ఎదుగూబొదుగూ లేని చిత్తూరు రైల్వే స్టేషన్
రూ. 100 కోట్లతో పాత భవనాలు కొట్టి, కొత్త భవనాలు
అదనపు ప్లాట్ ఫారం, డబుల్ లైన్ కోసం ఎదురుచూపులు
చిత్తూరులో ఆగని ఆరు ఎక్ష్ప్రెస్స్ రైళ్ళు
మరో ఫుట్ ఓవర్ బ్రిడ్జి కోసం వినతులు
ప్రయాణానికి బస్సుల మీద ఆధారపడుతున్న ప్రజలు
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
చిత్తూరు రైల్వే స్టేషన్ దీర్ఘకాలికంగా అభివృద్ధికి నోచుకోక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న విధంగా ఉంది. చిత్తూరు జిల్లా నుంచి ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పాలించినా, పాలిస్తున్నా చిత్తూరు రైల్వే స్టేషన్ మాత్రం అభివృద్దికి ఆమడ దూరంలో ఉంది. జిల్లాలో ఎంపికైన పార్లమెంటు సభ్యులు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపకపోవడంతో ఎదుగూ బోదుగూ లేక కునారిల్లుతోంది. చిత్తూరు పేరుకు జిల్లా కేంద్రమైనా, అభివృద్ధిలో మాత్రం ముందడుగు పడటం లేదు. కర్ణాటక, తమిళనాడు సరిహద్దులను పంచుకుంటున్నా, అభివృద్ధి ఆశించిన స్థాయిలోజరగడం లేదు. చిత్తూరు రైల్వే స్టేషన్ లో ఏవో ముక్కుబడిగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవి స్టేషన్ స్థాయిని పెంచే విధంగా లేవు. స్టేషన్ అభివృద్ధికి, విస్తరణకు, రైళ్ల సంఖ్యను పెంచడానికి ప్రయత్నాలు మాత్రం జరగడం లేదు. చిత్తూరు ప్రజల దృష్టిలో చిత్తూరు రైల్వే స్టేషన్ ఉన్నా, లేనట్లే. దూర ప్రాంతాలకు, తిరుపతి, వేలూరు వెళ్లే ప్రయాణికులు బస్సుల మీదనే ఎక్కువ ఆధారపడుతున్నారు. చిత్తూరు రైల్వే స్టేషన్ నుండి రాకపోకలు సాగించే రైళ్ల సంఖ్య తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. కొన్ని రైళ్ళు ఉన్నా, అవసరమైనన్ని సీట్లు అందుబాటులో లేకపోవడం ఇందుకు కారణం.
చిత్తూరు రైల్వే స్టేషన్ లో మూడు ప్లాట్ ఫారాలు మాత్రమే ఉన్నాయి. రోజుకు 30 రైళ్ళు చిత్తూరు రైల్వే స్టేషన్ మీదుగా రాకపోకలు కొనసాగిస్తుంటాయి. ఒక అంచనా ప్రకారం ప్రతిరోజు 6000 మంది ప్రయాణికులు చిత్తూరు రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు కొనసాగిస్తుంటారు. ఇందువల్ల చిత్తూరు రైల్వే స్టేషన్ కు రోజుకు మూడు లక్షల రూపాయల వరకు ఆదాయం వస్తుంది. చిత్తూరు రైల్వే స్టేషన్ పేరు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న విధంగా ఉంది. చిత్తూరు రైల్వే స్టేషన్ అభివృద్ధికి ఎక్కువ అవకాశాలు ఉన్నా, పాలకుల నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధి చెందడం లేదు. అటు కాట్పాడి వరకు, ఇటు తిరుపతి వరకు డబుల్ లైన్ సౌకర్యం ఉంది. కాట్పాడి నుండి తిరుపతి వరకు అంటే 100 కిలోమీటర్లు డబుల్ లైన్ వేస్తే చిత్తూరు మీదుగా మరిన్ని రైళ్ళు వచ్చే అవకాశం ఉంది. డబుల్ లైన్ కారణంగా చిత్తూరు నుండి ఇతర ప్రాంతాలకు ప్రయాణ సమయం తగ్గుతుంది. మధ్య మధ్యలో క్రాసింగ్ కోసం రైలును ఆపే అవకాశం ఉండదు. ఫలితంగా చిత్తూరు నుండి ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం చిత్తూరు నుండి తిరుపతికి వెళ్లాలన్నా, బెంగళూరు కు వెళ్లాలన్న ఎక్కువ బస్సుల మీదనే ఆధారపడుతున్నారు. చిత్తూరు నుండి తిరుపతికి వెళ్లడానికి బస్సులో గంట సమయం పడితే, అదే ప్యాసింజర్ లో రెండు గంటల వరకు పట్టే అవకాశం ఉంది. చిత్తూరు నుంచి తిరుపతికి వెళ్లే ఎక్స్ప్రెస్ రైళ్ళు చాలా తక్కువ. దీంతో చిత్తూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లోని ఎక్కువమంది ప్రయాణికులు ప్రయాణం చేస్తుంటారు. తిరుపతి కాట్పాడి మధ్య ఒక ప్యాసింజర్ రైలు ఉంది. అది ఏ సమయానికి వస్తుందో సరిగా చెప్పలేని పరిస్థితి. ఎక్స్ప్రెస్ రైలు వస్తే మధ్య మధ్యలో ప్యాసింజర్ రైలును క్రాసింగ్ కోసం నిలుపుదల చేస్తున్నారు. ఇలా ఈ ప్యాసింజర్ రైలు ప్రయాణికుల సహనాన్ని పరీక్షిస్తుంది. దీంతో ఎక్కువ మంది ప్రయాణికులు బస్సుల మీదనే ఆధారపడి ప్రయాణం చేస్తున్నారు. చిత్తూరు మీదుగా 30 రైళ్ళు రాకపోకలు సాగిస్తున్నా, అందులో ఆరు రైళ్ళు ఇక్కడ ఆగడం లేదు. ప్రతిరోజు నడిచే హౌరా యశ్వంతపూర్, పూణే కన్యాకుమారి ఎక్ష్ప్రెస్స్ రైళ్ళు చిత్తూరులో ఆగవు. అలాగే వారానికి ఒకసారి నడిచే తిరుపతి రామేశ్వరం, ఓఖ్ల రామేశ్వరం, హైతి యశ్వంతపూర్, హౌరా పాండిచ్చేరి రైళ్లు కూడా ఇక్కడ ఆగవు. ఈ రైళ్ళను చిత్తూరులో కూడా ఆపాలని పలు రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా, ఫలితం లేదు. కాట్పాడి తిరుపతి సింగల్ లైన్ ను డబల్ నైన్ చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుండో ఉంది. జిల్లా నుంచి ఎన్నికైన పార్లమెంటు సభ్యులు ఈ విషయంలో దృష్టిని పెట్టకపోవడంతో డబుల్ లైన్ మంజూరు కాలేదు. చిత్తూరు వ్యాపార కేంద్రం కావడంతో ఇక్కడి వ్యాపారస్తులు చెన్నై, బెంగళూరు నుంచి ఎక్కువగా అవసరమైన వస్తువులను తెచ్చుకుంటుంటారు. అయితే చిత్తూరు నుంచి చెన్నైకి డైరెక్ట్ గా రైలు లేదు. చెన్నై వెళ్లాలంటే కాట్పాడికి వెళ్లి అక్కడ నుండి మరో రైళ్లు మారాల్సి ఉంటుంది. ఇక బెంగళూరు విషయానికి వస్తే బస్సులో వెళ్తే మూడు గంటలకు, అదే ట్రైన్ లో అయితే ఐదు నుంచి ఆరు గంటల సమయం పడుతుంది. కావున బెంగళూరు నుంచి చిత్తూరుకు ప్రయాణికులు రైలు ప్రయాణాన్ని ఎంచుకోవడం లేదు. సత్వరం రావడానికి బస్సుల మీదనే ఆధారపడుతున్నారు. ఇలా దగ్గరలో ఉన్న ప్రముఖ నగరాలకు చిత్తూరు నుంచి