జిల్లాలో జోరుగా కర్ణాటక మద్యం అమ్మకాలు
కర్ణాటక మద్యం ధర తక్కువ, నాణ్యత ఎక్కువ
సిండికేట్ గా ఏర్పడి జిల్లాలో మద్యం అమ్మకాలు
నిత్యం పోలీసులు పట్టుకుంటున్నా ఖాతరు చేయని స్మగ్లర్లు
ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దుతో భారీగా దిగుమతి
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
చిత్తూరు జిల్లాలో కర్ణాటక మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. కర్ణాటక రాష్ట్రంలో మద్యం ధరలు తక్కువగా ఉండటంతో అక్కడి నుంచి చిత్తూరు జిల్లాలోకి మద్యం ప్రవహిస్తోంది. కొంతమంది సిండికేట్ గా ఏర్పడి కర్ణాటక నుంచి మద్యంను లారీలు, కార్లు, టాటా సుమోలు, టాటా ఏసీలు, ద్విచక్ర వాహనాలు మీద తెప్పిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను రద్దు చేయడంతో చిత్తూరు జిల్లాలో కర్ణాటక మద్యం అమ్మకాలు మరింత పెరిగాయి. జిల్లాలో రోజూ పోలీసులు ఎక్కడ ఒక చోట కర్ణాటక మద్యంను పట్టుకుంటున్నారు. అయినా మద్యం వ్యాపారస్తులు లెక్కచేయకుండా జోరుగా అక్రమ మద్యం వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.
మన రాష్ట్రంతో పోల్చుకుంటే కర్ణాటక రాష్ట్రంలో మద్యం ధరలు తక్కువ, నాణ్యత ఎక్కువ. కావున ఎక్కువమంది కర్ణాటక మద్యం కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇదే అదునగా జిల్లాకు చెందిన అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. గత ప్రభుత్వంలో ఒక పార్టీకి చెందిన నాయకులు అక్రమ మద్యం వ్యాపారంలో చురుగ్గా పాల్గొనగా, ప్రస్తుతం మరో పార్టీకి చెందిన నాయకులు కూడా కీలక పాత్ర వహిస్తున్నారు. కర్ణాటక నుంచి భారీ ఎత్తున చిత్తూరు జిల్లాకు మద్యం సరఫరా అవుతుంది. నిత్యం లారీల కొద్దీ మద్యం వస్తుందని సమాచారం. కర్ణాటక రాష్ట్రంలో 70 రూపాయలు ఉన్న క్వార్టర్ బాటిల్ చిత్తూరు జిల్లాలో 130 నుంచి 150 రూపాయలు పలుకుతుంది. అంత మొత్తం పెట్టినా, కర్ణాటక మద్యంతో పోల్చుకుంటే నాణ్యత తక్కువ. ఇక 90 ప్యాకెట్స్ కూడా దొరుకుతున్నాయి. ఇది 35 రూపాయలకే కర్ణాటకలో లభిస్తాయి. చిత్తూరు జిల్లాలో 90 లభించదు. కావున కర్ణాటక రాష్ట్రం నుంచి చిత్తూరు జిల్లాలోకి ఆక్రమంగా మద్యం రవాణా విస్తృతంగా జరుగుతోంది. సరిహద్దు మండలాలైన కుప్పం, వి కోట, గుడిపల్లి, శాంతిపురం, పలమనేరు, గంగవరం, పెద్దపంజాణి, పుంగనూరు, రామసముద్రం మండలాల్లో జోరుగా కర్ణాటక మద్యం మిక్రయాలు సాగుతున్నాయి. అదేవిధంగా తమిళనాడు సరిహద్దులో ఉన్న యాదమరి, బంగారుపాలెం, గుడిపాల, ఎస్ఆర్ పురం, కార్వేటి నగర్, పాలసముద్రం ఈ మండలాల్లో కూడా జోరుగా కర్ణాటక మద్యం వ్యాపారం జరుగుతోంది. తమిళనాడు రాష్ట్రంలో పోల్చుకుంటే కూడా కర్ణాటక రాష్ట్రంలో మద్యం ధరలు తక్కువ. కావున ప్రజలు తమిళనాడు మద్యం జోలికి పెద్దగా వెళ్లడం లేదు. కర్ణాటక మద్యానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఫలితంగా ఒక్కొక్క