25, ఆగస్టు 2025, సోమవారం

ప్రజాస్వామ్యబద్ధంగా పార్లమెంటరీ కమిటీ ఎన్నిక

నాయకుల, కార్యకర్తల మనోభావాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం

పోటీలోని అభ్యర్థుల వివరాలను అధిష్టానానికి నివేదిస్తాం 

అధిష్టానమే ఫైనల్ గా నిర్ణయం తీసుకుంటుంది 

అధిష్టానం నిర్ణయాన్ని అందరూ గౌరవించాలి 

రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి

చిత్తూరు, ఆగస్టు 25 (ఆంధ్రప్రభ బ్యూరో) : తెలుగుదేశం పార్టీ నియమావళిని అనుసరించి, ప్రజాస్వామ్యబద్దంగా చిత్తూరు పార్లమెంటరీ కమిటీని ఎన్నిక  జరుగుతుందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. చిత్తూరులోని హోటల్ భాస్కరలో జరిగిన చిత్తూరు పార్లమెంటరీ పార్టీ సర్వసభ్య సమావేశంలో పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు, జిల్లా కమిటీ, అనుబంధ విభాగాల కమిటీల నియామకంపై పార్టీ పరిశీలకులుగా రాష్ట్ర రోడ్లు  భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, లిడ్ క్యాప్ ఛైర్మన్ పిల్లి మాణిక్యాలరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీ సభ్యులు పూల మాల వేసి నివాళులర్పించారు. సమావేశానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న బీసీ జనార్థన్ రెడ్డి మంత్రి మాట్లాడుతూ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు చిత్తూరు పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు, జిల్లా కమిటీ, అనుబంధ విభాగాల కమిటీల ఎంపిక కోసం త్రిసభ్య కమిటీ చిత్తూరు జిల్లా పర్యటనకు రావడం జరిగిందని చెప్పారు. జిల్లాలో క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, కీలక నాయకుల అభిప్రాయాలను, మనోభావాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామన్నారు. స్థానికంగా క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధిగా పనిచేసే నాయకుల వివరాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి, ఆయా కమిటీల్లో పెద్దపీట కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. పార్టీ కమిటీల్లో 30 శాతం యువతకు ప్రాధాన్యత కల్పించడంతో పాటు, 70 శాతం అనుభవానికి పెద్దపీట వేసే విధంగా కమిటీల కూర్పు ఉంటుందని వివరించారు. పార్టీ పరిశీలకులుగా తమ దృష్టికి వచ్చే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని, వాటిపై కూలంకుషంగా చర్చించి, పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామన్నారు. అనంతరం కమిటీల ఏర్పాటులో ఎవరికి స్థానం  కల్పించాలనే విషయంలో పార్టీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయమే అందరికీ శిరోధార్యమని, కావున పదవులు దక్కినా, దక్కకపోయినా పార్టీ నిర్ణయాన్ని గౌరవించి పార్టీ అభివృద్ధి కోసం అందరితో కలిసిమెలిసి నిబద్ధతతో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇంత పెద్ద పార్టీలో పదవులు ఆశించే ఆశావహుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుందని, అందరినీ అన్నివేళలా సంతృప్తి పరచలేమన్నారు. కావున పదవులకు అతీతంగా కన్నతల్లిలాంటి పార్టీ అభివృద్ధికి కట్టుబడి క్రమశిక్షణతో పని చేసే క్రియాశీలక పార్టీ నాయకులు, కార్యకర్తలకు భవిష్యత్తులో పార్టీ తగిన గుర్తింపు ఇస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలమని కమిటీ సభ్యులు తెలిపారు. చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ విస్తృత సమావేశంలో పార్టీ పరిశీలకుల త్రిసభ్య కమిటీ సభ్యులు జిల్లా పార్టీలో కీలక నేతల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర పార్టీ పరిశీలకులుగా వచ్చిన త్రిసభ్య కమిటీ సభ్యులు బీసీ జనార్థన్ రెడ్డి, ఆలపాటి రాజేంద్రప్రపాద్, పిల్లి మాణిక్యలరావులతో పాటు జిల్లాలోని పార్టీ ముఖ్యనేతలైన చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు, మండలి విప్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ప్రభుత్వ విప్ డాక్టర్ థామస్, ఎమ్మెల్యేలు పులివర్తి నాని, గురజాల జగన్ మోహన్, గాలి. భాను ప్రకాష్, డిసిసిబి చైర్మన్ అమాస్య రాజశేఖరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏ.యస్.మనోహర్, మాజీ ఎమ్మెల్సీలు గౌనివారి శ్రీనివాసులు, దొరబాబు, చుడా చైర్మన్ కటారి హేమలత, వన్నె కుల కార్పొరేషన్ చైర్మన్ సి ఆర్ రాజన్, చిత్తూరు మేయర్ ఆముద, చిత్తూరు పార్లమెంటు జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, టీడీపీ ముఖ్య నేతలు చంద్రప్రకాష్, సురేంద్ర కుమార్, డాక్టర్ సప్తగిరి ప్రసాద్  తదితరులు పాల్గొన్నారు. తెలుగు దేశం పార్టీ నాయకులు ఒక్కొక్కరితో మాట్లాడి, వారి అభిప్రాయాలను పార్టీ త్రిసభ్య కమిటీ తెలుసుకోవడం జరిగింది. అదే సమయంలో వివిధ కమిటీల్లో పదవులు ఆశిస్తోన్న ఆశావహులతో సైతం ఏకాంతంగా మాట్లాడి వారి అభిప్రాయాలను కమిటీ సేకరించడం జరిగింది. ఈ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి రాతపూర్వకంగా వచ్చిన పలు విజ్ఞప్తులను సైతం పార్టీ పరిశీలకుల త్రిసభ్య కమిటీ స్వీకరించడం జరిగింది. 

