అధిష్టానానికి తలనొప్పిగా మారిన జీడీ నెల్లూరు పార్టీ ఎన్నికలు
నియోజకవర్గంలో నేతలు రెండు వర్గాలుగా విడిపోయి ఆధిపత్యం కోసం పోరాటం
సామాజిక మాధ్యమాలలో హోరెత్తుతున్న విమర్శలు, ప్రతి విమర్శలు
మండల పార్టీ అధ్యక్షులపై కొనసాగుతున్న సస్పెన్స్
ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్న ఒక వర్గం
(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ)
గంగాధర నెల్లూరు నియోజక వర్గం మండల కమిటీల ఎన్నికలు టిడిపి అధిష్టాన వర్గానికి తలనొప్పిగా తయారు అయ్యింది. స్థానిక ఎమ్మెల్యే థామస్ వైసీపీకి చెందిన కొందరిని పార్టీలో చేర్చుకోవడంతో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రెండుగా చీలిపోయింది. ఈ విషయమై అధిష్టానానికి పలువురు ఫిర్యాదులు చేశారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వైసీపీ నాయకులను చేరదీయడం అంటే పాముకు పాలు పోసినట్లని గంగాధర నెల్లూరులో జరిగిన కార్యకర్తల సమావేశంలో హెచ్చరించారు. అనంతరం నియోజకవర్గాల అభివృద్ధిపైన ఎమ్మెల్యేతో జరిగిన సమీక్షలో కూడా వైసిపి నుంచి వచ్చిన వారిని దూరంగా పెట్టాల్సిందిగా ఆదేశించారు. అయిన ఎమ్మెల్యే తీరుకు మారకపోవడంతో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రెండుగా చీలిపోయింది. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం ఎమ్మెల్యే థామస్ వైఖరిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఫలితంగా నియోజకవర్గ మండల పార్టీ అధ్యక్షులు ఎన్నిక కార్యక్రమం కూడా సాఫీగా జరగలేదు. ఎమ్మెల్యే ఒకరిని ప్రతిపాదిస్తే, వ్యతిరేక వర్గం మరొకరిని ప్రతిపాదిస్తోంది. దీంతో నియోజకవర్గ మండల పార్టీ అధ్యక్షుల ఎన్నిక అధిష్టానానికి తలనొప్పిగా మారింది.
రాష్ట్రంలో మే 15 నాటికి సంస్థాగత ఎన్నికలు పూర్తి కావాలని పార్టీ నిర్దేశించింది. దీని కోసం ఏప్రిల్ నెలలో వర్ల రామయ్య అధ్యక్షతన ముగ్గురు నియోజకవర్గ పరిశీలకులు, ఆరుగురు మండల పరిశీలకులతో ఒక కమిటీ కూడా వేశారు. జూలై ఆఖరు నాటికి రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాలలో మండల కమిటీలు పూర్తి అయ్యాయి. జి డి నెల్లూరు నియోజక వర్గంలో అజిష్టాను రెండు పర్యాయాలు గడువు విధించినా, మండల పార్టీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కూడా కాలేదు. దీంతో మండల పార్టీ అధ్యక్షులు ఎన్నిక నిమిత్తం ఈ నెల ఐదవ తేదీ పార్టీ చిత్తూరు పార్లమెంటు కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. నియోజకవర్గ ఎమ్మెల్యే ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ సమక్షంలో పరిశీలకులు బొమ్మి సురేంద్ర, జె. రమణా రెడ్డి, రెడ్డివారి గురవారెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభించారు. ఉదయం ఒక్కో మండలం నుంచి పదుల సంఖ్యలో ఆశావహులు ముందుకు వచ్చారు. అయితే అన్ని మండలాలలో ఏకగ్రీవం చేయాలన్న తలంపుతో ఎమ్మెల్యే అందరికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కొన్ని చోట్ల కొంత కటువుగా వ్యవహరించినట్టు వార్తలు వచ్చాయి. మరుసటి రోజు పరిశీలకులు చిత్తూరులోని ఒక ప్రైవేటు హోటల్లో మకాం వేసి వడబోత కార్యక్రమం చేపట్టారు. అయితే పెనుమూరు మాజీ ఎంపిపి, పార్లమెంటు కమిటీ కార్య నిర్వాహక కార్యదర్శి హరిబాబు నాయుడు ఎమ్మెల్యే, పరిశీలకుల చర్యలను ఖండిస్తూ ఆడియో విడుదల చేశారు. రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి భీమినేని చిట్టిబాబు అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్లారు. దీనితో అధిష్టానం మండలానికి రెండు మూడు పేర్లతో జాబితా రూపొందించి పంపమని పరిశీలకులను ఆదేశించినట్టు తెలిసింది. దీనితో పరిశీలకులు ఆ మేరకు ప్రయత్నం ప్రారంభించారు. ఐదు మండలాలలో రెండేసి పేర్లు నిర్ణయించినప్పటికీ వెదురుకుప్పం మండలంలో ఎస్సీ, బీసీ, రెడ్డి వర్గాల మధ్య పోటీ నెలకొన్నది. ఆరు మండలలో ఒకటైనా రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలని పట్టుబట్టారు. దీనితో అక్కడ పీటముడి పడింది. కాగా పెనుమూరు, కార్వేటినగరం, ఎస్ ఆర్ పురం మండలాల్లో మూడు కంటే ఎక్కువ సార్లు పదవిలో ఉన్న వారిని ఎంపిక చేయడం పట్ల పలువురు నిరసన వ్యక్తం చేశారు. నారా లోకేష్ సూచన మేరకు పొలిట్ బ్యూరో నిర్ణయించి మూడు సార్లు నిబంధన పాటించక పోవడం ఏమిటని కొందరు నిలదీశారు. పెనుమూరులో తమ పేరు చేర్చాలని మరో ఇద్దరు అధిష్టాన వర్గానికి విజ్ఞప్తి చేశారు. ఎస్ ఆర్ పురంలో ఒక యువనాయకుడు తన పేరు కూడా పరిశీలించాలని కోరాడు. వెదురుకుప్పంలో గందరగోళం నెలకొన్నది. ఈ నేపధ్యంలో పరిశీలకులు ఇప్పటివరకు అధికారికంగా జాబితా పంపలేదని తెలిసింది. కాగా నియోజక వర్గంలో పార్టీ కార్యకర్తలు థామస్, చిట్టిబాబు నాయుడు వర్గాలుగా చీలిపోయారు. ప్రతి మండలంలో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయారు. వెదురుకుప్పంలో మూడు వర్గాలు ఏర్పడ్డాయి. పెనుమూరు, వెదురుకుప్పం మండలాల్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. పెనుమూరు మండలానికి చెందిన మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు హరిబాబు నాయుడుకు వ్యతిరేకంగా కొందరు సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెట్టారు. ఆ పోస్టులను వ్యతిరేకిస్తూ పెనుమూరు మండలానికి చెందిన పలువురు నాయకులు ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. ఇలా నియోజకవర్గంలోని రెండు వర్గాలు ఒకరి పైన ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొందరు నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుల మీద కూడా విమర్శలు సంధించారు. ఎమ్మెల్యేతో
పార్టీ పరిశీలకులు కొమ్మక్కై నిబంధనలకు వ్యతిరేకంగా మండల పార్టీ అధ్యక్షులను ఎంపిక చేస్తున్నారని నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు పార్టీ అధిష్టానానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు కూడా చేశారు. దీనితో అధిష్టానం ప్రత్యామ్నాయ మార్గం అన్వేషిస్తున్నదని సమాచారం. రెండు, మూడు రోజుల్లో పలువురు నాయకులు చంద్రబాబును కలిసి ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా తమ వాదనలు వినిపించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు నియామకం మీద కూడా విమర్శలు ఉన్నాయి. అధిష్టానం ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క పరిశీలకుడిని నియమించింది. వారు మండలంలో పర్యటించి గ్రామ పార్టీ అధ్యక్షులు నియామకం చేపట్టారు. అయితే కొందరు పరిశీలకులు ఇచ్చిన జాబితాను తారుమారు చేసి, తనకు అనుకూలంగా మార్పులు చేర్పులు చేశారని ఆరోపణలు కూడా ఉన్నాయి.