మండలాన్ని ఒక్కొక్క నాయకుడు జాగీరుగా మార్చుకొని కర్ణాటక మద్యం వ్యాపారం కొనసాగిస్తున్నారు. పోలీసుల కళ్ళు కప్పి, చెక్ పోస్టుల్లో లంచాలు ఇచ్చి, చిత్తూరు జిల్లాలోకి భారీగా కర్ణాటక మద్యం ప్రవహిస్తోంది. జిల్లాలో నిత్యం అరెస్టులు జరుగుతున్న, కర్ణాటక మధ్యాన్ని, వాహనాలను స్వాధీనం చేసుకుం టున్న, అక్రమ మద్యం వ్యాపారం మాత్రం ఆగడం లేదు. ఇందులో కొంతమంది బడా వ్యక్తులుగా ఉండటంతో పోలీసు విభాగానికి వారిని పట్టుకోవడం ఒక ఛాలెంజ్ గా మారింది. ఇటీవల కాలంలో ఒక వాహనంలో తరలిస్తున్నపది లక్షల విలువ చేసే కర్ణాటక మద్యం ప్యాకెట్లను గంగవరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. మద్యం స్మగ్లర్లు చాలా తెలివిగా వ్యవహారం చేస్తున్నట్లు తెలుస్తోంది. మద్యం లారీ వచ్చే ముందుగా ఒక ద్విచక్ర వాహనము, ఒక కారులో పైలెట్ గా వస్తాయి. వారు ఇచ్చే సూచనల మేరకు మద్యం చిత్తూరు జిల్లాకు చేరుకుంటుం.ది కర్ణాటక రాష్ట్రంలోని ముళబాగల్ తాలూకాలో 10 వరకు మద్యం దుకాణాలు ఉన్నట్లు సమాచారం. ఇది మన రాష్ట్రానికి సరిహద్దుల్లో ఉంది. కావున అక్కడి నుండి భారీగా చిత్తూరు జిల్లాలోకి మద్యం సరఫరా అవుతున్నట్లు సమాచారం. అక్కడ కొంతమంది మద్యంను స్థానిక దుకాణాల నుంచి కొనుగోలు చేసి, వాటిని వివిధ రకాల వాహనాలు ద్వారా చిత్తూరు జిల్లాలోకి పంపుతున్నారు. ఇటీవల పెద్దపంజాని పోలీసులు కూడా కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం ప్యాకెట్లు తీసుకుని వస్తున్న ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. ఇలా ప్రతినిత్యం జిల్లాలో ఎక్కడో ఒకచోట కర్ణాటక మద్యంను చిత్తూరు పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. అయినా మద్యం వ్యాపారం బాగా లాభసాటిగా ఉండటంతో మద్యం వ్యాపారస్తులు ఎనక్కి తగ్గడం లేదు. మద్యం జిల్లాలోకి వచ్చిన గంటలోపే లారీల్లోని లోడ్డు మొత్తం అన్లోడ్ అవుతుందని సమాచారం. పలువురు మధ్యవర్తుల ద్వారా వినియోగదారులకు చేరుతున్నాయి. చిత్తూరులో దినసరి కూలీలు ఎక్కువ నివసించే కాజూరు, ఇరువారం, తేనబండ, కట్టవంచి, మురకంబట్టు, గంగనపల్లి తదితర ప్రాంతాలలో ఈ మధ్య వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు సమాచారం. ఒక్కొక మధ్యవర్తి ఒక్కొక్క బాటల్ మీద పది రూపాయలు లాభంతో మరో మధ్యవర్తికి అమ్ముతున్నట్లు సమాచారం. ఆ మధ్యవర్తి మరో పది రూపాయల లాభంతో వినియోగదారులకు అందజేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది లాభ సాటి వ్యాపారం కావడంతో పోలీసులు ఎన్ని కేసులు నమోదు చేసినా, ఎందరిని అరెస్టు చేసినా, వాహనాలను స్వాధీనం చేసుకున్న జిల్లాల్లోకి కర్ణాటక మద్యం సరఫరా ఆగడం లేదు. స్మగ్లర్లు ఎనక్కి తగ్గడం లేదు. ఇందుకు సంబంధించి కీలకమైన వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకుంటే తప్ప జిల్లాలోకి కర్నాట మద్యం సరఫరా ఆగే పరిస్థితి కనిపించడం లేదు.