నేడు టిడిపి పార్లమెంట్ సర్వసభ్య సమావేశం
పార్లమెంటరీ అధ్యక్ష పదవి మీదనే అందరి దృష్టి
అధ్యక్ష పదవి రేసులో పదిమందికి పైగా ఆశావాహులు
ప్రయత్నాలను ముమ్మరం చేసిన ఆశావాహులు
త్రిసభ్య కమిటీ దృష్టిలో పడడానికి భారీగా ఏర్పాట్లు
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ
తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంట్ సర్వసభ్య సమావేశం సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర పార్టీ నుంచి నియమితులైన పరిశీలకులు బీసీ జనార్దన్ రెడ్డి, ఆలపాటి రాజేంద్రప్రసాద్, పిల్లి మాణిక్యాలరావు హాజరుకానన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు పార్లమెంటు టిడిపి అధ్యక్ష పదవికి తీవ్రమైన పోటీ నెలకొన్నది. పార్లమెంటరీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న అభ్యర్థులు తమ సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు. ఎలాగైనా నియోజకవర్గ పార్టీ అధ్యక్ష పదవిని దక్కించుకోవడానికి ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పదిమందికి పైగా అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్నారు. ఇందులో ఎక్కువమంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఉండటం విశేషం. బలిజ సామాజిక వర్గం నుంచి చిత్తూరుకు చెందిన కాజూరు బాలాజీ, ఎస్సీ సామాజిక వర్గం నుంచి పూతలపట్టు నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ పోటీలో ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతం చంద్రగిరి నియోజక వర్గానికి చెందిన సి ఆర్ రాజన్ అధ్యక్షునిగా ఉన్నారు. ఎన్నికలకు ముందు అప్పటి వరకు అధ్యక్షునిగా ఉన్న పులివర్తి నాని స్థానంలో బిసి సామాజిక వర్గానికి చెందిన రాజన్ ను అధ్యక్షునిగా నియమించారు. ఆయనకు రెండు సంవత్సరాలు పుర్తికాక పోవడంతో తిరిగి ఆయనే కొనసాగుతారని కొందరు కొందరు భావిస్తున్నారు. అయితే ఆయన రాష్ట్ర వన్నె కుల కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులు అయినందున కొత్తవారిని నియమిస్తారని మరి కొందరు భావిస్తున్నారు. జిల్లాకు కొత్త అధ్యక్షుడిని నియమించే పక్షంలో జిల్లా కేంద్రంలోని బలిజ సామాజిక వర్గానికి కాజూరు బాలాజీ పార్లమెంటు అధ్యక్ష పదవి కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆయన గతంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గా, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులుగా ఉన్నారు. కరోనా వంటి కష్ట సమయంలో చిత్తూరు పట్టణంలో పార్టీ తరఫున ఆనందయ్య కరోనా మందును వార్డు వార్డుకు సరఫరా చేశారు. అలాగే విరివిగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇటీవల ఆయన జన్మదిన కార్యక్రమాన్ని ఆయన అభిమానులు భారీ ఎత్తున నిర్వహించారు. గత ఎన్నికల్లో చిత్తూరు టికెట్టు ఆశించారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణలో భాగంగా పలు పోలీసు కేసులు కూడా అయన మీద నమోదు అయ్యాయి. కాగా ఇప్పటి వరకు దళితులకు అవకాశం ఇవ్వనందున తనకు అవకాశం కల్పించాలని రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్ కోరుతున్నారు. ఆయన విద్యార్థి దశ నుంచి పార్టీకి వివిధ హోదాలలో సేవలు అందిస్తున్నారు. గతంలో పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ గా కూడా పనిచేశారు. చిత్తూరు కేంద్రంగా నిత్యం ప్రజా సమస్యల మీద స్పందిస్తున్నారు. అధికారులను కలిసి వినతి పత్రాలు ఇస్తున్నారు. ప్రజల తరఫున సమస్యలపై పోరాటం చేస్తున్నారు. గంగాధర నియోజకవర్గానికి చెందినరాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి భీమినేని చిట్టిబాబు నాయుడు పార్లమెంటు అధ్యక్ష పదవి కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో పాలసముద్రం, మండల కమిటీ అధ్యక్షుడు, జడ్పీటీసీ, పుత్తూరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు నిర్వహించారు. జి డి నెల్లూరు నియోజక వర్గం సమన్వయ కర్తగా పనిచేశారు. రాష్ట్ర స్థాయి కార్పోరేషన్ పదవి ఆశించి పొందలేక పోయారు. చిత్తూరు మండలానికి చెందిన చంద్రప్రకాష్ నాయుడు అధిష్టానం బాధ్యత ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. గతంలో ఆయన చిత్తూరు ఎంపిపి, మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు నిర్వహించారు. ఆయన భార్య గీర్వాణి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ఉన్నారు. బంగారు పాల్యం మండలానికి చెందిన ఎన్ పి జయప్రకాశ్ నాయుడు కూడా పదవిని ఆశిస్తున్నారు. ఆయన గతంలో బంగారు పాల్యం మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన భార్య సుచిత్ర బంగారుపాలెం మండల పరిషత్ అధ్యక్షురాలిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన సోదరుడు ధరణి ప్రసాద్ మండల పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఒకప్పుడు చిత్తూరు రాజకీయాలను శాసించిన ఎన్ పి కుటుంబానికి చెందిన జయప్రకాశ్ నాయుడు గత ఎన్నికల్లో చిత్తూరు టికెట్టు ఆశించారు. రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ కూడా పదవి ఆశిస్తున్నారు. తొలి నుంచి పార్టీలో ఉన్న ఆయనకు చంద్రబాబు కుటుంబంతో బంధుత్వం కూడా ఉంది. జిల్లా రాష్ట్ర పార్టీలో పలు కీలక బాధ్యతలను నిర్వహించారు. గత పార్లమెంటు సమయంలో ఎంపీ ప్రసాదరావు ఎలక్షన్ ఏజెంట్ గా ఆయన విజయానికి కృషి చేశారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలలో కలిచర్ల శ్రీకాంత్ ఎన్నికల సమయంలో ఎలక్షన్ ఏజెంట్ కూడా పనిచేశారు. తిరుపతి, సత్యవేడు ఎన్నికల పరిశీలకులుగా బాధ్యతలు నిర్వహించారు. డిసిసి బ్యాంకు డైరెక్టర్ గా పనిచేశారు. కాగా పుత్తూరుకు చెందిన రాష్ట్ర కార్యదర్శి పోతుగుంట విజయబాబు రేసులో ఉన్నారు. ఆయన 2009 ఎన్నికల్లో నగరి నియోజక వర్గం నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసారు. ఈ నేపధ్యంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఐరాల మండలానికి గిరి నాయుడు కూడా రేసులో ఉన్నారు. గతంలో ఆయన పార్టీ మండల కమిటీ అధ్యక్షునిగా ఉన్నారు. గత ఎన్నికల్లో పూతలపట్టు నియోజక వర్గంలో పార్టీ గెలుపుకు కృషి చేశారు. ఐరాల మండలం నుంచి సందీప్ కూడా పార్లమెంటరీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. ఆయన తండ్రి మహాదేవ నాయుడు ఐరాల మండల పార్టీ అధ్యక్షుడిగా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, టిటిడి బోర్డు సభ్యుడిగా పనిచేశారు. చంద్రగిరి నియోజకవర్గం నుండి వీరబల్లి హేమాంబర రావు కూడా పోటీపడుతున్నారు. ఆయన ప్రస్తుతం రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఉన్నారు. తిరుపతిలో పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందారు. చిత్తూరుకు చెందిన యువ నేత, మాజీ కార్పొరేటర్ వసంత కుమార్, గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి చెందిన ఆ పార్టీ తెలుగు మహిళ అధ్యక్షరాలు అరుణ కూడా అధ్యక్ష ఉన్నారు. వీరందరూ కమ్మ సామాజిక వర్గం కాగా, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా సి ఆర్ రాజన్ ను నియమించి ఏడాది అవుతుంది. మరో పర్యాయం కూడా ఆయనను కొనసాగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆయనను అధ్యక్షుడుగా కొనసాగిస్తే ప్రస్తుతం అధ్యక్ష రేసులో ఉన్న వారు ప్రధాన కార్యదర్శి పదవికి కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ అధికారంలో ఉండడం ఉండడంతో పార్టీ అధ్యక్షుడికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అధ్యక్ష పదవితో పాటు ప్రోటోకాల్ పాటించడానికి రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవి కూడా ఇచ్చే అవకాశం ఉంది. జిల్లా యంత్రాంగాన్ని శాసించవచ్చు. కావున జిల్లాలో చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్ష పదవికి పోటీ రోజు రోజుకు పెరుగుతోంది. కొత్తవారు అధ్యక్ష రేసులోకి వస్తున్నారు. పార్లమెంటులో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఉండగా, ఇందులో నలుగురు కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. రెండు నియోజకవర్గాలలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఒక నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. జిల్లాలో బలిజ సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత లభించలేదు. ఇప్పటివరకు జిల్లా అధ్యక్ష పదవిని దళితులకు, మహిళలకు ఇవ్వలేదు. అలాగే బీసీలకు కూడా సముచిత స్థానం కల్పించాల్సిన అవసరం ఉంది. అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర నాయకత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

