3, ఆగస్టు 2025, ఆదివారం

పూతలపట్టు వైసిపి నేతలకు భారీగా పోలీసుల నోటీసులు

సెక్షన్ 41 కింద నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మని ఆదేశాలు

ఇప్పటికీ 50 మందికి పైగా నాయకులు, కార్యకర్తలకు నోటీసులు 

కొనసాగుతున్న నోటీసుల పర్వం 

విచారణ అనంతరం పలువురిని నిందితులుగా చేర్చే అవకాశం 

వైసీపీ నాయకుల వైఖరిని సీరియస్ గా తీసుకున్న జిల్లా పోలీస్ అధికారులు

(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ)

పూతలపట్టు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసుల కేసు కేసుల భయం వెంటాడుతోంది. జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా పోలీసుల ఆంక్షలను ఉల్లంఘించారని ఇప్పటికే నియోజకవర్గంలో సుమారుగా 50 మందికి పైగా 41 నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. మరికొందరికి నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలోని అన్ని మండలాల వైసిపి నాయకులు, కార్యకర్తలను పోలీసులు ఈ కేసులలో చేరుస్తున్నారు. రోజు కొంతమందికి 41 నోటీసులు జారీ చేస్తున్నారు. దీంతో ఎవరు ఎప్పుడు పోలీస్ ల నుంచి ఫోన్ వస్తుందో, వెళ్లి 41 నోటీసులు అందుకోవాల్సి వస్తుందోనని నాయకులు, కార్యకర్తలలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.



పోలీసుల ఆంక్షల మధ్య ఈనెల తొమ్మిదవ తారీఖున వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెం పర్యటన జరిగిన విషయం తెలిసిందే. మామిడి రైతులను పరామర్శించడానికి వచ్చిన నేపథ్యంలో బంగారు పాల్యంలో భారీగా బల ప్రదర్శన, రోడ్ షో నిర్వహించారు. రోడ్డు షో మధ్యలో జగన్మోహన్ రెడ్డి వాహనం నుండి దిగడానికి ప్రయత్నం చేశారు. అయితే పరిస్థితి అదుపు తగ్గుతుందని జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు అడ్డుకున్నారు. దీంతో జగన్మోహన్ రెడ్డి వేలు చూపిస్తూ జిల్లా ఎస్పీని హెచ్చరిస్తున్నట్లు మాట్లాడారు. అలాగే మాజీ మంత్రి అంబటి రాంబాబు పత్రికా విలేకరులతో మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే చిత్తూరు ఎస్పీ మీద రౌడీషీట్ ఓపెన్ చేస్తామని ప్రకటించారు. ఈ విషయాలను పోలీస్ అధికారులు చాలా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో జగన్ ప్రోగ్రాం జరిగిన రోజు సాయంకాలం నుండి చిత్తూరు జిల్లాలోని వైసిపి నాయకులపై  పోలీసు కేసుల నమోదు ప్రారంభమైంది. పోలీసుల ఆజ్ఞలను ఉల్లంఘించి భారీగా జన సమీకరణ చేయడం, మామిడికాయలను రోడ్డుమీద పారబోసి, తొక్కించడం, జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ని దారి మళ్లించడం, పోలీసులను బెదిరించడం, వారి విధులకు ఆటంకం కలగజేయడం వంటి కారణాలతో నాలుగు ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయి. తొలుత 14 మంది మీద కేసులు నమోదు చేశారు. జగన్ పర్యటనను మొత్తం పోలీసులు వీడియగ్రఫీ చేశారు. డ్రోన్ కెమెరాలు వినియోగించారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత అందులో ముఖ్య భూమిక పోషించిన నాయకుల మీద కేసుల నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. ఫోటోలను వీడియోలను పరిశీలిస్తూ వైసిపి క చెందిన ముఖ్య నాయకులకు బంగారుపాళ్యం పోలీసులు 41 నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పటికీ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి, పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కుమార్ రాజా, పూతలపట్టుకు చెందిన వైసిపి నేత తలపలపల్లి బాబు రెడ్డి, చిత్తూరుకు చెందిన నియోజకవర్గ కన్వీనర్ విజయానంద రెడ్డి తదితరులకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. మండలాల వారిగా బంగారు పాలెంలో 25 మందికి, పూతలపట్టులో ఏడు మందికి, ఐరాలలో పది మందికి, తవణంపల్లిలో ఒకరికి,  యాదమరిలో ఏడు మందికి నోటీసులు జారీచేసినట్లు తెలుస్తోంది. నోటీసులు జారీ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. నోటీసుల జారీ పూర్తి అయిన తర్వాత వారిని పిలిచి వారి వాగ్మూలాన్ని నమోదు చేసే అవకాశం ఉంది. అనంతరం వారిని కేసులో చేర్చాలా లేదా అన్న విషయమై పోలీసులు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పోలీసుల విచారణ అనంతరం నిందితుల జాబితాలో మరి కొంతమందిని చేర్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సంఖ్య ఎంత అన్నది ప్రస్తుతానికి ఎవరికీ తెలియదు. ఇప్పటివరకు అరెస్టులు ప్రారంభం కాలేదు.  కేసులు అన్ని దర్యాప్తు దశలో ఉన్నాయి. జగన్‌ పర్యటన సందర్భంగా షరతులు ఉల్లంఘించారని తోలుత పలువురు వైసిపి నాయకులపై బంగారుపాళ్యం పోలీసులు కేసులు నమోదు చేశారు. వైసిపి పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సునీల్ కుమార్, మాజీ జెడ్పీ చైర్మన్ ఎం.బి. కుమార్‌రాజా, మండల వైసీపీ కన్వీనర్ రామచంద్రారెడ్డి, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు కిషోర్‌ కుమార్ రెడ్డి, మండల యువత అధ్యక్షుడు గజేంద్ర తదితరులపై కేసు నమోదు చేశారు. పోలీసులు ఆంక్షలను ఉల్లంఘించి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో  ఆయన కాన్వాయ్ ని పోలీసులు నిర్దేశించిన దారిలో కాకుండా వేరే  దారి మళ్ళించడం, పోలీసులతో వాగ్వివాదానికి దిగడం, జాతీయ రహదారిలో వాహనాల రాకపోకలకు అంతరాయం కల్పించడం, మామిడి మార్కెట్ యార్డులో మూడు వేల వరకు ప్రజలను సమీకరించడం, ఉద్దేశపూర్వకంగా బంగారు పాల్యంలో పోలీసుల ఆంక్షలను ఉల్లంఘించడం వంటి నేరాలకు పాల్పడినట్లు ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఆకస్మికంగా రోడ్డుపైన 4 ట్రాక్టర్ల మామిడికాయలను పారబోసి, వాటిని  తొక్కించడం, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం, ట్రాఫిక్ కు అంతరాయం కలిగించడం తదితర కారణాలతో తుంబపాలెంకు చెందిన న్యాయవాది దేవేంద్ర, తిమ్మాజిపల్లికి చెందిన ప్రకాష్ రెడ్డి, ఆయన కుమారుడు భగత్ రెడ్డి, ట్రాక్టర్ డ్రైవర్లు అక్బర్, ఉదయ్ మరికొంత మంది మీద కేసును నమోదు చేశారు.  