*అధ్యక్ష పదవికి 25పైగా దరఖాస్తులు*

తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్ష పదవి కోసం భారీగా దరఖాస్తులు చేసుకున్నారు.  ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం 25 మంది దరఖాస్తు చేసినట్లు తెలిసింది. ఇందులో కమ్మ సామాజిక వర్గానికి చెందిన 16 మంది, బిసి సామాజిక వర్గానికి చెందిన నలుగురు, బలిజ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు, దళిత సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు దరఖాస్తు చేసినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం కమ్మ సామాజిక వర్గం నుంచి పాలసముద్రానికి చెందిన చిట్టిబాబు, ఐరాల మండలానికి చెందిన మహదేవ సందీప్, గిరినాయుడు, జడ్పిటిసి సభ్యురాలు లత, చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన హేమాంబ రావు, చిన్నబాబు, చిత్తూరుకు చెందిన సురేంద్ర కుమార్, చంద్రపకాష్, వసంత కుమార్, పెనుమూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు అరుణ, బంగారు పాల్యం చెందిన ఎన్పీ జయప్రకాష్ నాయుడు, నగిరి నియోజకవర్గం నుంచి పోతుగుంట విజయబాబు, తవణంపల్లి మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వర చౌదరి తదితరులు దరఖాస్తు చేసినట్లు సమాచారం. బలిజ సామాజిక వర్గం నుంచి చిత్తూరు మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్, చిత్తూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాజూరు బాలాజీ దరఖాస్తు చేశారు. దళిత సామాజిక వర్గం నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్, నగిరి నియోజకవర్గంలో నుంచి దశరధవాసు, చిత్తూరు రూరల్ మండలానికి చెందిన శశికర బాబు, బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కుప్పం నియోజకవర్గానికి చెందిన గౌనివారి శ్రీనివాసులు, బీసీ నాగరాజు, ప్రస్తుత పార్లమెంటుది పార్టీ అధ్యక్షుడు సిఆర్ రాజన్, చిత్తూరు నియోజకవర్గంలో నుంచి న్యాయవాది అశోక్ ఆనంద్ యాదవ్ దరఖాస్తు చేసినట్లు తెలిసింది. టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి పదవికి 15 మంది దరఖాస్తు చేశారు. దరఖాస్తు చేసిన వారిలో ప్రధానంగా ప్రస్తుత జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, మోహన్ రాజ్, కార్పొరేటర్ అశోక్, కార్వేటి నగరానికి చెందిన చంద్రారెడ్డి ఉన్నారు. 

పో రై గంగ 1 చిత్తూరు పార్లమెంటరీ పార్టీ సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి బిసి జనార్దన్ రెడ్డి 

గంగ 2 సమావేశానికి హాజరైన టిడిపి నాయకులు, కార్యకర్తలు


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *