరోజూ ప్రభుత్వానికి నివేదిస్తుంది. అనంతరం ఆ టిక్కెట్‌ ధర ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి చేరుతుంది. చిత్తూరు జిల్లాలో చిత్తూరు ఒకటి, రెండు డిపోలు, పలమనేరు, పుంగనూరు, కుప్పం ఆర్టీసీ డిపోలో ఉన్నాయి. ఈ ఐదు డిపోలో 461 బస్సులు ఉండగా, ఇందులో 84 శాతం బస్సులను శ్రీ శక్తి పథకానికి కేటాయించారు. జిల్లాలో పల్లెవెలుగు బస్సులు 281, ఎక్స్ప్రెస్ బస్సులు 107 ఉన్నాయి. వీటిని పూర్తిస్థాయిలో నడపడానికి సిద్ధమయ్యారు. ఈ బస్సులు అన్నిటిని సర్వీసు చేసి సిద్ధం చేశారు. జిల్లాలో డ్రైవర్ల కొరత ఉండగా 200 మంది ఆన్ కాల్ డ్రైవర్లను నియమించారు. ఇప్పటికే వారికి ఇంటర్వ్యూలో నిర్వహించి, శిక్షణ కూడా ఇచ్చారు. కొరత ఉన్న ప్రాంతాలు వారిని పిలిచి విధులను కేటాయించనున్నారు 

సదుపాయాలపై దృష్టి

స్త్రీశక్తి పేరుతో ఏపీఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో మహిళలు రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించేందుకు ప్రభుత్వం చెప్పడంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి కాంప్లెక్స్‌ల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్‌టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. తాగు నీటి సదుపాయాల పెంపు, ఫ్యాన్‌ల ఏర్పాటుపై దృష్టి సారించారు. ఆర్టీసీ బస్టాండ్లలో మహిళా ప్రయాణికుల సౌకర్య కోసం అదన సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. చిత్తూరులో  రెండు ఆర్ఓ ప్లాంట్లు, నగరపాలిక సమన్వయముతో రెండు తాత్కాలిక మరుగుదొడ్లు, మహిళల కోసం పింక్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. బేబీ ఫీడింగ్ కేంద్రాన్ని కూడా సిద్ధం చేస్తున్నారు. పలమనేరులో బస్టాండులో కొత్త కుర్చీలు, ఫ్యాన్లు అమర్చారు. మహిళలు ఇబ్బంది పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ పథకంతో ఆర్‌టీసీ కాంప్లెక్స్‌లు ఆధునికీకరణకు, సదుపాయాల మెరుగుకు అవకాశం ఏర్పడింది.  బస్సుల్లో రద్దీ ఎక్కువ ఉండేటప్పుడు ఘర్షణలకు, గొడవలకు ఆస్కారం ఉండడంతో కండక్టర్‌లకు బాడీవార్న్‌ కెమెరాలు ఇస్తున్నారు. వాటిని దుస్తులకు అమర్చుకోవచ్చు. బస్సుల్లో సీసీ కెమెరాలు కూడా పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

ఆ బస్సుల్లో ఉచితం ఉండదు

ప్రీమియర్‌ సర్వీసులుగా ఉండే నాన్‌స్టాప్‌, ఇంటర్‌ స్టేట్‌ ఎక్స్‌ప్రెస్‌లు, లగ్జరీ, సూపర్‌ లగ్జరీ, ఇంద్ర ఏసీ బస్సులకు ఈ పథకం వర్తించదు. అలాగే ఘాట్‌ రోడ్లలో ప్రయాణించే బస్సుల్లో సైతం ఉచిత ప్రయాణం ఉండదు. ఈ మార్గాల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తే బస్సుల్లో ప్రయాణికులు పెరుగుతారు. దీంతో ఆటంకాలు, ప్రమాదాలు జరగవచ్చునని భావించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తం సర్వీసుల్లో 84 శాతం బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించనున్నట్టు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.



అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *