7, ఆగస్టు 2025, గురువారం

రైతులను నిరాశ పరచిన ఖరిఫ్ సేజన్

8 శాతం పంటకు కూడా సాగుకాని వైనం 

పంటలు సాగుకాకుండా రైతులకు భారీ నష్టం 

వృధా అయిన సబ్సిడీ వేరుశనగ విత్తనాలు 

చట్నిలకు, నూనే ఆడడానికి వినియోగిస్తున్న రైతులు 

(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ)

ఈ ఖరీఫ్ సీజన్ చిత్తూరు జిల్లా రైతులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. ఖరీఫ్ సీజన్లో పడాల్సిన వర్షాలు పడకపోవడంతో జిల్లాలో వ్యవసాయ పనులు ముందుకు సాగడం లేదు. పచ్చగా పంట పొలాలతో కళకళలాడాల్సిన పొలాలు బీడు భూములుగా దర్శనమిస్తున్నాయి. భవిష్యత్తులో కూడా వర్షాలు పడతాయన్న ఆశాభావం రైతులలో కలగడం లేదు. జిల్లాలు ఈ ఖరీఫ్ సజన్లో వేరుశనగ, వరి పంటలు దాదాపుగా సాగు కాలేదు. మిగిలిన పప్పు ధాన్యాలు పంటలు కూడా అంతంత మాత్రమే. ఇటీవల ముగిసిన మామిడి సీజన్ కూడా రైతులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. మామిడికి గిట్టుబాటు ధర లభించక, సకాలంలో మామిడికాయలు కోయలేక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఖరీఫ్ సీజన్ అయినా బాగుంటుందని రైతులు ఆశాభావంతో ఉన్నారు. అయితే ఖరీఫ్ సీజన్లో జిల్లాలో పడాల్సిన వర్షాలు పడలేదు. దీంతో జిల్లాలో పంటలు సాగు కాలేదు. పంటలు సాగుకాక రైతన్న తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. 


చిత్తూరు జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్ కు 71,305 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు కావలసి ఉన్నాయి. అయితే ఇప్పటివరకు వర్షాభావ పరిస్థితుల్లో కారణంగా 6,432 హెక్టార్లలో మాత్రమే పంటలు సాగయ్యాయి. జిల్లాలో వరి 11,204 హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు  821 హెక్టార్లలో మాత్రమే సాగయింది. అలాగే వేరుశనగ 35,238 హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు 1,475 హెక్టార్లలో మాత్రమే సాగయింది. రాగులు 2,369 హెక్టార్లకు కాను 28 హెక్టార్లలో మాత్రమే సాగయింది. ఇతర పప్పు ధాన్యాలు 3,726 హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా 306  హెక్టార్లలో మాత్రమే సాగయింది. అలాగే కందులు 2,565 హెక్టార్లకి కాను 52 హెక్టార్లలో, పెసలు 113 హెక్టార్లకు కాను రెండు హెక్టార్లలో, ఉద్ధులు 100 హెక్టార్లకు మూడు హెక్టార్లలో, ఉలవలు 1,693 హెక్టార్లకు గాను ఒక హెక్టరలో, అనుములు 532 హెక్టార్లకు గాను ఒక హెక్టారు సాగయింది. మొత్తం మీద పప్పు ధాన్యాలు 5,467 హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా 65 హెక్టార్లలో మాత్రమే సాగయ్యాయి. ఆహార ధాన్యాలు మొత్తం మీద 20,397 హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా 1,192 హెక్టార్లలో మాత్రమే సాగయ్యాయి. ఖరీఫ్ సీజన్లో మేజర్ గా వేరుశనగ పంటను జిల్లా రైతులు వర్షాధారంగా వేస్తారు. జిల్లాలో వేరుశెనగ పంట 35,238 హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా ఇప్పటివరకు 1,475 హెక్టార్లలో మాత్రమే సాగయింది. మొత్తం మీద వంట నూనెలకు సంబంధించిన పంటలు 35,246 హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా 1476 హెక్టార్లలో మాత్రమే సాగయ్యాయి. జిల్లాలో మొత్తం ఖరీఫ్ పంటలు 63,147 హెక్టార్లలో సాగు కావలసి ఉండగా ఇప్పటివరకు 4,918 హెక్టార్లలో సాగయింది. జిల్లాలో పశుగ్రాసం మాత్రం ఆ 11, 573 యాక్టర్లలో సాగయింది. మొత్తం మీద ఖరీఫ్ సీజన్లో 7.8 శాతం పంటలు మాత్రమే సాగాయి మిగిలిన భూములు బీడు భూములుగా మిగిలాయి. ఖరీఫ్ సీజన్లో వేరుశనగ విత్తనం వేసే సమయము గడిచిన తర్వాత చిత్తూరు జిల్లాలో వర్షాలు ప్రారంభమయ్యాయి. దీంతో ఏం చేయాలో రైతులకు దిక్కుతోచడం లేదు. సాధారణంగా ఖరీఫ్ సీజన్ జూన్ నెలతో ప్రారంభమవుతుంది. చిత్తూరు జిల్లాలో ఖరీఫ్ సీజన్ ఎక్కువగా వేరుశనగ పంటను సాగు చేస్తారు. ఈ పంట పూర్తిగా వర్షాధారంగా పండిస్తారు. ఇప్పటికే జిల్లాలో వేరుశనగ విత్తి, పూత దశలో ఉండాలి. అయితే వర్షాలు లేని కారణంగా జిల్లాలో వేరుశనగ పంట సాగు కాలేదు. మిగిలిన ఖరీఫ్ పంటలు కూడా అంతంత మాత్రమే. అదును పోయిన తర్వాత  పడుతున్న ఈ వర్షాలు వల్ల ఉపయోగంలేదని వ్యవసాయ శాఖ అధికారులు సైతం చెబుతున్నారు. రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రయత్నం చేయాలని కోరుతున్నారు. ప్రత్యామ్నాయ పంటగా ఉలవలను వ్యవసాయ శాఖ అధికారులు ప్రతిపాదిస్తున్నారు.


*39 వేల క్వింటాళ్ల వేరుశనగ వృధా*

ఈ ఖరీఫ్ సీజన్ కు వ్యవసాయ శాఖ జిల్లాలోని రైతులకు 39 వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనములు సరఫరా చేసింది. తొలుత 26 వేల క్వింటాళ్ల వేరుశనగను జిల్లా వ్యాప్తంగా రైతులకు రైతు సేవ కేంద్రాల ద్వారా సరఫరా చేసింది. ఈ విత్తనం చాలదని అదనంగా వేరుశనగ కావాలని జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్ కు ప్రతిపాదించారు. దీంతో అదనంగా మరో 13 వేల క్వింటాల్లో వేరుసెనగను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విత్తనాన్ని కూడా రైతులకు సరఫరా చేశారు. రైతులు విత్తనాలను సిద్ధం చేసుకున్న ఈ విత్తనాలు వేయడానికి కుదరదు. కావున రైతులు సబ్సిడీ విత్తనాలను చట్నిలకు, నూనే ఆడుకోవడానికి వినియోగిస్తున్నారు. గత సంవత్సరం కూడా జిల్లాలో ఇదే పరిస్థితి ఎదురయ్యింది. వేరుశనగ పంట తీసే సమయంలో రెండు నెలల పాటు జిల్లాలో వర్షాలు పడలేదు. దీంతో వేరుశనగ పంట చిత్తూరు జిల్లాలో 90 శాతం దెబ్బతింది. ఈ సంవత్సరం వేరుశనగ విత్తడానికి ముందు మూడు నెలలుగా వర్షాలు లేవు. ఫలితంగా గత సంవత్సరం నష్టపోయిన విధంగానే ఈ సంవత్సరం కూడా వేరుశనగ విత్తకుండా రైతులు భారీగా  నష్టపోయారు.  

పో రై గంగ 1 పంటలు వేయక బీడులుగా మారిన పొలాలు 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *