నేడు అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభం
20వ విడత పిఎం కిసాన్ యోజన నిధులు విడుదల
ఒక్కొక్క రైతు ఖాతాలో 7,000 రూపాయలు జమ
జిల్లాలో 2,05,753 మంది రైతులకు లబ్ది
రైతుల బ్యాంకు ఖాతాలలో జమకానున్న రూ. 138.16 కోట్లు
(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)
కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు ఇచ్చిన సూపర్ 6 పథకాల అమలులో భాగంగా శనివారం అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకాన్ని రాష్ట్రస్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా, దర్శి మండలం, వీరాయపాలెంలో ప్రారంభిస్తారు. జిల్లాలో నియోజకవర్గస్థాయిలో ఆయా శాసనసభ్యులు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. మండల స్థాయిలో, గ్రామస్థాయిలో రైతులతో పండుగ వాతావరణం కనిపించే విధంగా సమావేశాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రసంగాన్ని టీవీల ద్వారా లైవ్ టెలికాస్ట్ చేయనున్నారు. అలాగే పిఎం కిసాన్ యోజన పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారణాసిలో ప్రారంభించనున్నారు. ఈ పథకాన్ని కూడా జిల్లా మండల నియోజకవర్గస్థాయిలో లైవ్ టెలికాస్ట్ చేయనున్నారు.
ఈ పథకం కింద చిత్తూరు జిల్లాలో అన్నదాత సుఖీభవ మొదటి విడతగా ఆర్థిక సహాయం కింద 2,05,753 మంది రైతులకు 102.88 కోట్ల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాలో జమకానున్నాయి. అలాగే ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద 20వ విడత ఆర్థిక సహాయం కింద జిల్లాలోని 1.76 లక్షల మంది రైతుల ఖాతాలలో 35. 28 కోట్ల రూపాయలు జమ కానున్నాయి. మొత్తం మీద చిత్తూరు జిల్లాలోని రైతుల బ్యాంకు ఖాతాలో 138.16 కోట్ల రూపాయలు జమ కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడత ఆర్థిక సహాయం కింద ఒక్కొక్క రైతు కుటుంబానికి 5,000 రూపాయలను జమ చేస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలను జమ చేయనుంది. ఈ మొత్తం కలిపి శనివారం ఒక్కొక్క రైతు ఖాజాల్లో 7,000 రూపాయలు జమవుతాయి. ఎన్నికల వేళ ఒక్కో రైతు కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం అందించే సాయంతో కలిపి ఏడాదికి రూ.20,000 అందిస్తామని కూటమి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ‘పీఎం కిసాన్’ పథకంలో ఏడాదికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6,000 సాయానికి, రాష్ట్ర ప్రభుత్వం ‘అన్నదాతా సుఖీభవ’ కింద మరో రూ.14,000 కలిపి అందజేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం మొదటి రెండు విడతల్లో రూ.5,000 చొప్పున, మూడో విడతలో రూ.4,000 ఇవ్వనుంది. ఈ పథకంపై సందేహాల నివృత్తికి ప్రభుత్వం 155251 టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులో తీసుకొచ్చింది. ఒకరోజు ముందే ‘మనమిత్ర’ ద్వారా సందేశాలు: అర్హులైన రైతులందరికీ అన్నదాతా సుఖీభవ అందాలని సీఎం చంద్రబాబు సూచించారు. దీంతో ఆగస్టు 2వ తేదీన గ్రామ సచివాలయం నుంచి పంచాయతీలు, మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల స్థాయిలో కార్యక్రమం పండుగ వాతావరణం నెలకొననుంది. అన్నదాతా సుఖీభవ అందుకునే రైతుల సెల్‌ఫోన్లకు ఒకరోజు ముందే ‘మనమిత్ర’ ద్వారా సందేశాలు అందాయి. ఇప్పటికే రైతుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. కుటుంబంలో ఒకరికి మాత్రమే అన్నదాతా సుఖీభవ పథకం వర్తిస్తుంది. వెబ్‌ల్యాండ్‌లో రైతు ఆధార్ నంబర్ తప్పుగా ఉంటే రెవెన్యూ అధికారులను సంప్రదించి సరి చేసుకోవాలి. జాబితాలో రైతు పేరు లేకపోయినట్లయితే వ్యవసాయ కేంద్రాల్లో సహాయకులను సంప్రదించాలని అధికారులు సూచించారు. అర్హులైన వారు బ్యాంకు ఎన్పీసీఐ (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) లింక్ తప్పనిసరి అని అధికారులు తెలిపారు. రైతుల పట్టాదారు పాసుపుస్తకాలకు వేరొకరి ఆధార్ మ్యాప్ కావడం, అదే విధంగా ఒకే ఆధార్ నంబరు ఎక్కువమంది పట్టాదారులకు నమోదు చేయడం వంటివి ఉంటే మార్చుకోవాలి. ఇక రీసర్వే జరిగిన గ్రామాల్లో కొన్ని సర్వే నంబర్లకు ఎక్కువ మొత్తం విస్తీర్ణం నమోదు అయినా, రీ సర్వే గ్రామాల్లో ఒకే విస్తీర్ణం చాలామందికి నమోదైనే వ్యవసాయ కేంద్రాలను సంప్రదించాలి. పట్టాదారులు తమ ఆధార్ నంబరును అనుసంధానం చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌లోని రైతులందరికీ ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. దీని ద్వారా పంట పెట్టుబడి ఖర్చులను తగ్గించి, రైతులకు ఆర్థిక భరోసా కల్పించడం ధ్యేయం. ఈ పథకం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'పీఎం కిసాన్' పథకానికి అనుబంధంగా పనిచేస్తుంది. ఈ పధకం రాష్ట్రంలో నివసించే అందరు రైతులకు వర్తిస్తుంది. గతంలో ఉన్న చిన్న, సన్నకారు రైతులనే నిబంధన ఇప్పుడు మార్చచేశారు. లబ్ధిదారుడు తప్పనిసరిగా పీఎం కిసాన్ పథకంలో నమోదు అయి ఉండాలి. కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఆదాయపు పన్ను చెల్లించేవారు ఈ పథకానికి అర్హులు కారు. ఈ పధకం వల్ల పంట పెట్టుబడికి అవసరమైన డబ్బు సమయానికి అందడం వల్ల రైతులు అధిక వడ్డీ రుణాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. లభించిన సహాయంతో విత్తనాలు, ఎరువులు మరియు ఇతర వ్యవసాయ పరికరాలను కొనుగోలు చేయవచ్చు, తద్వారా పంట దిగుబడి మెరుగుపడుతుంది. రైతులకు ఆర్థికంగా ఒక స్థిరత్వం లభిస్తుంది, ఇది వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తుంది.ఈ జాబితాలో పేరు లేకపోతే 155251 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చను.

