6, ఆగస్టు 2025, బుధవారం

రెండవ రోజూ కొలిక్కిరాని జీడి నెల్లూరు వ్యవహారం

ప్రైవేటు హోటల్లో రోజంతా చర్చలు, సంప్రదింపులు 

ఏకగ్రీవానికి ససేమిరా అన్న మండల నేతలు 

ఎన్నికల పరిశీలకుల మీదనే విమర్శలు, ఫిర్యాదులు 

ఒక్కొక్క మండలానికి మూడు పేర్లతో జాబితా 

అధిష్టానానికి పంపనున్న నియోజకవర్గ పరిశీలకులు

(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)

గంగాధర నెల్లూరు నియోజక వర్గం మండల కమిటీల వ్యవహారం రెండవ రోజు కూడా ఒక కొలిక్కి రాలేదు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో సమావేశం జరగగా, బుధవారం ఒక ప్రైవేటు హోటల్ కు మారింది. ముగ్గురు పరిశీలకులు చిత్తూరులోని ఒక ప్రైవేటు హోటల్లో కూర్చుని సాయంత్రం వరకు తర్జన భర్జనలు, సంప్రదింపులు జరిపారు. ఆయనా, ఒక మండలం కూడా ఏకగ్రీవం కాలేదు. పైగా ఎన్నికల ప్రక్రియ మరింత జటిలం అయ్యింది. కొందరు అభ్యర్థులు తమ పోటీల్లో ఉన్నామని, అయినా, ఆ కారణంగా తమను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రక్రియ ఏకపక్షంగా జరుగుతోందని, ఇందుకు నిరసనగా తాము తెలుగుదేశం పార్టీకి సామూహికంగా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఒక నేత వాట్సాప్ మెసేజ్ లో హెచ్చరించారు. జరిగిన పొరబాట్లు దిద్దుకోవడానికి పది రోజులు సమయం ఇస్తున్నట్టు పేర్కొన్నారు. నియోజకవర్గ పరిశీలకులు అమ్ముడుపోయారంటూ మరికొందరు వాట్సాప్ గ్రూపులో మెసేజ్ పెట్టారు. నియోజకవర్గంలో రెండు వర్గాలుగా విడిపోయిన తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరికి వాళ్లు తాము ఆధిపత్యం సాధించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అధిష్టానానికి భారీగా ఫిర్యాదులు పంపుతున్నారు.



 మంగళవారం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే, పరిశీలకులు ఏక పక్షంగా వ్యవహరించారని పార్లమెంటు కార్య నిర్వాహక కార్యదర్శి, పెనుమూరు మాజీ ఎంపిపి హరిబాబు నాయుడు ఆరోపిస్తూ వాట్సాప్ గ్రూపుల్లో వాయిస్ మెసేజ్ పెట్టారు. ఎమ్మెల్యే తానే సుప్రీం అంటూ కొందరు పోటీదారులను బయటికి పంపేశారని ఆరోపణలు చేశారు. పరిశీలకులు అమ్ముడు పోయారు అంటూ కొందరు వాట్సప్ గ్రూపుల్లో హల్ చల్ చేశారు. ఈ ఆరోపణల్లో నిజం లేదంటూ ఎమ్మెల్యే వర్గీయులు  ఖండిస్తూ మెసేజీలు పెట్టారు. కొంత మంది తమ పేర్లు జాబితాలో తొలగించారని, తమకు అవకాశం కల్పించాలని అధిష్టాన వర్గానికి విజ్ఞాపన పత్రాలు పంపారు. కార్వేటినగరం, ఎస్ ఆర్ పురం, పెనుమూరు మండల అధ్యక్షులు మూడు కంటే ఎక్కువ సార్లు పదవిలో ఉన్నప్పటికీ తిరిగి కొనసాగించే ప్రయత్నం జరుగుతున్నదని ఆయా మండల ఆశావహులు ఫిర్యాదులు చేశారు. అధిక శాతం ఓట్లు ఉన్న రెడ్డి సామాజిక వర్గాన్ని విస్మరించే కుట్ర జరుగుతున్నదని ఆ సామాజిక వర్గం నేతలు ఆరోపిస్తున్నారు. ఆరు మండలలో ఒక మహిళకు కూడా ప్రాధాన్యత కల్పించే పరిస్థితులు కనిపించడం లేదు. ఇప్పటి పరిస్థితుల ప్రకారం మూడు మండలాలలో కమ్మ సామాజిక వర్గం వారికి మండల అధ్యక్ష పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. ఎస్సీ, బిసి సామాజిక వర్గం వారికి ఒకటి ఇచ్చే అవకాశం ఉంది. వెదురుకుప్పం మండలంలో రెడ్డి, ఎస్సీ, బిసి నేతల మధ్య పోటీ నెలకొన్నది. ఈ నేపధ్యంలో పరిశీలకులు మండలానికి రెండు మూడు పేర్లతో జాబితాలు రూపొందించి రాష్ట్ర పార్టీ కార్యాలయానికి పంపినట్టు తెలిసింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు పరిశీలకులు తిరస్కరించారు. నాయకులు ఇచ్చిన సమాచారం ప్రకారం జాబితాల్లో రెండు, మూడు పేర్లు ఉన్నట్టు తెలిసింది. పాలసముద్రం మండల అధ్యక్ష జాబితాలో శివానాయుడు, వాసు నాయుడులో పేర్లు ఉన్నాయని అంటున్నారు. అయితే ఆఖరు నిమిషంలో ప్రస్తుత అధ్యక్షుడు రాజేంద్ర పేరు కూడా చేర్చే అవకాశం ఉందని తెలిసింది. జి డి నెల్లూరులో స్వామి దాసు, దేవ సుందరం పేర్లు ఉన్నాయి. పెనుమూరు మండల అధ్యక్షునిగా రుద్రయ్య నాయుడు పేరు ఖరారు అయినట్టు ప్రచారం జరుగుతున్నది. అయితే అతను ఏడు సార్లు పదవిలో ఉన్నందున  కృష్ణమూర్తి నాయుడు, సుబ్రమణ్యం నాయుడు పేర్లు జాబితాలో చేర్చినట్టు తెలిసింది. వెదురుకుప్పం జాబితాలో మునిచంద్రా రెడ్డి, కిషన్ చంద్ ( బిసి), మోహన మురళీ ( ఎస్సీ) పేర్లు ఉన్నాయి. కార్వేటినగరం చెంగల్రాయ యాదవ్  మూడు సార్లు పదవిలో ఉన్నందున, రవి యాదవ్ పేరుకూడా చేర్చారని సమాచారం. ఎస్ ఆర్ పురం మండలంలో జయశంకర్ నాయుడు మూడు సార్లు పదవిలో ఉన్నందున ఆయనతో పాటు వేమా నాయుడు, పైనేని మురళీ పేర్లు చేర్చారని అంటున్నారు. ఒక వేళ ఒకటి రెండు ఏకగ్రీవం చేసినట్టు పంపిన ఐవీఆర్ఎస్ లో 70 శాతం మద్దతు వస్తేనే ఆమోదిస్తారని లేకుంటే తిరిగి ఎంపిక చేశామని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారని రాష్ట్ర నాయకుడు ఒకరు చెప్పారు. కాగా పెనుమూరుకు చెందిన రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి, పాలసముద్రం మండలానికి చెందిన రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి భీమినేని చిట్టిబాబు నాయుడు ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండటం విశేషం. ఈ విషయమై నియోజకవర్గ పరిశీలకుడు ఒకరు మాట్లాడుతూ రెండు రోజులు సమావేశాలు నిర్వహించినా, ఎటువంటి పురోగతి లేదన్నారు. మండలాల వారీగా ఆశావాహుల జాబితాలను రూపొందించి అధిష్టానానికి పంపుతున్నట్లు తెలిపారు. ఈ వ్యవహారం ఇప్పట్లో తేలదని, మరో పది రోజుల సమయం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *