ముఖ్యమంత్రి పర్యటనలలో కనిపించని జిల్లా ఇంచార్జి మంత్రి
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ఉన్న మండిపల్లి రాంప్రసాద్ చిత్తూరు జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియమితులయ్యారు. ఆయన ఇన్చార్జి మినిస్టర్ మంత్రిగా నియమితులు కాకముందు కూడా ఎప్పుడు నియోజకవర్గానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చినా, దగ్గరుండి ఏర్పాట్లు అన్ని చూసేవారు. ఆయనే జిల్లా ఇన్చార్జి మంత్రిగా వస్తారని కూడా అప్పట్లో పలువురు భావించారు. ఊహించిన విధంగానే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జిల్లా ఇంచార్జ్ మంత్రిగా నియమితులయ్యారు. అయన జిల్లా ఇన్చార్జి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎప్పుడు కుప్పంలో చంద్రబాబు నాయుడు పర్యటించిన తప్పకుండా వెంట ఉండేవారు. అయితే గత రెండు పర్యాయాలుగా ముఖ్యమంతి పర్యటనలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి కనిపించడం లేదు. మార్చి ఒకటవ తారీఖున గంగాధర నెల్లూరు పర్యటనకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేసినప్పుడు ఆ కార్యక్రమంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అయితే ఆ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాంప్రసాద్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ మా మంత్రి జిల్లాలో పార్టీ గురించి పట్టించుకోవడంలేదు, జిల్లాలో పర్యటనలు చేయడం లేదని వ్యాఖ్యానించారు. తర్వాత ముఖ్యమంత్రి జూన్ 29వ తేదీన కుప్పం గంగ జాతరలో పాల్గొనడానికి సతీసమేతంగా విచ్చేశారు. తర్వాత జూలై ఒకటవ తారీఖున ఇంటింటి ప్రచారానికి విచ్చేసిన ముఖ్యమంత్రి మూడు రోజులపాటు కుప్పం నియోజకవర్గంలోని ఉన్నారు. ఈ కార్యక్రమాలలో కూడా జిల్లా ఇన్చార్జి మంత్రి పాల్గొనకపోవడం విశేషం. అయితే జూలై మూడవ తారీఖున చిత్తూరులో జరిగిన కేంద్రమంత్రి రాందాస్ అధవాలే కార్యక్రమంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. అలింకో ఆధ్వర్యంలో దివ్యాగులకు ఉపకరణాలను పంపిణీ చేశారు. కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నా, చిత్తూరు పర్యటనను ముగించుకొని మంత్రి నేరుగా బెంగళూరు చేరుకున్నారు. శుక్ర, శనివారాల్లో జరిగిన కృష్ణ జలాలకు జలహారతి కార్యక్రమంలో కూడా జిల్లా ఇన్చార్జ్ మంత్రి పాల్గొనలేదు. సాధారణంగా జిల్లా ఇన్చార్జ్ మంత్రి ముఖ్య మంత్రి పర్యటన ఉన్నప్పుడు ఒకరోజు ముందుగా జిల్లాకు రావడం, ముఖ్యమంత్రి కార్యక్రమాల ఏర్పాట్లను పర్యవేక్షించి, అధికారులకు, పార్టీ క్యాడర్ కు అవసరమైన దిశానిర్దేశం చేస్తారు. ఇది ఏ ప్రభుత్వంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్న జిల్లా ఇన్చార్జి మినిస్టర్ విధి. అయితే గత రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి పర్యటనకు రాంప్రసాద్ రెడ్డి దూరంగా ఉండటం రాజకీయ వర్గంలో చర్చనీయంశంగా మారింది. శనివారం కుప్పంలో చంద్రబాబు నాయుడు కృష్ణా జిలలకు జల హారతి ఇస్తుండగా, మంత్రి రాంప్రసాద్ రెడ్డి విశాఖపట్నంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నట్లు సమాచారం.
పో రై గంగ 1 మంత్రి రాంప్రసాద్ రెడ్డి