కనెక్టివిటీ లేకపోవడం మరో లోపంగా మారింది. ఈ ప్రాంతాల నుంచి ఎవరైనా వ్యాపార వస్తువులను తెచ్చుకోవాలంటే బస్సుల మీదనే ఆధారపడుతారు. గతంలో చెన్నై నుంచి మదనపల్లికి ఒక రైలును రైల్వే శాఖ ప్రకటించింది. అప్పట్లో కరోనా రావడంతో ఆ ప్రతిపాదన అటకెక్కింది. తర్వాత ఆ ప్రతిపాదన గురించి పట్టించుకునే నాధుడే కరువయ్యారు. అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన కాణిపాకం, తిరుపతి, శ్రీకాళహస్తిని కలుపుతూ ఒక రైల్వే లైన్ నిర్మించాలని ప్రతిపాదన చాలాకాలంగా నలుగుతోంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో విఫలం కావడంతో ఆ ప్రతిపాదన అమలుకు నోచుకోవడం లేదు. అమృత పథకం కింద దేశంలోని 1000 రైల్వేస్టేషన్ లను ఆధునికికరణ చేస్తున్నారు. ఇందులో భాగంగా చిత్తూరు రైల్వే స్టేషన్ కు కూడా 100 కోట్ల రూపాయలను కేటాయించారు. ఈ వంద కోట్ల రూపాయలతో ప్రస్తుతం ఉన్న పాత రైల్వే భవనాలను కూల్చి, కొద్దిగా ముందుకు జరిపి అదే భవనాలను మళ్లీ నిర్మిస్తున్నారు. రైల్వే స్టేషన్ ముందర ఉన్న రోడ్డును అభివృద్ధి చేస్తున్నారు. దీనివల్ల రైల్వే స్టేషన్ లో కొత్తగా సమకూరే వసతులు ఏమీ లేవు. ఈ పథకం కారణంగా చిత్తూరు రైల్వే స్టేషన్ కు లిఫ్ట్ సౌకర్యం మాత్రం సమకూరింది. ప్రస్తుతమున్న మూడు ప్లాట్ఫారాల స్థానంలో మరో ప్లాట్ఫారం వస్తే అన్నిటికీ అనుకూలంగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. అలాగే మరో ఫుట్ ఓవర్ బ్రిడ్జి అవసరమని చెపుతున్నారు. ఇప్పుడున్న భవన సముదాయాలను ముందుకు జరిపి కడుతున్న కారణంగా ఆస్థానంలో కొత్తగా మరో రైల్వే లైన్ లేక ప్లాట్ఫారం నిర్మించడం సబబుగా ఉంటుందని ఆశిస్తున్నారు. అయితే రైల్వే అధికారులు ఈ విషయాలను పట్టించుకోక, కేవలం కాంట్రాక్టర్ల లబ్ధి కోసమే ఉన్న భవనాలను పడగొట్టి, మళ్ళి కొత్తగా భవనాలను నిర్మిస్తున్నారు. వినియోగదారులకు మెరుగైన వసతులను సమకుర్చుతున్నాం అని చెబుతున్న రైల్వే అధికారులు చిత్తూరులో అదనపు సౌకర్యాల గురించి ఆలోచించడం లేదు. రైల్వే స్టేషన్ మొత్తం గ్రానైటు వేయనున్నారు. అంతకుమించి రైల్వే ప్రయాణికులకు కొత్తగా వసతులు కనిపించడం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి, చిత్తూరు జిల్లా పార్లమెంటు సభ్యులు ఈ విషయంలో దృష్టిని కేంద్రీకరించాలని చిత్తూరు పట్టణ ప్రజలు కోరుతున్నారు. చిత్తూరు రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫారాల సంఖ్యను పెంచడంతోపాటు, డబుల్ లైన్, మరో ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ఎస్కలేటర్, రైళ్ల సంఖ్యను పెంచడానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు.
సీట్ల కోటాను పెంచాలి
చిత్తూరు జిల్లా కేంద్రమైన సీట్లు పరిమితంగానే అందుబాటులో ఉంటున్నాయి చిత్తూరుకు రావాలన్న, చిత్తూరు నుంచి వెళ్లాలన్న నెల రోజులు ముందుగా రిజర్వేషన్ చేసుకున్న బెర్త్ లభించడం లేదు. ప్రైవేటు బస్సులు చిత్తూరు నుండి హైదరాబాదుకు వెళ్లడానికి 1500 నుండి పండుగ సీజన్ లో 3500 వరకు చార్జ్ చేస్తున్నాయి. కావున చిత్తూరులో బుక్ చేసుకునే సీట్ల కోటాను పెంచాల్సిన అవసరం ఉంది.
గంగ 1 జ్యోతిశ్వర్ రెడ్డి, ముదిగోళం
చెన్నైకు డైరెక్టర్ ట్రైన్ అవసరం
చిత్తూరు ప్రజలు ఎక్కువమంది చెన్నైకి వెళ్లి వస్తూ ఉంటారు. రైల్లో చెన్నైకి వెళ్లడానికి డైరెక్టుగా ట్రైన్ లేదు. కాట్పాడికి వెళ్లి, అక్కడ నుంచి మరో ట్రైన్ మారి చెన్నై కి వెళ్ళాలి. ఇలా చేయడం వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. చెన్నై నుంచి వ్యాపారస్తులు వాణిజ్య సరుకులు తీసుకుని రావడం కష్టమవుతుంది. చిత్తూరు నుంచి చెన్నైకి డైరెక్ట్ ట్రైన్ అవసరం ఎంతైనా ఉంది.
గంగ 2 బి ఎస్ నాగరాజ్, చిత్తూరు
రైల్వే స్టేషన్ విస్తరించాలి
నేను చిన్నప్పడు చిత్తూరు రైల్వే స్టేషన్ ఎలా ఉందో ఇప్పుడు కూడా అలా ఉంది. రైల్వేస్టేషన్ లో ప్లాట్ఫారాలు, వసతులు మెరుగుపడం లేదు. ఒక ఫుడ్ ఓవర్ బ్రిడ్జి మాత్రమే ఉంది. అది కూడా రైల్వే ఎంట్రన్స్ కు చాలా దూరంగా ఉంది. రైల్వే స్టేషన్ లో మరో ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ప్లాట్ఫారాల సంఖ్యను కూడా పెరగాలి. రైళ్ల సంఖ్య కూడా పెరగాల్సిన అవసరం ఉంది.
గంగ 3 చంద్రారెడ్డి, జంగాలపల్లి
డబుల్ లైన్ ఎంతో అవసరం
కాట్పాడి తిరుపతి మధ్య డబుల్ లైన్ లేకపోవడం చాలా లోపం. ఇందువల్ల చాలా రైళ్ళు ఆలస్యం అవుతున్నాయి. కొన్ని ట్రైన్లు కాట్పాడి నుంచి అరక్కోణం మీదుగా రేణిగుంటకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడుతుంది. డబుల్ లైన్ ఉంటే రైలు క్రాసింగ్ కోసం ఎక్కడా ఆగకుండా సకాలానికి గమ్యస్థానం చేరడానికి అవకాశం ఉంటుంది. ప్రయాణికులు రైలు ప్రయాణానికి ఆసక్తిని చూపిస్తారు.
గంగ 4 భాస్కర్ నాయుడు, కస్తూరి నాయుడు పల్లి
గంగ 5 చిత్తూరు రైల్వే స్టేషన్