24, ఆగస్టు 2025, ఆదివారం

రాసలీల మంత్రిపై నివేదిక కోరిన చంద్రబాబు !

పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్న సుధాకర్ రెడ్డి వ్యాఖ్యలు 

ఎథిక్స్ కమిటీ, క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశం 

మొదటి కేసుగా రాసలీలల మంత్రిపై విచారణ

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ

తిరుపతికి తరచుగా వచ్చే ఒక మంత్రి ఫైవ్ స్టార్, సెవెన్ స్టార్ హోటళ్లలో దిగుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలను పట్టించుకోకుండా మహిళలతో రాసలీలలు సాగిస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్ బి సుధాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ విషయమై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం సుదీర్ఘంగా పార్టీ నేతలతో చర్చించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎథిక్స్ కమిటీ, క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మొదటి కేసుగా రాసలీల మంత్రికి సంబంధించిన వ్యవహారంపై దృష్టిని సారించాలని కోరారు. ఇదే విషయాన్ని ఆదివారం తిరుపతికి వచ్చిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ కూడా స్పష్టం చేశారు. 

రాష్ట్రంలో సంచలనంగా మారిన ఒక మంత్రి రాసలీల వ్యవహారంపై  ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు నివేదిక కోరినట్టు తెలిసింది. టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి శుక్రవారం రెండు టిటిడి అనుకూల ఛానళ్లలో మాట్లాడుతూ అవినీతి ఎమ్మెల్యేలపై ధ్వజం ఎత్తారు. ఇదే విషయం ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రధాన సంచికలో వలసనేతలతో పార్టీకి నష్టం అనే శీర్షిక వార్త ప్రతినితమైంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్బి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ  ఒక మంత్రి తిరుపతిలోని స్టార్ హోటళ్లలో రాసలీలలు సాగిస్తున్నారని ఆరోపించారు. దీనిపై వైసిపి జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి మీడియా సమావేశంలో ఆ మంత్రి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. ఒక మహిళా కార్పొరేటర్ కు పెద్ద పదవి ఆశపెట్టి తన వెంట తిప్పుకుంటున్నారని ఆరోపించారు. దీనితో వైసిపి అనుకూల చానళ్లు, సోషల్ మీడియా రకరకాల కథలు అల్లి సమస్యను వైరల్ చేశాయి. సదరు మంత్రి హైదరాబాదులో గానా బజానా నిర్వహిస్తూ, సెటిల్ మెంట్లు చేస్తుంటారని గతంలో టిడిపి అనుకూల మీడియాలో కథనాలు వచ్చాయి. ఆయనను డార్లింగ్ మంత్రి అంటూ  పిలుస్తుంటారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపధ్యంలో శనివారం  టిడిపి స్ట్రాటజీ కమిటీలో దీనిపై సుదీర్ఘ చర్చజరిగింది. సుధాకర్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఒకరిద్దరు చంద్రబాబుకు సూచించారు. అయితే మెజారిటీ సభ్యులు ఆయన అన్నదానిలో తప్పు లేదని, ఆయన ఎక్కడా పేరు చెప్పకుండా జాగ్రత్ పడ్డారని అన్నట్టు తెలిసింది. అయితే సాయంత్రానికి ఛానళ్లలో వచ్చిన అంశాలు పరిశీలించి నివేదిక ఇవ్వాలని చంద్రబాబు కోరారు. రాత్రి కీలక నేతలతో జరిపిన సమావేశం చంద్రబాబు ఎథిక్స్ కమిటీ, క్రమ శిక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అవినీతి అక్రమాలకు పాల్పడిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఎథిక్స్ కమిటీ విచారణ చేయాలని సూచించారు. తప్పు చేసిన వారి వ్యవహారంలో క్రమ శిక్షణ కమిటీ తగిన చర్యలు తీసుకుంటుంది. మొదటి కేసుగా రాసలీలల మంత్రి వ్యవహారంలో నివేదిక ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు. సోమవారం రెండు కమిటీల నిర్మాణం పూర్తి చేసి విచారణ చేపడతారు. తొలి సాక్ష్యంగా సుధాకర్ రెడ్డిని విచారిస్తారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

*టీడీపీ క్రమశిక్షణా కమిటీ చర్యలు: మంత్రి రాంప్రసాద్ రెడ్డి*

 టీడీపీ పార్టీ అనేది కోటి ఇరవై లక్షల మంది కార్యకర్తలతో ఉన్నదని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గుర్తు చేశారు. ఎవరో ఒకరు పార్టీ లైన్ దాటి మాట్లాడినంత మాత్రాన పెద్ద సమస్యేమీ కాదని ఆయన ఆదివారం తిరుపతిలో వ్యాఖ్యానించారు. మంత్రి ఈ విషయమై మాట్లాడుతూ పార్టీ లైన్‌కు విరుద్ధంగా వ్యవహరించే వారిపై క్రమశిక్షణా తగిన కమిటీ చర్యలు తీసుకుంటుందని,  వారిని పిలిచి వివరణ తీసుకుంటుందన్నారు. ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం క్రమంగా అమలు చేస్తోందని, దీంతో వైసీపీ నాయకులకు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారన్నారు. అందుకే తమపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *