సిపిఓ కార్యాలయం పనితీరుపై చిత్తూరు ఎంపీ ఆగ్రహం
మామిడి రైతులను ఆదుకోవాలి
మొగిలి ఘాట్లో ప్రమాదాలు నివారించాలి
హౌసింగ్ కాలనీలో వసతులు పెంచాలి
జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశంలోఎం ఎల్ ఏ లు
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయ సిబ్బంది పనితీరు పట్ల చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గమల్ల ప్రసాదరావు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. శుక్రవారం చిత్తూరు ఎంపి అధ్యక్షతన జిల్లా అభివృద్ధి, సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పధకాల అమలుపై సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా చిత్తూరు పార్లమెంటు సభ్యుడు దగ్గుమల్ల ప్రసాదరావు మాట్లాడుతూ జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయ సిబ్బందిపైన తీవ్ర ఆరోపణలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యాలయ సిబ్బందిని అదుపు చేయాల్సిందిగా జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి నాగేశ్వరరావు ఆదేశించారు. మీరు చేయకుంటే నేనే సెట్ రైట్ చేస్తానని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరోసారి సిపిఓ కార్యాలయ సిబ్బంది మీద ఫిర్యాదులు తన వరకు రాకూడదని ఎంపీ స్పష్టం చేశారు. మొగలి ఘాట్ రోడ్డులో జరుగుతున్న ప్రమాదాల పట్ల పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. గంగాధర నెల్లూరు శాసనసభ్యులు ఏం వి థామస్ మాట్లాడుతూ మామిడి రైతులను ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. గత సంవత్సరం మామిడి రైతుల పూర్తిగా నష్టపోయారని, వారికి రావలసిన బిల్లులు ఇం తవరకు అందలేదన్నారు. జిల్లా యంత్రాంగం మామిడి రైతుల పట్ల శ్రద్ధ పెట్టాలని కోరారు. చిత్తూరు శాసనసభ్యుడు గురజాల జగన్మోహన్ నాయుడు మాట్లాడుతూ హౌసింగ్ కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు శ్రద్ధ చూపాలన్నారు.
చిత్తూరు ఎంపి దగ్గుమళ్ళ ప్రసాద్ రావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలను క్షేత్ర స్థాయిలో పకడ్భందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో జిల్లాలో చేపడుతున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల పై ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షించడం జరుగుతుందన్నారు. ప్రతి ప్రభుత్వ శాఖలో కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా చేపడుతున్న దాదాపు 40 రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, వాటికి చేసిన ఖర్చు వివరాలను సమీక్షిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గానికి కేటాయించిన నిధులను మండలాలకు, గ్రామాల అభివృద్ధికి వినియోగించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి అందిన నిధులను కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలని చిత్తూరు ఎంపి అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా అభివృద్ధిలో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే సి సి రోడ్డు లు, మురుగు నీటి కాలువల నిర్మాణం, తదితర అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయం తో పని చేసి జిల్లాను ప్రగతి పథంలో నడిచేలా భాద్యతతో పని చేయాలన్నారు. వ్యవసాయ శాఖకు సంబంధించి క్రాప్ ఇన్షూరెన్స్ ఎప్పటికప్పుడు చెల్లింపులు చేసేలా ప్రభుత్వానికి నివేదించాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా అన్ని ఆసుపత్రులు, సి హెచ్ సి లు, పి హెచ్ సి లలో వైద్యుల కొరత, వైద్య పరికరాలు లేకపోవడం, నూతన భవనాల నిర్మాణం, ఈ సమస్యలు అన్నింటి పై జిల్లాకు చెందిన ఎంఎల్ఏ లతో కలసి ఆరోగ్య శాఖ మంత్రికి నివేదించడం జరుగుతుందని, ఇందుకు అవసరమైన నివేదికలను సిద్ధం చేయుటలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు భాద్యత తీసుకోవాలన్నారు. ప్రస్తుతం పరిస్థితుల్లో సమస్యలు అధికంగా ఉన్నాయని, నిధులు మంజూరు చేయించుకోవడం ద్వారా కొంత వరకు సమస్యలను పరిష్కరించేందుకు అవకాశం ఉందని, ఆ దిశగా శాసన సభ్యులతో కలసి సమన్వయంతో పని చేస్తామన్నారు. ఎంపి ల్యాడ్స్ కింద మంజూరయ్యే పనులను నిర్ణీత గడువు లోపు పూర్తి చేసే అంశం పై అధికారులు దృష్టి పెట్టాలన్నారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో దిశ జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షక కమిటీ సమావేశం నిర్వహించడం జరుగుతున్నదని, కేంద్ర ప్రభుత్వం పథకాలు వాటి అమలు తీరు సమీక్ష ఈ సమావేశం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. నేషనల్ హెల్త్ మిషన్ లో భాగంగా టిబి మిషన్, హెచ్ ఐ వి ఎయిడ్స్ నివారణ మిషన్ లకు కేంద్ర ప్రభుత్వ నిధులను సమర్థవంతంగా