ప్రభుత్వ భవనాల ఆక్రమణ పై విచారణకు ఆదేశాలు
విచారణ అధికారిగా డివిజనల్ పంచాయతీ అధికారి రవికుమార్
చిత్తూరు ఆగస్టు 4 ఆంధ్రప్రభ
పెనుమూరు మండలంలో ప్రభుత్వ నిధులతో నిర్మించిన భవనాలు ఆక్రమణకు గురి అయ్యాయన్న ఫిర్యాదుల మీద జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. డివిజనల్ పంచాయతీ అధికారి రవికుమార్ ను విచారణ అధికారిగా నియమించారు. పెనుమూరు మండలంలో ఎంపీ నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాలు, వారపు సొంత వద్ద నిర్మించిన ఆరు గదుల షాపింగ్ కాంప్లెక్స్ ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్నాయని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై సామాజిక కార్యకర్త సతీష్, మహిళా నేత కళావతి ఫిర్యాదు చేయడంతో విచారణకు జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాలు జారీ చేశారు. 2007 లో అప్పటి టిడిపి ఎంపి ఎన్ రామకృష్ణా రెడ్డి పెనుమూరులో మండల కమ్యూనిటీ భవనానికి నిధులు కేటాయించారని, ఆ నిధులతో ముత్యాలమ్మ ఆలయ స్థలంలో హాలు కట్టే ప్రయత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే అప్పటి సర్పంచి పి భక్తవత్సలం నాయుడు, ఆలయ ధర్మకర్త అడ్డు చెప్పడంతో ఒక నాయకుడి తండ్రి తన భూములలో కొంత స్థలాన్ని కమ్యూనిటీ హాలు కోసం ఉచితంగా రాసిచ్చారని తెలిపారు. అయితే ఆ నాయకుడు ఇచ్చిన ఆ సర్వే నంబరులో కాకుండా, తమ స్థలం అనుకుని ఉన్న మరొక సర్వే నెంబర్లో హాలు నిర్మించారని వివరించారు. బిల్లు పూర్తిగా రాలేదన్న సాకుతో పూర్తి అయిన కమ్యునిటి భవనాన్ని ప్రభుత్వానికి స్వాధీనం చేయలేదని పేర్కొన్నారు. నెమ్మదిగా మండల కార్యాలయంలో రికార్డులు మాయం చేశారనీ, ఈ విషయమై విచారణ జరిపి కామ్యునిటి హాల్ ను ప్రభుత్వం స్వాదీనం చేసుకోవాలని కోరారు. దీనితో పాటు సంతగేటులో ఆరు గదులు నిర్మించడానికి ఎంపీ నిధులు ఇచ్చారనీ, గదుల నిర్మాణం పూర్తి అయిన తరువాత బిల్లు పెండింగ్ ఉందని సాకు చెప్పి మూడు గదులను మాత్రమే పంచాయతీకి స్వాధీనం చేశారని ఫిర్యాదుదారులు ఆరోపించారు. మిగిలిన మూడు గదులను కూడా బినామీ పేర్లతో నామమాత్రపు అద్దెకు తీసుకుని, అధిక అద్దె రాబట్టుకుంటున్నారని పేర్కొన్నారు. మిగిలిన మూడు గదులు స్వాధీనం చేయకుండా తానే అద్దె వసూలు చేసుకుంటున్నారనీ, దీనిపై ఫిర్యాదుల రావడంతో పంచాయతీ అధికారులు ఆరు గదులు స్వాధీనం చేసుకుంటున్నట్టు, అద్దెకు ఉన్న వారికి నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారని వివరించారు. ఇప్పటి వరకు వాటికి వేలం నిర్వహించలేదన్నారు. గత ప్రభుత్వం నిర్మించిన 24 బస్టాండు వాణిజ్య సముదాయపు గదుల వేలం సమయంలో అవకతవకలు జరిగాయని, ఇద్దరు దళిత నేతలు హై కోర్టులో స్టే తేచ్చారని తెలిపారు. ఇప్పుడు అవి మూతబడి ఉన్నాయని, ప్రభుత్వానికి రావల్చిన ఆదాయం నిలిచిపోయిందని వివరించారు. అలాగే చార్వకాని పల్లె పంచాయతీని, పెనుమూరు పంచాయతీలో విలీనం చేయడాన్ని ఆడ్డుకుంటూ కొందరు కోర్టులో స్టే తేవడం వల్ల ఎన్నికలు ఆగిపోయాయనీ, దీనితో ఫైనాన్స్ కమిషన్ నిధులు రావడం ఆగిపోయాయని వివరించారు. దీంతో ఆ పంచాయతీ అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. వీటి అన్నిటి మీద విచారణ జరిపి ప్రభుత్వ భవనాలను స్వాదినం చేసుకోవాలని, వాటిని కట్టిన నాటి నుండి ఆక్రమించుకున్న వారి నుండి అద్దెను వసూలు చేయాలని కోరారు. ఖాళీగా ఉన్న పంచాయతీకి చెందిన గదులను పారదర్శకంగా వేలం ద్వారా కేటాయించాలని కోరారు.

