పెన్షన్ రద్దు, మార్పులపై అప్పీల్ కు అవకాశం
పెన్షన్ రద్దు లేదా పెన్షన్ రకం మార్పుతో నోటీసు పొందిన వారు అప్పీల్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. జిల్లాలో ప్రభుత్వం అందజేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లలో 4,966 పింఛన్లను రద్దుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరో 1,395 పింఛన్లను అనర్హులు గుర్తించి వారికి కేటగిరి మార్పు చేసింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న వైద్య పరీక్షలకు 12,953 మంది హాజరుకాలేదు. వీరికి కూడా పింఛన్లను నిలుపుదల చేస్తూ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వారికీ నోటీసులను సచివాలయ అధికారులు అందచేస్తున్నారు. నోటిసులు అందుకున్న వారు ఎంపీడీఓ కార్యాలయంలో అవసరమైన డాక్యుమెంట్స్ అందించి అప్పీల్ చేసుకోవచ్చును. అప్పీల్ కోరుతూ ఎంపీడీఓ అర్జీ రాయాలి. అర్జికి ఆధార్ కార్డు జిరాక్స్, పెన్షన్ రద్దు, పెన్షన్ మార్పు నోటీసు, సదరం సర్టిఫికేటు పాతది, కొత్తది, పెన్షన్ దారునికి సంబంధించిన ఏవైనా హాస్పిటల్ చికిత్స పొందిన, పొందుతున్న డాక్యుమెంట్స్ ఏవైనా ఉంటే జతచేయాలి. అప్పీల్ చేసుకున్న వారికి ఎంపీడీఓ లాగిన్ నుండి మరొకసారి పునఃపరిశీలనకు నోటీసు జారీ చేస్తారు. పింఛను దారులు మరొకసారి పునఃపరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది. అప్పీల్ కొరకు జిల్లా ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎంపీడీఓ ద్వారా పునఃపరిశీలనకు వెళ్ళమని నోటీసు ఇచ్చిన తర్వాత నిర్దేశించిన హాస్పిటల్ కు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. పింఛన్ అర్హతలలో ప్రభుత్వం మార్పులు తీసుకొనివచ్చింది. 85 శాతంపైగా శారీరక వైకల్యంతో ఉన్నవారు, వైద్యుల ధృవీకరణ ఆధారంగా హెల్త్ పెన్షన్ రూ.15,000 లకు అర్హులు. 40 శాతం నుండి 60 శాతం ఉన్న వికలాంగులు, సెప్టెంబర్ నెల నుండి కొత్త పింఛన్ పొందవచ్చును. 85 శాతం కంటే తక్కువ ఉన్న వికలాంగులు రూ.6,000 పింఛన్ కు అర్హులు. 40 శాతం పైగా వికలాంగత ఉన్నవారికి నెలకు రూ.4,000 అందచేస్తారు. 60 శాతం పైగా ఉన్నవారికి నెలకు రూ.6,000, 85 శాతం పైగా ఉన్నవారికి గరిష్టంగా రూ.15,000 అందచేస్తారు. ఇందుకు అభ్యర్థులు తప్పనిసరిగా వైద్య ధృవీకరణ పత్రం సమర్పించాలి. గ్రామ, వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. ప్రతీ నెల 25వ తేదీ లోపు దరఖాస్తులు సమర్పించాలి. కొత్తగా అర్హులైన వారు 30 రోజుల్లోగా పింఛన్ కోసం అప్లై చేయాలి. పింఛన్ మంజూరు కాలేదని అనుకుంటే, మళ్లీ వైద్య ధృవీకరణ పత్రంతో దరఖాస్తు చేయవచ్చు. తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. సంబంధిత అధికారులు పరిశీలించి పింఛన్ మంజూరు చేస్తారు. ప్రభుత్వ ఆదేశముల ప్రకారం హెల్త్ పెన్షన్ అనగా 15,000 పింఛన్ పొందుతున్న వారి ఇంటికి వచ్చి పరిశీలన చేశారు. ఎవరికైతే 85 శాతం పైబడి వికలాంగత ఉండి, మంచానికే పరిమితమైనట్టు డాక్టర్లు రిపోర్ట్ చేసినారో వారికి 15,000 యధావిధిగా సెప్టెంబర్ నెల నుంచి వచ్చును. వెరిఫికేషన్ లో వికలాంగుల శాతం 85 శాతం కంటే తక్కువ ఉంది 40 శాతం కంటే ఎక్కువ ఉన్నట్లయితే హెల్త్ పెన్షన్ నుండి వికలాంగ పెన్షన్లకు అనగా15,000 నుండి 6000 కు మార్పు చేశారు. 40 శాతం కంటే వికలాంగత తక్కువగా ఉంటే పింఛనుదారుల వయసు 60సంవత్సరాలు పైబడినచో వారికి 15,000 లకు బదులు వృద్ధాప్య పెన్షన్ గా పరిగణించి 4000 రూపాయలకు మంజూరు చేస్తారు. 40 శాతం కంటే వికలాంగత తక్కువ ఉండి 60 సంవత్సరాలు లేని యెడల వారికి సెప్టెంబర్ నెల నుండి పింఛన్ నిలుపుదల చేస్తారు. అదేవిధంగా వికలాంగ పింఛన్ లో కూడా 40 శాతం పైబడి ఉన్నట్లయితే వారికి యధావిధిగా వికలాంగుల పింఛన్ 6000 వస్తుంది. వికలాంగత శాతం 40 శాతం కంటే తక్కువగా ఉండి పింఛన్ దారులకు 60 సంవత్సరాల నిండిన వారికి వృద్ధాప్య పింఛను గా మార్పుచేసి 4000 ఇస్తారు. 40 శాతం కంటే తక్కువగా ఉండి 60 సంవత్సరాలు లేని యెడల వారి వికలాంగుల పింఛను సెప్టెంబర్ నెల నుండి నిలుపుదల చేస్తారు. పింఛన్ నిలుపుదల చేసిన వారి వివరాలు ఇప్పటికే సచివాలయం లాగిన్లో చూపిస్తున్నాయి. ఆ నోటీసును డౌన్లోడ్ చేసి పింఛన్ దారులకు అందచేస్తున్నారు. ఇది ఈనెల 25వ తేదీ లోపుగా పూర్తి అవుతుంది. ఎవరి పింఛన్ రద్దు చేయబడిందో వారు పాత సదరం సర్టిఫికేట్, ఈ నోటీసును తీసుకొని జి.జి.హెచ్ లేదా ఏరియా ఆసుపత్రికి వెళ్లి, సంబంధిత వైద్యుడి ద్వారా ధృవీకరించించుకోవాలి. అనంతరం, నిబంధనల ప్రకారం ఉన్న ప్రొఫార్మా ఆధారంగా మాన్యువల్ సర్టిఫికేట్ పొందవలెను. ఆ మాన్యువల్ సర్టిఫికేట్, మిగిలిన అవసరమైన పత్రాలను కలిపి, సంబంధిత ఎంపీడీవో లేదా మున్సిపల్ కమిషనర్ కు అప్పీల్ చేసుకోవాలి. పెన్షన్ రద్దు, మార్పు నోటీసు అందిన తేదీ నుండి 30 రోజులలో అప్పీల్ చేసుకోవాలి. అప్పీల్ను, ఇందువల్ల వికలాంగులు, మెడికల్ పింఛనుదారులకు పించన్ పునద్దరించే అవకాశం ఉంది.

