12, సెప్టెంబర్ 2024, గురువారం

జిల్లాలో ఆగిన సమగ్ర భూ సర్వే పధకం

31 శాతం మాత్రమే భూ సర్వే పూర్తి

మూడు మండలాల్లో ప్రారంభం కానీ సర్వే  

ప్రభుత్వం మారడంతో ఆగిన సర్వే 

ఇంకా నిర్ణయం తీసుకోని కూటమి ప్రభుత్వం

భూముల సర్వే కోసం రైతుల ఎదురుచూపులు  

ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.


 జిల్లాలోని భూములను సమగ్రంగా సర్వే చేసి, రాళ్లను నాటి, రైతులకు హక్కు పత్రాలను పంపిణీ చేయాలన్న సమగ్ర భూ సర్వే విధానం చిత్తూరు జిల్లాలో అనుకున్న లక్ష్యాలను సాధించలేదు. జిల్లాలో 50 శాతం భూములు కూడా సర్వే జరగలేదు. గత ఏడాది డిసెంబర్ నాటికీ జిల్లాలో భూముల సర్వే పూర్తి కావాలని భావించినా, ఇప్పటి వరకు 31 శాతం భూ సర్వే మాత్రమే పూర్తి అయ్యింది.  వరకు  ఈలోపు ప్రభుత్వం మారడంతో సమగ్ర భూ సర్వే పథకం అర్ధాంతరంగా ఆగిపోయింది. ఈ పథకం మళ్లీ ప్రారంభం అవుతుందో లేదో తెలియని అయోమయ పరిస్థితి రైతులలో నెలకొంది. 


చిత్తూరు జిల్లాలో 2020 డిసెంబర్ 21వ తేదీన ఈ సమగ్ర భూ సర్వే పథకం ప్రారంభమైంది. జిల్లాలో 31 మండలాలు ఉండగా 28 మండలాల్లో సమగ్ర భూ సర్వే పథకం ప్రారంభమైంది. రొంపిచర్ల, సోముల, చౌడేపల్లి మండలాల్లో మాత్రం ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. చిత్తూరు జిల్లాలో 822  గ్రామాల్లో ఉండగా ఇప్పటివరకు 329 గ్రామాలలో మాత్రమే సర్వే పూర్తయింది. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 13,02,229 ఎకరాల భూములు ఉన్నాయి. ఇందులో ఇప్పటివరకు 3,02,255 ఎకరాల భూములు మాత్రమే సర్వే జరిగింది. అంటే 31 శాతం పూర్తి అయ్యింది. సర్వే జరిగిన తర్వాత భూమిలో సరిహద్దులను నిర్ణయించడానికి 3,33,066 సర్వే రాళ్లను వివిధ గ్రానైట్ ఫ్యాక్టరీ లో నుంచి తెప్పించారు. 2023 డిసెంబర్ నాటికల్లా సమగ్ర భూ సర్వే విధానాన్ని పూర్తి చేయాలని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావించారు. వంద సంవత్సరాల తర్వాత జరుగుతున్న భూ సర్వే ను పకడ్బందీగా అత్యంత సాంకేతిక శాస్త్రీయ పద్ధతుల్లో చేపట్టాలని భావించారు. తద్వారా భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, భూముల విషయంలో రైతులు ధైర్యంగా ఉండవచ్చని భావించారు. ఒకరి భూమిని  మరొకరు అమ్ముకోవడం, అక్రమ రిజిస్ట్రేషన్ల బెడద ఉండదని ఊహించారు. .శాశ్వత భూ రక్ష పథకం కింద ఇప్పటికే జిల్లాలో అన్ని రెవెన్యూ రికార్డులను  డిజిటలైజేషన్ చేసింది. గ్రామాలలో సమగ్రంగా భూ సర్వేలను నిర్వహించి, సరిహద్దురాళ్లు నాటి భూ యజమానులకు భూమి హక్కు పత్రాలను గ్రామ సభ ద్వారా అందజేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికను రూపొందించారు. జిల్లాస్థాయిలో, మండల, పంచాయతీ స్థాయిలో సర్వేయర్ల నియామకం జరిగింది. ఈ విషయంలో వారికి శిక్షణ కూడా ఇచ్చారు. భూమిని సర్వే చేసి కొలతలు వేసి లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అంటే అక్షాంశాలు రేఖాంశాలు ఆధారంగా మార్కింగ్ చేయడమే కాకుండా ప్రతి ఒక్క కమతానికి ఒక నిర్దిష్టమైన యూనిట్ ఐడెంటిఫికేషన్ నెంబర్లు కూడా ఈ సర్వే ద్వారా ఇవ్వాలని నిర్ణయించారు. ప్రతి కమతానికి డిజిటల్ గా ఫిజికల్ గా  హద్దులు నిర్ణయించి క్యూఆర్ కోడ్ తో ల్యాండ్ మ్యాపింగ్ చేయాలని భావించారు. దీంతో తమ భూములు ఎవరైనా ఆక్రమించుకుంటారని భయం పూర్తిగా తొలగిపోతుందని, డూప్లికేట్ రిజిస్ట్రేషన్లు ఆగిపోతాయని, లంచాలకు అవకాశం లేకుండా పూర్తిగా ప్రయోజనం జరుగుతుందని ప్రభుత్వం భావించింది. కమతం ఒకే సర్వేనెంబర్ కింద ఉండి కార్యక్రమంలో విభజన జరిగినా, మారినా కూడా సర్వే రికార్డుల అప్డేట్ కాకపోవడం వల్ల వస్తున్న వివాదాలకు చెక్ పెట్టాలని నిర్ణయించింది. సర్వే చేయడమే కాకుండా ఆ భూములకు సంబంధించిన ఇతర సమస్యల పరిష్కారం యాజమాన్య పత్రాలు జారీ వంటి కార్యక్రమాలు  గతంలో ఎన్నడూ జరిగిన విధంగా చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇవి పూర్తయిన తర్వాత భూముల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు అన్ని సబ్ రిజిస్టర్ ఆఫీస్ సేవలను కూడా గ్రామ సచివాలయాల్లో తీసుకురావాలని భావించారు. ఒకసారి సర్వే చేసిన భూమికి ఏదైనా వివాదాల్లో ఉంటే అందుకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించి 30 రోజుల్లో వాటిని పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని భావించారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలనేది దీని ప్రధాన ఉద్దేశం కానీ, శాశ్వత సమస్య లను తెచ్చిపెడుతోంది. సమస్యలే కాదు, ఏకంగా గొడవలతో అన్నదమ్ములు, ఇరుగు పొరుగు వారితో బాహాబాహీకి దిగాల్సి వస్తుంది. తద్వారా ఒక కుటుంబంగా ఆయా గ్రామాల్లోని ప్రజలు ఇప్పుడు విరోధలుగా మారుతున్నారు. అయితే, దీనంతటికి కారణం..జగన్‌ సర్కార్‌ తెచ్చిన భూ సర్వే పథకమే కారణమని రైతులు అంటున్నారు. శాశ్వత భూ హక్కు..భూరక్ష పథకం రీ సర్వేలో తీవ్ర గందరగోళం నెలకొంది. 2020 డిసెంబరులో మొదలైన ఈ సర్వే తతంగం ఇప్పటికీ కొలిక్కి రాలేదు. ఆది నుంచే భూ సర్వే అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. సమగ్ర రీ సర్వే ద్వారా భూమికి సంబంధించిన డిజిటల్‌ రికార్డులను నిల్వ చేయడం పథకం ప్రధాన లక్ష్యం. అయితే క్షేత్రస్థాయిలో గ్రామ, వార్డుల్లో పట్టాదారుల వివరాలతో డిజిటల్‌ మ్యాప్‌లు చేసి తప్పులు లేకుండా సర్వే పూర్తి చేసిన తర్వాత సర్వే రాళ్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ, చాలా చోట్ల ఉన్నఫలంగా అధికారులు సర్వే రాళ్లను ఏర్పాటు చేయడం వివాదాస్పదమైంది. జగనన్న భూరక్ష పథకంలో కొన్ని చోట్ల  అధికారులు నిబంధనలకు పాతరేశారు. వారికి ఇష్టం వచ్చినట్టు సర్వే చేశారు. భూ యజమానికి సమాచారం ఇవ్వకుండానే, వారు లేకుండానే కొలతలు వేశారు. ఫలితంగా చాలా గ్రామాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. హక్కు పత్రాల్లో పెద్దఎత్తున తప్పులు దొర్లాయి. వీటిని చూసిన రైతులు లబోదిబోమంటున్నారు. తమకు తక్కువ భూవిస్తీర్ణంతో హక్కు పత్రం వచ్చిందని, పత్రంలో అన్ని తప్పులే ఉన్నాయని, రెండు సర్వే నంబర్లు ఉంటే ఒకే నంబరుతో భూ విస్తీర్ణం వచ్చిందని, నలుగురు, ఐదుగురికి కలిపి ఒకే ఎల్పీఎం నంబర్లు ఇచ్చారని, పేర్లు, చిత్రాలు తప్పుగా ఉన్నాయంటూ ప్రతి జిల్లా కేంద్రంలో ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. జరిగిన పొరబాట్లు పునరావృత్తం కాకుండా భూ సర్వే జరిగితే, రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది.

పో రై గంగ 1 సమగ్ర భూ సర్వే పధకం (ఫైల్) 



అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *