13, సెప్టెంబర్ 2024, శుక్రవారం

వైసిపి జిల్లా అధ్యక్షుడిగా పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి

రాష్ట్ర అధికార ప్రతినిధిగా  రోజా 
నగరిలో అసమ్మతి మీద వేటు 
పలమనేరులో కార్యకర్తలతో గౌడ్ సమావేశం
జిల్లాలో ఊపందుకోనున్న  వైసిపి కార్యక్రమాలు 

ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.

చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు రాజాకీయ పోరుకు సిద్దం అవుతున్నారు. చంద్రబాబు సొంత జిల్లాలో టిడిపిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని ఉమ్మడి  జిల్లా అధ్యక్ష పగ్గాలు చేపట్టాలని జగన్ ఆదేశించారు. ఫైర్ బ్రాండ్ రోజాను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు. పెద్దిరెడ్డి ఆధ్యర్యంలో జిల్లాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందోళన కార్యక్రమాలు ఊపందుకోనున్నాయి. ఇప్పటికే జిల్లాలో మాజీ మంత్రి రోజా క్రియాశీలకం అయ్యారు. నగరి నియజకవర్గానికి చెందిన రోజా వ్యతిరేకులు  వైసిపి రాష్ట్ర ట్రేడ్ యూనియన్ కార్యదర్శి కె జె కుమార్, రాష్ట్ర ఈడిగ కార్పోరేషన్ మాజీ చైర్ పర్సన్ కె జె శాంతిని పార్టీ నుంచి బహిష్కరించారు. పలమనేరులో మాజీ ఎం ఎల్ ఏ వెంకటే గౌడ శుక్రవారం కార్యకర్తలతో సమావేశమయ్యారు. జిల్లాలో పార్టీని పటిష్టం చేయడానికి జోరుగా అందోళన కార్యక్రమాలను చేపట్టనున్నారు.


 పార్టీ అధినేత జగన్ ఈ మేరకు విజవాడలో జిల్లా నేతలకు మార్గ నిర్దేశనం చేశారు. ఇక నుంచి ఉమ్మడి జిల్లాల కమిటీలను ఏర్పాటు చేసి పార్టీని పటిష్ఠ పరచడానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మొదట ఉమ్మడి చిత్తూరు జిల్లా నేతలతో జగన్ తన క్యాంపు కార్యాలయంలో సమావేశం అయ్యారు. మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఎంపి మిథున్ రెడ్డి, ఎమ్మెల్సీలు డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, భరత్, మాజీ ఉప ముఖ్య మంత్రి కె  నారాయణ స్వామి, మాజీ మంత్రి ఆర్ కె రోజా, మాజీ ఎంపి రెడ్డప్ప, మాజీ ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు పాల్గొన్నారు. సిఎం చంద్రబాబు నాయుడు స్వంత జిల్లా అయిన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని నియమిస్తామని జగన్ చెప్పారు. విద్యార్థి దశ నుంచి చంద్రబాబును ఎదుర్కొంటున్న పెద్దిరెడ్డి నాయకత్వంలో అందరూ కలసి కట్టుగా పోరాటం చేయాలని జగన్ మార్గ నిర్దేశనం చేశారు. అడుగడుగునా కూటమి ఎమ్మెల్యేలు, ఇతర నాయకుల అక్రమాలు, అవినీతిని ఎండగట్టాలని సూచించారు. ఇప్పటికే కొందరు ఇసుక, గ్రానైట్, ఎర్ర చందనం అక్రమ రవాణాకు తెరతీసారని తెలిపారు. అలాంటి వాటిని వెలికి తీసి బహిర్గతం చేయాలని సూచించారు. అలాగే మండల స్థాయి నుంచి ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని కోరారు. పార్టీలో క్రమశిక్షణ పాటించని వారిని సహించేది లేదని తేల్చి చెప్పారు. ఆయన ఆదేశాలతో శుక్రవారం వైసిపి రాష్ట్ర ట్రేడ్ యూనియన్ కార్యదర్శి కె జె కుమార్, రాష్ట్ర ఈడిగ కార్పోరేషన్ మాజీ చైర్ పర్సన్ కె జె శాంతిని జిల్లా అధ్యక్షుడు కె జె భరత్ పార్టీ నుంచి బహిష్కరించారు. నగరికి చెందిన వారు గత ఎన్నికల్లో అక్కడి వైసిపి అభ్యర్థి ఆర్ కె రోజాకు వ్యతిరేకంగా పనిచేశారు. తొలి నుంచి రోజాకు వ్యతిరేకంగా ఉన్నారు. కాగా శుక్రవారం పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ్ తన కార్యాలయంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు.  కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పార్టీ పటిష్టత కోసం తీసుకోవాల్సిన చర్యలను గూర్చి చర్చించారు. మిగిలిన నియోజక వర్గాలలో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయడానికి సిద్ధం అవుతున్నారు. 1983 లో తొలి సారి టిడిపి రాష్ట్రంలో అధికారం చేపట్టింది. అయితే అప్పటిలో డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టి రాష్ట్రంలో పోరాటం చేయడం వల్ల 1989 లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ దశలో ఎం వి మైసూరా రెడ్డి నేతృత్వంలో రాయలసీమ ఉద్యమం జరిగింది. జిల్లాలో మాజీ ప్రభుత్వ సలహాదారు ఎం జ్ఞానేంద్ర రెడ్డి సారథ్యం వహించారు. కాబట్టి అదే స్ఫూర్తితో ఇప్పుడు ఉద్యమాలు చేపట్టాలని జగన్ కృత నిశ్చయంతో ఉన్నారని తెలిసింది. కూటమి ప్రభుత్వంలో జిల్లా నుంచి మంత్రి లేరు. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి లాంటి ఉద్దండ నేతలను ఎదుర్కునే నేతలు లేరు. ఈ నేపథ్యంలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నాటికే పార్టీని తిరుగులేని శక్తిగా నిర్మాణం చేయాలని జగన్ మార్గ నిర్దేశనం చేశారని తెలిసింది. పెద్దిరెడ్డి నేతృత్వంలో ఉమ్మడి జిల్లాలో అందరు వైసిపి నాయకులు క్రియాశీలకం కానున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, టిడిపి ప్రజాప్రతినిధుల అవినీతి, అక్రమాల మీద జోరుగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *