మరో సారి మారనున్న జిల్లా సరిహద్దులు
పుంగనూరు మదనపల్లికి, నగరి తిరుపతికి
కొత్త జిల్లాగా మదనపల్లి ఆవిర్భావం
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం ఉన్న జిల్లాల సరిహద్దులు మరోసారి మారే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జిల్లాల పునర్విభజన ఉప సంఘం సిఫార్సుల మేరకు జిల్లా పరిధిలు మారనున్నాయి. జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలపై అప్పట్లో భారీగా ఫిర్యాదులు ఉన్నాయి. ఈ విభజన అశాస్త్రయంగా, వారికి అనుకూలంగా జరిగిందన్న విమర్శలు ఉన్నాయి. మదనపల్లెను జిల్లా కేంద్రం చేయాలని అప్పట్లో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం జరిగింది. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఈ ఆందోళన కార్యక్రమానికి మద్దతు తెలిపింది. ప్రతిపక్ష నాయకుడి హోదాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాము అధికారంలోకి వస్తే మదనపల్లి జిల్లాను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కావున జిల్లాల పునర్విభజనలో ఉమ్మడి జిల్లాలో భారీగా మార్పులు చేర్పులు ఉండవచ్చని భావిస్తున్నారు.
గతంలో పార్లమెంట్ నియోజకవర్గం ఆధారంగా చిత్తూరు జిల్లాలో మూడు జిల్లాలుగా విభజించారు. కుప్పం, గంగాధర\ నెల్లూరు, చిత్తూరు, నగరి, పలమనేరు, పుంగనూరు, పూతలపట్టు నియోజక వర్గాలతో చిత్తూరు జిల్లా ఏర్పడింది. గూడూరు, చంద్రగిరి, తిరుపతి, వెంకటగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట నియోజకవర్గాలతో తిరుపతి జిల్లాను ఏర్పాటు చేశారు. మదనపల్లి, తంబళ్లపల్లి, పీలేరు, కోడూరు, రాజంపేట, రాయచోటి నియోజకవర్గాలతో అన్నమయ్య జిల్లాను రాయచోటి కేంద్రంగా ఏర్పాటు చేశారు. రాజంపేట పార్లమెంటుకు చెందిన పుంగనూరు నియోజకవర్గాన్ని చిత్తూరు జిల్లాలో కలిపారు. చిత్తూరు పార్లమెంటుకు చెందిన చంద్రగిరి నియోజకవర్గాన్ని తిరుపతి నియోజకవర్గంలో కలిపారు. నగరి నియోజకవర్గంలోని కొన్ని మండలాలను తిరుపతి జిల్లాలో, మరికొన్ని మండలాలను చిత్తూరు జిల్లాలో కలిపారు. చిత్తూరు జిల్లాలో కలిపిన వెదురుకుప్పం మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపాలని స్థానికుల భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. జిల్లాల పేర్లు మార్పు, డివిజన్లు, మండలాలు, గ్రామాల సరిహద్దులపై ప్రజల నుంచి వచ్చిన విన్నపాలు పరిశీలించడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఉపసంఘంలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, పురపాలక మంత్రి పొంగూరు నారాయణ, హోం మంత్రి వంగలపూడి అనిత, ఆర్ అండ్‌బీ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు, పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్, వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ సభ్యులుగా ఉన్నారు. జగన్ ప్రభుత్వం 2022లో లోక్‌సభ స్థానాల ప్రాతిపదికన 13 జిల్లాలను 26గా చేసింది. జిల్లాల ఏర్పాటు, అందుకు జరిగిన కసరత్తుపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. చివరకు నాటి ప్రభుత్వంలోని మంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వీటన్నిటినీ జగన్ ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. చంద్రబాబు సారథ్యంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాల అంశంపై ప్రజల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. జిల్లాల పేర్లు, వాటి సరిహద్దులు, రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దులు మార్చాలని కోరారు. అలాగే జిల్లాలు, డివిజన్, మండలాల సరిహద్దుల విషయంలో పాలనాపరంగా అనేక సమస్యలు వస్తున్నాయని అధికార వర్గాలు నివేదికలు పంపించాయి. కలెక్టర్లు, సీనియర్ అధికారులనుంచి కూడా పలు సూచనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పునరాలోచన చేసింది. మంత్రివర్గ ఉప సంఘంతో అధ్యయనం చేయించాలని నిర్ణయించింది. అన్ని అంశాలనూ క్షుణ్ణంగా పరిశీలించి, అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలన్నది ప్రభుత్వం ఉద్దేశమని అధికార వర్గాలు అంటున్నాయి. ఈ ఉప సంఘం నివేదిక ఆధారంగా చిత్తూరు జిల్లా నుంచి పుంగనూరు, నగరి నియోజకవర్గాన్ని వేరు చేస్తారని సమాచారం. చిత్తూరు, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాలతో చిత్తూరు జిల్లా ఏర్పడుతుందని భావిస్తున్నారు. అలాగే తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి, చంద్రగిరి నియోజకవర్గాలతో తిరుపతి లేక బాలాజీ జిల్లా, మదనపల్లి కేంద్రంగా మదనపల్లి, పీలేరు, పుంగనూరు, తంబళ్లపల్లి నియోజకవర్గాలతో కొత్త జిల్లా ఏర్పడుతుందని భావిస్తున్నారు.