వినియోగించాలన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి 14వ మరియు 15వ ఆర్థిక సంఘం నిధులను వినియోగించాలని, గ్రామాలలో పారిశుద్ధ్యం, రోడ్లు, వీధి లైట్ లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన జరగాలన్నారు. వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్థక, ఎన్ ఆర్ ఈ జి ఎస్, జల్ జీవన మిషన్, విద్యా శాఖ, హౌసింగ్ శాఖ సంబంధిత శాఖల ద్వారా అమలవుతున్న పథకాలలో కేంద్ర ప్రభుత్వం ద్వారా జిల్లాలో అమలవుతున్న పథకాల తీరు తెన్నులు వాటి పురోగతిని ఎంపి, శాసన సభ్యులకు కలెక్టర్ వివరించారు. ఉద్యాన శాఖ సంబంధించి అర్హులైన రైతులందరికీ బిందు, తుంపర్ల సేద్యం పరికరాలను అందించడం పై ప్రత్యేక శ్రద్ధతో ఉద్యాన శాఖ ద్వారా జిల్లా యంత్రాంగం కృషి చేస్తున్నదని, పరికరాలను పంపిణీ చేయడం జరుగుతున్నదని తెలిపారు. జిల్లాలో పాల ఉత్పత్తిని పెంచుటలో భాగంగా పాడి రైతులకు ఎన్ ఆర్ ఈ జి ఎస్ ద్వారా గోకులం షెడ్ ల నిర్మాణం చేపట్టడం జరుగుతున్నదని, జిల్లాకు కేటాయించిన షెడ్ ల కంటే ఎక్కువ మంది రైతులు షెడ్ ల నిర్మాణానికి అభ్యర్థించడం జరుగుతున్నదని, ఇందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ కు సంబంధించి కుప్పం నియోజకవర్గంలో కంటి సమస్యలు ఉన్న వారిని గుర్తించి ఆపరేషన్ చేయదలచిన వారికి ఉచితంగా ఆపరేషన్ చేయించుటకు, అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాల పంపిణీ చేయడం జరిగిందని, జిల్లాలోని పి హెచ్ సి లు, సి హెచ్ సి లలో వైద్య పరికరాలు ఉన్నప్పటికీ తగినంత సిబ్బంది లేరని, వైద్య ఆరోగ్య శాఖలో భవనాలు, సిబ్బంది కొరత కొంత మేర ఉందని, ఇందుకు చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తామన్నారు. మొగిలి ఘాట్ నందు ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన చర్యల పై నేషనల్ హైవే అధికారులకు నివేదిక ఇవ్వడం జరిగిందని నిర్ణీత గడువు లోపు చర్యలు చేపట్టేలా కృషి చేస్తున్నామన్నారు.
చిత్తూరు శాసన సభ్యులు మాట్లాడుతూ పాడి రైతుల అభివృద్ధికి అవసరమైన మేర షెడ్ ల మంజూరు చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. టిడ్కొ గృహ సముదాయాలు, హౌసింగ్ కాలనీ నందు మౌలిక సదుపాయాల కల్పన పై అధికారులు శ్రద్ధ పెట్టాలని కోరారు. ప్రతి పాఠశాలను ప్రజా ప్రతినిధులు, అధికారులు సందర్శించిన సమయంలో మధ్యాహ్న భోజనం నాణ్యతను తనిఖీ చేయాలన్నారు. జి.డి నెల్లూరు శాసన సభ్యులు మాట్లాడుతూ రానున్న సీజన్ లో మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని కోరారు. వచ్చే సేజన్ కు కిలోకు 30 రూపాయలు చెల్లించేలా చర్యలు చేపట్టాలన్నారు. గతంలో రైతులు తోలిన కాయలకు ఎమ్క బిల్లులు రాలేదని, వాటిని ఇచ్చే విధంగా చూడాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి జి.డి నెల్లూరు నియోజకవర్గంలో ఉన్న సమస్యల పై చర్చించారు. విద్యా శాఖకు సంబంధించి పాఠశాలల స్థితిగతులు, సంబంధిత అంశాల పై ప్రజా ప్రతినిధుల దృష్టికి వచ్చిన అంశాలను పరిష్కరించుటలో డి ఈ ఓ చొరవ చూపాలన్నారు. పూతలపట్టు శాసన సభ్యులు మాట్లాడుతూ మొగిలి ఘాట్ లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా ఎన్ హెచ్ అధికారులు స్పందించక పోవడం భాదాకరం అన్నారు. ఈ నెల 13 న మొగిలి ఘాట్ లో జరిగిన ప్రమాదంలో ఎక్కువ మంది మరణించడం, గాయపడిన వారికి మానవతా ధృక్పథం తో ఎంతో మంది సాయం చేయగా ఎన్ హెచ్ అధికారులు మాత్రం సంఘటనా స్థలానికి కూడా రాకపోవడం వారి భాద్యతా రాహిత్యం అని అన్నారు. ఘాట్ లో ప్రమాదాల నివారణ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవలసిన అవసరం ఉందని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో జెడ్పి చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, చిత్తూరు నగర మేయర్ అముద, జెడ్పి సిఈఓ రవి కుమార్ నాయుడు, పిఆర్, ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ఈ లు శంకర్ నారాయణ, విజయ్ కుమార్, హౌసింగ్, డ్వామా పిడి లు పద్మనాభం,రవి, డిఈఓ దేవరాజు, జిల్లా సాంఘీక సంక్షేమ శాఖ అధికారి డా.రాజ్యలక్ష్మి, డిఎస్ఓ శంకరన్, సిపిఓ సాంబ శివారెడ్డి, జిల్లా వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు మురళీ కృష్ణ, మధుసూదన రెడ్డి, డిపిఓ లక్ష్మి, చిత్తూరు కమిషనర్ నరసింహ ప్రసాద్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, ఎంపిపి లు. తదితరులు పాల్గొన్నారు.
పో రై గంగ 1 జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షక కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న చిత్తూరు ఎంపి ప్రసాదరావు
గంగ 2 జిల్లా కలెక్టర్
గంగ 3 చిత్తూరు ఎం ఎల్ ఏ
గంగ 4 జీడి నెల్లూరు ఎం ఎల్ ఏ
గంగ 5 పూతలపట్టు ఎం ఎల్ ఏ