కాణిపాకంలో అరకు వ్యాలీ కాఫీ ఫ్రాంచైజీ ఏర్పాటుకు రాజకీయ చిక్కుముడి
ఎంపి, ఎమ్మెల్యేలు వేరు వేరు మహిళలకు సిఫారసు చేసిన వైనం
తాము సిఫార్సు చేసిన వారికే కేటాయించాలని ఇద్దరి పట్టు
అయోమయంలో కాణిపాకం ఆలయ ఇఓ పెంచల కిషోర్
సమస్యను పరిష్కరించాలని ఎండోమెంట్ కమిషనర్ కు లేఖ
*చిత్తూరు బ్యూరో, చిత్తూరు.*
విశాఖపట్నం గిరిజన కార్పొరేషన్ చెందిన అరకు కాఫీ స్టాల్ ను కాణిపాకం దేవస్థానం ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. దేవస్థానం ఆవరణంలో అరకు వ్యాలీ కాఫీ ఫ్రాంచైజీ ఏర్పాటు ద్వారా అరకు కాఫీని ప్రమోట్ చేయాలనీ, అలాగే గిరిజన ఉత్పత్తులను విక్రవిం చాలని విశాఖపట్నం గిరిజన సహకార సంస్థ నిర్ణయించింది. ఇందుకు ఫ్రాంచైజీ ఏర్పాటుకు కసరత్తును ప్రారంభించింది. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా ప్రయత్నాలను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో అరకు ఉత్పత్తులను విక్రయించడానికి తగిన స్థలం కేటాయించాలని గత నెల 14వ తారీఖున చిత్తూరు పార్లమెంటు సభ్యుడు దగ్గుమల్ల ప్రసాదరావు కాణిపాకం ఈవో పెంచల కిషోర్ కు ఒక లేఖ రాశారు. ఆ లేఖలో నాగమ్మ గిరిజన గిరిజన సహకార సంస్థ విశాఖపట్నం నుంచి అరకు వ్యాలీ కాఫీ ఫ్రాంచైజీ ఏర్పాటు చేయడానికి అనుమతి పొందాలని, ఆమెకు దేవస్థానం ప్రాంగణంలో ఔట్లెట్ ఏర్పాటు చేయడానికి అనువైన స్థలాన్ని కేటాయించాలని కోరారు. లేకతో పాటు నాగమ్మకు విశాఖపట్నం గిరిజన సహకార సంస్థ ఆమెకుఅరకు వ్యాలీ కాఫీ ఫ్రాంచైజీ మంజూరు చేస్తున్నట్లు ఇచ్చిన లేఖను జత చేశారు. అనంతరం గత నెల 21వ తారీఖున పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ మరో లేఖను ఆలయ ఈవో పెంచల కిషోర్ కు రాశారు. గిరిజన సహకార సంస్థ అరకు వ్యాలీ కాఫీ ఫ్రాంచైజీ ఏర్పాటుకు వీలుగా కాణిపాకం దేవస్థానంలో దేవస్థానం ఆవరణంలో ఒక గదిని కేటాయించాలని, ఆ గదినీ ఐరాల మండలం మల్లారపల్లి చెందిన లలితమ్మకు ఇవ్వాలని కోరారు. ఆమె కమ్యూనిటీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారని, దేవస్థానం ప్రాంగణంలో ఆమెకు అరకు కాఫీ స్టాల్ ఉన్న కేటాయించడం కారణంగా ఆధ్యాత్మిక సాంస్కృతిక అనుభవం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. అరకు వ్యాలీ కాఫీ ఫ్రాంచైజీ ఏర్పాటు చేయడానికి 100 చదరపు అడుగుల స్థలాన్ని లడ్డు పోటు భవనానికి పశ్చిమ వైపు గేటు వద్ద ఆలయ అధికారులు గుర్తించారు. ఈ స్థలం అరకు వ్యాలీ కాఫీ, గిరిజన సహకార సంస్థలు విక్రయించడానికి అనుగుణంగా ఉంటుందని భావించారు. ఇందుకు నెలకు 30 వేల రూపాయలు అద్దెగా నిర్ణయించారు. అయితే అరకు కాఫీ స్టాల్ ను ఏర్పాటు చేయడానికి ఎంపీ, ఎమ్మెల్యే వేరువేరుగా వేరువేరు వ్యక్తులను సిఫార్సు చేయడంతో ఈ ఆలయ ఈవోకు ఏం చేయాలో దిక్కుదోచలేదు. ఈ విషయంలో ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని వెనక్కి తగ్గే సూచనలు కనిపించలేదు. ఇద్దరూ తమ సిఫారసు చేసిన వారికే అరకు వ్యాలీ కాఫీ ఫ్రాంచైజీని కేటాయించాలని కోరడంతో ఈ విషయమై ఎండోమెంట్ కమిషనర్ కు ఆలయ ఇఓ లేఖ రాశారు. అరకు వ్యాలీ కాఫీ ఫ్రాంచైజీ కోసం ఎంపీ ఎమ్మెల్యే లేఖలు ఇవ్వడం విషయాలను కమిషనర్ దృష్టికి తీసుకొని వెళ్లారు. వీటిని పరిశీలించి ఎవరికి అరకు వ్యాలీ కాఫీ ఫ్రాంచైజీని కేటాయించాలో తగిన ఆదేశాలు జారీ చేయాల్సిందిగా ఆలయ ఈవో పెంచల కిషోర్ కోరారు. ఈ వివాదం కారణంగా తత్కాలికంగా కాణిపాకంలో అరకు వ్యాలీ కాఫీ ఫ్రాంచైజీ ఏర్పాటుకు బ్రేక్ పడింది. తదుపరి ఎండోమెంట్ కమిషనర్ ఆదేశాలు కనుగొనంగా అరకు వ్యాలీ కాఫీ ఫ్రాంచైజీని ఎవరికీ కేటాయిస్తారో వేచిచూడాలి.

