ఇతర పార్టీల నుండి వచ్చిన ఎమ్మెల్యేల వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తోంది
అవినీతి, అక్రమాలకు, పాల్పడుతూ అక్రమ రవాణా చేస్తున్నారు
ఒక ఎమ్మెల్యే పార్టీ పదవులను లక్షలాది రూపాయలకు అమ్ముకున్నారు
తిరుపతికి తరచుగా వచ్చే మంత్రి ఆడవాళ్ళతో సరసాలు చేస్తున్నారు
పార్టీలు తొలగించి కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలకు విలువలేదు
టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్ బి సుధాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రభ బ్యూరో , చిత్తూరు
ఇతర పార్టీల నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని, వారి వల్ల తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు వస్తుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి ఎన్ బి సుధాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం కొన్ని మీడియా చానళ్లలో మాట్లాడుతూ స్వంత పార్టీ ఎమ్మెల్యేలపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరి గెలుపొందిన ఎమ్మెల్యేలు కబ్జాలకు పాల్పడుతూ అక్రమ రవాణా చేస్తున్నారని విమర్శించారు. జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే మండల పార్టీ అధ్యక్షుడు పదవులను లక్షణాల రూపాయలకు అమ్ముకున్నారని ఆరోపించారు. తరచుగా తిరుపతికి వచ్చే ఒక మంత్రి ఫైవ్ స్టార్ హోటల్లో దిగుతూ మహిళలతో సరసాలు ఆడుతున్నారని సంచలన విమర్శలు చేశారు. కొందరు ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతి, అక్రమాల కారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖంలో చిరునవ్వు మాయమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగుతాయి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి భారీ నష్టం జరుగుతుందని జోస్యం చెప్పారు.
గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గాడి తప్పుతున్న కొందరు ఎమ్మెల్యేలను హెచ్చరించారు. అలాంటి వారిని జిల్లా ఇంచార్జి మంత్రులు నియంత్రించాలని ఆదేశించారు. ఈ అంశంలో రాష్ట్రంలో సంచలనం కలిగించింది. ఈ నేపధ్యంలో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్ బి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ కొందరు ఎమ్మెల్యేలపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. అందులో చిత్తూరు జిల్లాకు చెందిన కొందరిపై పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఒక ఎమ్మెల్యే పార్టీ మండల కమిటీ అధ్యక్ష పదవులను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఒక్కో మండల పదవికి రూ. 20 నుంచి 50 లక్షల వరకు వసూలు చేశారని ధ్వజం ఎత్తారు. కొత్తగా వైసిపి నుంచి వచ్చిన నాయకుల వల్లే ఈ అక్రమాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. కొందరు నిద్ర లేచింది మొదలు ఇసుక, గ్రావెల్, గ్రానైట్ అక్రమ రవాణాలకే సమయం వెచ్చిస్తున్నారని చెప్పారు. వైసిపి నేతలపై ప్రాణాలకు తెగించి పోరాడిన తన లాంటి వారికి పార్టీలో విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసిపి నుంచి వచ్చిన వారికి రాజ మర్యాదలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిబద్ధత కలిగిన చంద్రబాబు నాయుడుని తిరిగి ముఖ్య మంత్రి చేయాలన్న లక్ష్యంతో సైకాలజిస్టు అయిన తాను టీడీపీలోకి వచ్చానని చెప్పారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలు చూసిన తర్వాత పార్టీకి రాజీనామా చేసి బహిరంగంగా పోరాటం చేయాలని అనిపిస్తోందని చెప్పారు. ఈ విషయం ఇప్పటికే పార్టీ పెద్దలకు తెలిపానని చెప్పారు. అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేలు రాజ్యాంగ అతీత శక్తులుగా వ్యవహరిస్తున్నారని ఆయన పరోక్షంగా విమర్శించారు. కంచే చేను మేసినట్టు ఎమ్మెల్యేలను నియంతించాల్సిన మంత్రులు కూడా కొందరు గాడి తప్పారని ఆరోపించారు. ఒక మంత్రి స్టార్ హోటళ్లలో ఉంటూ సాధారణ కార్యకర్తలను పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో వైసిపి నాయకులు, కోవర్టులు, రాజకీయ బ్రోకర్లకు ఉన్న విలువ నిజమైన కార్యకర్తలకు లేదని వాపోయారు. నియోజకవర్గంలో పెళ్లిళ్లు, ఉత్సవాలకు కూడా ఎమ్మెల్యేల అనుమతులు తీసుకోవాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని టిడిపి ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో చలరేగిపోతున్నారని విమర్శించారు. తిరుపతికి వచ్చే మంత్రులు, టిడిపి నాయకులను కలవడం కూడా కష్టంగా ఉందన్నారు. ఒక మంత్రి ఫైవ్ స్టార్, సెవెన్ స్టార్ హోటల్ లో దిగుతారని, ఆ మంత్రి పక్క గదిని తాగడానికి, సరసాలు ఆడడానికి ఉపయోగిస్తారని తెలిపారు. వైసీపీ నుంచి వచ్చిన మహిళలతో ఆ మంత్రి చాలా సన్నిహితంగా ఉంటారని తెలిపారు. వీటిని చూస్తుంటే, పార్టీకి రాజీనామా చేసి అవినీతి ఎమ్మెల్యేలపై పోరాటం చేయాలని అనిపిస్తుందని వ్యాఖ్యానాలు చేశారు. ప్రధానంగా జి డి నెల్లూరు నియోజక వర్గం వ్యవహారాలతో విసిగి పోయిన ఆయన బహిరంగ విమర్శలకు దిగారని ఇక్కడి రాజకీయ వర్గాలు అంటున్నారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాలలో దుమారం లేపుతోంది.
పో రై ఎన్ బి సుధాకర్ రెడ్డి

