26, ఆగస్టు 2025, మంగళవారం

పునరావృతం కాకుండా జాగ్రత్త పడతాను !


- టిడిపి నేత ఎన్ బి సుధాకర్ రెడ్డి 


 ఆవేదనతో తాను ఒక మంత్రిపై చేసిన ఆరోపణలు లాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త పడతానని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి చెప్పారు. మంగళవారం, మంగళగిరి లోని టిడిపి కేంద్ర కార్యాలయంలో ఆయన పార్టీ క్రమ శిక్షణ సంఘం ముందు హాజరయ్యారు. పొలిట్ బ్యూరో సభ్యుడు, క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ వర్ల రామయ్య సభ్యులు ఎమ్మెల్సీ పంచుమర్తి అనూరాధ ,ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ  నారాయణ రావు లకు అన్ని అంశాలు వివరించారు. చంద్రబాబు నాయుడుపై ఉన్న ప్రేమతో కొందరి తీరును ఖండించే సందర్భంలో పొరపాటుగా మంత్రిపై వ్యక్తిగత ఆరోపణలు చేశానని తెలిపారు.  దీని వల్ల పార్టీకి జరిగిన నష్టానికి చింతిస్తున్నానని, భవిష్యత్తులో పునరావృత కాకుండా జాగ్రత్త పడతానని చెప్పారు. కాగా అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసిపి నేత తమ పార్టీ విషయాలలో అనవసరంగా జోక్యం చేసుకోవడం తగదని హితవు పలికారు. వైసిపి చానళ్లలో తన పైన వేటు అంటూ వార్తలు రావడాన్ని తీవ్రంగా ఖండించారు. వేటు, పోటు, కాటు లాంటివి ఏవీ లేవని వ్యాఖ్యానించారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయాలను పాటిస్తామని చెప్పారు. వైసిపి నేతల అక్రమాలు, అవినీపై తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఒక ప్రశ్నకు సమాధానం చెపుతూ తాను నామినేటెడ్ పదవి ఇవ్వలేదన్న కోపంతో మాట్లాడలేదని చెప్పారు. తాను ఎప్పుడూ పదవుల కోసం ప్రకులదనని అన్నారు. చంద్రబాబు నాయకత్వం పట్ల ఆకర్షితుడనై పార్టీలో పని చేస్తున్నానని అన్నారు. అయితే, ఆంధ్రప్రభ కు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు తిరుపతిలో జరుగుతున్న పరిణామాల పట్ల సుధాకర్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎన్నికల తర్వాత పార్టీలోకి వచ్చిన ఒక మహిళా కార్పొరేటర్ కు ఇస్తున్న గౌరవం కూడా తొలనుండి పార్టీలో ఉంటూ, రాష్ట్రస్థాయి అధికార ప్రతినిధిగా ఉన్న తనకు కూడా లభించడం లేదని అన్నట్లు సమాచారం. ఆ మహిళా కార్పొరేటర్ ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటనలలో ముందు ఉంటారని, ముఖ్యమంత్రి తిరుపతికి వచ్చినా, ఆమెను ఎయిర్పోర్టులోకి అనుమతిస్తున్నారని,  తన లాంటివాళ్ళు ఎయిర్పోర్ట్ ఏర్పాటు బయట ఉండాల్సి వస్తుందని ఆవేదన చెందినట్లు సమాచారం. కడప జిల్లాలో జరిగిన మహానాడులో ఆ మహిళా కార్పొరేటర్ కు ఏ  హోదాలో స్టేజ్ పాసు ఇచ్చారని అడిగినట్లు సమాచారం.  ఉన్నత  చదువులు చదువుకొని, విద్యార్థి నాయకుడి నుంచి సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి, ఒక సైకాలజిస్ట్ గా ఉన్న తాను టీవీ డిబేట్ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానే తప్ప ఉద్దేశపూర్వకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నట్లు తెలిసింది. అప్పుడు కూడా మంత్రి పేరు చెప్పకుండా జాగ్రత్త పడ్డాననీ, పార్టీ మీద తనకు ఉన్న గౌరవంతోనే తిరుపతిలో జరుగుతున్న విషయాలను పార్టీ దృష్టికి తీసుకురావాలన్న సదుద్దేశంతో తాను మాట్లాడినట్లు వివరించారు. తాను చేసింది తప్పు అయితే క్రమశిక్షణ సంఘం ఏం చర్యలు తీసుకున్న కట్టుబడి ఉంటానని అన్నట్లు సమాచారం. తప్పు చేసిన వారిని వదిలిపెట్టి పార్టీ ప్రయోజనం నిమిత్తం పరిధి దాటకుండా పార్టీ దృష్టికి తీసుకుని వచ్చిన తనను క్రమశిక్షణ కమిటీ ముందుకు పిలువడం ఏమిటని అన్నట్లు తెలిసింది. అయితే కమిటీ సభ్యులు మీ మీద గౌరవం ఉందని, ఆ పార్టీ అధినేత కాదని ఆదేశానుసారం పిలవాల్సి వచ్చిందని అన్నట్లు తెలిసింది. టీవీ డిబేట్ మూలంగా కాకుండా పార్టీ వేదికల మీద ప్రస్తావించి ఉంటే సముచితంగా ఉండేదని అన్నట్లు సమాచారం. అయితే, ఆ అవకాశం ఎక్కడ ఉందని సుధాకర్ రెడ్డి క్రమశిక్షణ కమిటీ సభ్యులను ప్రశ్నించినట్లు తెలిసింది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *