సకల విఘ్నాలను హరించువాడే విఘ్నేశ్వరుడు
నేడే వినాయక చవితి
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
ఏ కార్యక్రమం ప్రారంభించినా తొలి పూజ అందుకునే ఇలవేల్పు గణనాథుడు. సకల విఘ్నాలను తొలగించే దేవుడిగా సకల గణాలకు అధిపతిగా గణపతి పురాణకాలం నుంచి నుంచి పూజలందుకుంటున్నారు. గణేశుడికి పలు పేర్లు ఉన్నాయి. సకల విఘ్నాలను హరించువాడు విఘ్నేశ్వరుడు. వినాయకుడు అంటే విశిష్ట నాయకుడు అని అర్థం. గణేశుడు భక్తజన సంరక్షకుడు. తూర్పుదిక్కున హేరంబుడు, పడమర దిక్కున వక్రతుండుడు, దక్షిణం వైపున లంబోదరుడు, ఉత్తరం వైపున గణపతి, ఈశాన్యం వైపున ఈశానందుడు, ఆగ్నేయం వైపున అగ్నితేజసుడు, నైరుతి వైపున పార్వతీసుతుడు, వాయువ్య దిక్కున వరదుడు అనే నామాలతో భక్తులను సంరక్షిస్తుంటాడని భక్తుల నమ్మకం.
గణపతి ఆరాధన ద్వారా మంచి బుద్ధి కలిగి, మనిషి ప్రయాణం మోక్షం దిశగా సాగుతుంది. గణపతి అనుగ్రహం కూడా తోడైతే.. మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. అందుకే తెలివికి దేవుడిగా గణపతిని ఆరాధిస్తారు. కోరిన విద్యలకెల్ల గురువు అని స్వామిని పూజించడం పరిపాటి. అందుకే విద్యార్థులతో గణపతిని ఆరాధింపజేసే సత్సంప్రదాయం మనకు ఉంది. గణం అంటే గుంపు. సమూహాన్ని నడిపే పాలకుడు గణపతి. నాయకత్వ లక్షణాలకూ ఆయనే అధినాథుడు. కోరినవి సిద్ధింపజేయడంతో వరసిద్ధి వినాయకుడు అనే పేరు పొందాడు. దుఃఖం, అజ్ఞానం, దారిద్య్రం వంటి బాధలు ప్రగతికి అడ్డంకులు. వాటినే విఘ్నాలు అంటారు. అలాంటి విఘ్నాలను పోగొట్టి విజయాలు ప్రసాదించే దైవం విఘ్నేశ్వరుడు. ప్రతీ ఏడాది భాద్రపద మాసంలో వినాయక చవితి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. హిందువులు జరుపుకునే పండుగల్లో వినాయక చవితి ఒకటి. ప్రతీ ఏటా వినాయక చవితిని 3 నుంచి 11 రోజుల వరకు జరుపుకుంటారు. వినాయక చవితి ఎప్పుడూ బాధ్రపద మాసం అంటే ఆగస్ట్..సెప్టెంబర్ నెల్లల్లోనే వస్తుంది. వినాయక చవితిని భాద్రపద మాసంలో వచ్చే మొదటి చవితి రోజు జరుపుకుంటారు. పసుపు ముద్దని చేసి వినాయకుని ప్రతిమని ప్రతిష్టించిన చోటే ఉంచి పూజిస్తారు. వినాయక చవితి హిందువులకు తొలి పండుగ. భాద్రపద శుద్ధ చవితి రోజునే గణనాథుడు పుట్టాడని కొందరు, గణాధిపత్యం వచ్చిందని కొన్ని పౌరాణిక గాథలు ప్రచారంలో ఉన్నాయి. గణేశుడి ఆవిర్భావ గాథలు పురాణాలలో రకరకాలుగా చెప్పబడ్డాయి. శివపురాణం ప్రకారం ఒకసారి పార్వతీదేవి స్నానం చేయడానికి శరీరానికి నలుగుపిండిని రాసుకుంది. మిగిలిన నలుగుపిండితో ఒక బొమ్మను తయారుచేసి ప్రాణం పోసింది. అతడిని ద్వారం దగ్గర కాపలాగా పెట్టింది. శివుడు వచ్చి లోపలికి వెళ్లబోతుండగా కాపలా ఉన్న బాలుడు అడ్డుకున్నాడు. ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది. ఆగ్రహంతో శివుడు ఆ బాలుడి తలను త్రిశూలంతో నరికివేశాడు. తల తెగి పడివున్న బాలుడిని చూసి పార్వతీదేవి ఏడ్చేసింది. ఆమె రోదనను చూడలేక శివుడు ఒక ఏనుగు తలను తెచ్చి అతికించి ప్రాణం పోశాడు. అతనికి గజాననుడు అని పేరు పెట్టాడు. తన కారణంగా ఆ బాలుడు వికారరూపాన్ని పొందాడని గజాననుడు తొలిపూజ అందుకోనున్నట్లు వరం ఇచ్చేశాడు. మట్టి గణపతిని ఎందుకు పూజించాలనే విషయాన్ని ముద్గలపురాణం స్పష్టంగా చెబుతుంది. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు ఏర్పడ్డాయి. నీటి నుంచి భూమి ఏర్పడింది. మనం మట్టితో చేసే గణపతి విగ్రహం పంచమహాభూతాల సమాహారం. ఆ మట్టి ప్రతిమను పూజించటం ద్వారా పంచభూతాలను, వాటి అధిష్ఠాన దేవతలను పూజిస్తున్నాం అన్నమాట. ఎన్నో విధాలుగా కనిపించినా పరమాత్మ ఒక్కడే అనే సందేశం మట్టి గణపతి ఆరాధనలో వ్యక్తమవుతుంది. బలం, జ్ఞానం, ఐశ్వర్యం, ఆనందం- ఈ నాలుగింటి పరిపూర్ణ, దివ్య తత్త్వమే గణపతి స్వరూపం. బలవంతుల్లో అధికుడు, బలానికి అధిదేవత హేరంబుడు అని పార్వతికి శివుడు చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి. బలానికి ఏనుగు ప్రతీక అని చెప్పడం శాస్త్రాల్లో సర్వ సాధారణం. పదివేల ఏనుగుల బలం కలవాడు, మహా బలశాలి అని లంబోదరుడ్ని కొలుస్తారు. గజవదనుడైన గణపతి బలానికి సంకేత రూపం. ఇంకొక కోణంలో, ఏనుగు ఐశ్వర్యానికి సూచన. గణపతిని సంపదలకు దేవతగా, ప్రదాతగా భావిస్తారు. శివపార్వతుల తనయుడిగానే కాకుండా, శివశక్తుల ఏకరూపమైన పరబ్రహ్మగా గణపతిని ఆరాధించే ఉపాసనా సంప్రదాయాలు ఎన్నో ఉన్నాయి. చవితి పూజలో 21 రకాల ఆకులు వాడుతాం. నవరాత్రుల పూజల తర్వాత ప్రతిమను, పత్రిని నిమజ్జనం చేయడం సంప్రదాయం. పత్రిలో ఉపయోగించే ఆకులన్నీ ఔషధ గుణాలన్నవే. వానలు కురిసే ఈ సమయంలో చెరువులు కలుషితం అవుతాయి. నీటిని శుద్ధి చేయడానికి ఈ 21 రకాలు పత్రి సరైన మార్గమని చెప్తున్నారు ఆధ్యాత్మిక వేత్తలు. ఆ ఆకులన్నీ నీటిలో కలిసినప్పుడు..అందులో ఉన్న బ్యాక్టీరియా అంతా చనిపోయి..నీళ్లు క్లీన్ అవుతాయని అంటున్నారు. పూజ, వ్రతం, నోము ఏది చేసినా ముందుగా గణపతిని పూజించాలనేది సంప్రదాయం. చవితి వ్రతంలో స్వామివారి విగ్రహాన్ని వరసిద్ధి వినాయకుడు అని పిలుస్తాం. ముందుగా పసుపుతో గణపతిని చేసి తర్వాత స్వామివారిని ఆహ్వానించి వత్రం చేస్తారు. ఇక గరిక లేని గణపతి పూజ వ్యర్థమని శాస్త్రాలు చెబుతున్నాయి. చవితి రోజు వినాయకుడికి అర్పించే గరికకు చాలా ప్రత్యేకత ఉంది. పూర్వం అనలాసురుడు అనే రాక్షసుడు విపరీతమైన వేడిని పుట్టించి..దేవతల్ని ఇబ్బంది పెట్టాడట. అప్పుడు ఎంత ప్రయత్నించిన గణపతికి వేడి తగ్గకపోవడంతో 21 గరిక పోచలను తలపై పెట్టాలని రుషులు సూచించారట. ఆ వెంటనే వినాయకుడి శరీరంలో వేడి తగ్గిందట. అందుకే గణపతి పూజలో గరికకు ప్రాధాన్యం వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. ఇక స్వామివారికి నైవేద్యంగా సమర్పించే కుడుముల్లోనూ ఆరోగ్య సూత్రం ఉంది. వర్షాకాలంలోనే వినాయక చవితి వస్తుంది. రెయిన్ సీజన్‌లో ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ఈ సమయంలో జీర్ణవ్యవస్థ కాస్త వీక్‌గా ఉంటుంది. అందుకే ఆవిరిపైన వండిన ఆహారాలు ప్రసాదంగా తీసుకుంటే జీర్ణవ్యస్థ ఆరోగ్యంగా ఉంటుందని చెప్తున్నారు ఆధ్యాత్మిక వేత్తలు. అందుకే వినాయకునికి కుడుములు అంటే చాలా ఇష్టమంటున్నారు. మన సంప్రదాయంలో ప్రతీ ఏటా మూడు నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటాం. మొదటివి చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులు. రెండోవి భాద్రపదంలో గణపతి నవరాత్రులు, మూడోవి ఆశ్వయుజంలో శరన్నవరాత్రులు. అందులో వినాయక నవరాత్రులు అయితే ఊరువాడా వైభవంగా జరుగుతాయి. గణపతి ఆరాధన భక్తుల ఎమోషన్‌తో కూడుకున్న అంశం. విఘ్నేశ్వరుడంటే విఘ్నాలకు అధిపతి అని అర్థం. విఘ్నాలు తొలగాలన్నా, దృష్టి దోషాలు పోవాలన్నా, పనులు విజయవంతంగా పూర్తి కావాలన్నా, విద్య, బుద్ధి, సిద్ధి, మోక్ష ప్రాప్తి కలగాలన్నా, వినాయకుడి ఆరాధన తప్పకుండా చేయాలని పురాణాలు చెబుతున్నాయి.