ఈ కేసులో న్యాయవాది దేవేంద్రను, డ్రైవర్లు అక్బర్ ఉదయ్ లను రెండు రోజులలోనే అదుపులోకి తీసుకున్నారు. జగన్ పర్యటనలు మీడియా ఫోటోగ్రాఫర్ శివకుమార్ పైన దాడికి సంబంధించిన విషయంలో పలువురి మీద ఎఫ్ఐఆర్ నమోదయింది. ఇప్పటికే గంగాధర నెల్లూరుకి చెందిన వినోద్ కుమార్, మోహన్, చిత్తూరు చెందిన చక్రి, వీకోటకు చెందిన శంకరాచారి లను గుర్తించారు. ఇందులో కొందరిని అదుపులోకి తీసుకున్నారు. మరి కొందరిని గుర్తించే కార్యక్రమం జరుగుతోంది. జగన్ పర్యటనలో పోలీసులతో వాదించి పోలీసులను నెట్టుకొని లోనికి ప్రవేశించిన కేసులో చిత్తూరుకు చెందిన వైసీపీ నేత విజయానంద రెడ్డి, మరికొందరి పైన కేసును నమోదు చేశారు. వీరు పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, పోలీసులను రప్పా, రప్పా నరుకుతామని బెదిరించడం, బారికెట్లు తోసుకొని హెలిపాడ్ లోకి ప్రవేశించడం వంటి చర్యలకు పాల్పడ్డారని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. జగన్ పర్యటన తరువాత  పోలీసులు  తొమ్మిదవ తారీఖున మూడు ఎఫ్ఐఆర్లు నమోదు కాగా, మరుసటి రోజు మరో ఎఫ్ఐఆర్ నమోదయింది. ఈ కేసులో చిత్తూరుకు చెందిన వైసిపి ఇన్చార్జి విజయానందరెడ్డిని ప్రధాన నిందితుడిగా చేర్చారు. హెలిపాడ్ దగ్గర 30 మందికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే భారీకేట్లను ఛేదించుకొని, పోలీసుల వలయాన్ని తోచుకుని 500 పైగా కార్యకర్తలు హెలిపాడ్ లోకి ప్రవేశించారు. ఈ సమయంలో పోలీసులకు, వైసీపీ నాయకులకు తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది. కొందరు పోలీసులను తోసుకొని హెలిపాడ్ లోకి ప్రవేశించారు. ఒక కానిస్టేబుల్ కింద పడిపోయాడు. గాయాలు అయ్యాయి. ఈ సందర్భంగా డిఎస్పకి, చిత్తూరు నియోజకవర్గ ఇన్చార్జి విజయానంద రెడ్డికి తీవ్రస్థాయిలో వాగ్వి వాదం జరిగింది. కొందరు డిఎస్పిని రప్పా, రప్పా నరుకుతామని హెచ్చరించారు. తోపులాటలో విజయానంద రెడ్డి, ఒక కానిస్టేబుల్, ఒక మహిళ కింద పడిపోయారు. హెలిపాడ్ నుంచి జగన్ కాన్వాయ్ రూట్ ను కూడా స్థానిక నాయకులు మళ్ళించారు. ఆధారిలో మామిడికాయలను రోడ్డు మీద పోసి తొక్కించారు. కావున కాన్వాయ్ ని ఆ దారిలో మళ్లించారు. అలాగే మామిడికాయల మార్కెట్ యార్డులో 500 కార్యకర్తలకు మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే వైసిపి కార్యకర్తలు ప్రహరీ గోడ దూకి, పోలీసులను తోసుకొని మార్కెట్ యార్డులోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న పోలీసులకు వైసీపీ నాయకులకు తీవ్రస్థాయిలో వాగ్వివాదాలు జరిగాయి. తమ వాహనాలను లోనికి అనుమతించలేదని వైసిపి జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి, చిత్తూరు నియోజకవర్గ ఇన్చార్జి విజయానంద రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోలీసులతో గొడవపడ్డారు. అలాగే వార్తల కవరేజ్ కెళ్ళిన ఫోటోగ్రాఫర్ పైన దాడి జరిగింది వీటన్నిటిని పోలీసులు వీడియో కెమెరాల ద్వారా, డ్రోన్ కెమెరాల ద్వారా చిత్రీకరించారు. వాటిని నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రాథమికంగా 14 మంది మీద ప్రస్తుతం కేసులు నమోదు చేసినా, భవిష్యత్తులో భారీగా నిందితులను చేర్చే ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఇందులో భాగంగా 41 నోటీసులను ఇస్తున్నారు. ఈ కేసుల విషయమై నియోజకవర్గ వైసిపి నేత ఒకరు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం సాఫీగా జరిగిపోయిందన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, అయినా పోలీసులు కేసులతో నాయకులు, కార్యకర్తలను వేధిస్తున్నారని తెలిపారు. ఈ విషయం కూడా వైసిపికి ఒక విధంగా మేలు చేస్తుందని, ఇప్పటివరకు నియోజకవర్గంలో వైసీపీ నాయకులు ఎవరికి వారుగా ఉన్నారని అన్నారు. పోలీసు కేసుల కారణంగా అందరూ ఒకటయ్యే అవకాశం ఉందని, ఇందువల్ల పార్టీ కూడా బలపడుతుందని ఆయన వ్యాఖ్యానించారు.


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *