జిల్లాలో అరకొరగా ధూప దీప నైవేద్యాల పథకం అమలు
రాజకీయ సిఫార్సులకు ప్రాధాన్యత
అర్హతలేని ఆలయాలకు అందుతున్న నిధులు
అన్ని అర్హతలు ఉన్న పధకం మంజూరు కోసం పడికాపులు
అన్ని ఆలయాలకు ధూప దీప నైవేద్యాల పథకం అమలుకు డిమాండ్
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
దేవాలయాల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోచ్చిన ధూప దీప నైవేద్యాల పథకం అరకొరగా అమలవుతోంది. దశాబ్దాల చరిత్ర గల దేవాలయాలకు ధూపదీప నైవేద్యాలను సమర్పించేందుకు పూజారులు కొరవడటంతో ఆ ఆలయాలకు పూర్వవైభవం కల్పించేందుకే ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. కానీ ఈ ధూప దీప నైవేద్యం పథకం పూర్తి స్థాయిలో అమలు జరగడం లేదు. ఎదో మొక్కుబడిగా కొన్ని ఆలయాలకు మాత్రమే అమలు అవుతోంది. ఈ పధకం అమలులో రాజకీయనాయకులకు ప్రాధాన్యత ఇవ్వడంతో వారు సిఫారసు చేసిన ఆలయాలకు మాత్రమే ధూప దీప నైవేద్యాల పథకం మంజూరు అవుతోంది. మిగిలిన ఆలయాలకు అర్హత ఉన్నా, మంజూరు కావడం లేదు. ఇందువల్ల ఈ పధకం ముఖ్య ఉద్దేశ్యం నీరు కారుతోంది. కొన్ని ఆలయాలకు అన్ని అర్హతలు ఉన్నా, ఎం ఎల్ ఏ సిపారసు చేసినా, మంజూరు కావడం లేదు.
చిత్తూరు జిల్లాలో దేవాలయ ధర్మాదాయ శాఖ వద్ద నమోదైన ఆలయాలు 1,586 ఉన్నాయి. ఇందులో 229 ఆలయాలకు మాత్రం ధూప దీప నైవేద్యం పథకం అమలవుతోంది. ఈ పథకం కింద పూజారులకు ఆర్థిక సహాయం అందుతుంది. మిగిలిన ఆలయాలు నిరాదరణకు గురవుతున్నాయి. అక్కడ ఆదాయం లేక స్వామివారికి దీపం పెట్టి నైవేద్యం పెట్టే నాధుడే కరువవుతున్నారు. దీంతో ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం చిత్తూరు జిల్లాలో నెరవేరడం లేదు. ఈ పథకం అమలుకు ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. దాని ప్రకారం ఆలయం గ్రామీణ ప్రాంతాల్లో ఉండాలి. రాతి విగ్రహం ఉండాలి. ఆలయానికి ధ్వజస్తంభం ఉండాలి. ఆలయానికి 10 ఎకరాల లోపు మెట్ట భూమి ఉండాలి. ఆలయంలో పూజ చేయడానికి మగ అర్చకులు ఉండాలి. అయితే ఈ పథకం రాజకీయ నాయకుల సిఫార్సుల ఆధారంగా అమలు జరగడంతో పలు ఆలయాలు నిరాదరణకు గురవుతున్నాయి. పలుకుబడి కలిగిన ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గానికి ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారు. కొంతమంది ప్రజాప్రతినిధులు సిఫార్సు చేసిన ఆలయం ఎందుకు ఎంపిక కావడం లేదు. చిత్తూరు జిల్లాలో గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఆత్యధికంగా ఈ పథకం కింద లబ్ధి పొందినట్లు సమాచారం. కొత్తగా కట్టిన ఆలయాలకు నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి, ధూప దీప నైవేద్య పధకాన్ని మంజూరు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ నాయకుల వత్తిడి కారణంగా ఎండోమెంట్ అధికారులు అర్హతలు లేకపోయినా, కొన్ని ఆలయాలకు సిఫార్సులు చేశారు. దీనితో అర్హత కలిగిన ఆలయాలు మూలనపడ్డాయి. కొత్తగా నిర్మించిన ఆలయాలు, ధ్వజస్తంభం లేని ఆలయాలు ఈ పథకం కింద చోటు చేసుకున్నట్లు సమాచారం. ప్రతి రోజు దేవుడి ముందు దీపం వెలిగించి నైవేద్యం సమర్పించే అర్చకులకు డీడీఎన్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనం సమయానికి అందడంలేదు. దీంతో దేవుడి దీపానికి ధూపానికి కష్టంగా మారింది. ధూప దీప నైవేద్య అర్చకులను ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. ప్రభుత్వం సరైన సమయానికి వేతనాలు ఇవ్వకపోవడంతో అర్చకులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలోని దేవాలయాల్లో నిత్యం దీపం ధూపం నైవేద్యం పెట్టేందుకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డీడీఎన్ పథకాన్ని అమలులోకి తెచ్చారు. పురాతన, చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఆలయాలు ఆర్థిక లేమి కారణంగా నిత్య పూజలకు నోచుకోకుండా ఉండకూడదని, అర్చకుల ఇబ్బందులు తీర్చాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారు. అందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం, ఆస్తిపాస్తులు లేని ఆలయాల్ని గుర్తించి కొంత మొత్తం ఇవ్వాలని నిర్ణయించారు. తొలుత రాష్ట్రస్థాయిలో దరఖాస్తులు ఆహ్వానించి.. కొన్ని ఆలయాలను ఎంపిక చేశారు. అప్పట్లో ఒక్కో ఆలయానికి నెలకు రూ.2,500 చొప్పున అందజేశారు. అందులో అర్చకుల జీవన భృతికి రూ.1,500, మిగిలిన మొత్తం ధూప దీప నైవేద్యానికి వినియోగించేవారు. అయిదేళ్ల కిందట ఈ పథకానికి ఇచ్చే మొత్తాన్ని రూ.5 వేలకు పెంచారు. అందులో రూ.2,500 క్రతువులకు, అర్చకులకు గౌరవ వేతనంగా రూ.2,500 నిర్ణయించారు. దేవాదాయ శాఖ శ్రేయోనిధి నుంచి ఆలయాల అర్చకుల పేరిట ఉన్న బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేస్తున్నారు. నిత్యావసర సరకులు, ఇతర ఖర్చులు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం డీడీఎన్ పథకం కింద ఇచ్చే మొత్తాన్ని కూటమి ప్రభుత్వం రూ.10 వేలకు పెంచింది. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేసింది. నిరాదరణకు గురవుతున్న పురాతన ఆలయాలను పునరుద్ధరించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఈ పథకం లక్ష్యం నీరుగారుతోంది. నామ మాత్రంగా అమలు జరుగుతుండటంతో ఎన్నో ఆలయాల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఇతర మతాల విషయంలో ఉదారంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం హిందూ ఆలయాలపై సవతి తల్లి ప్రేమను ప్రదర్శించడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. దేవాదాయ శాఖ నిధులను ఇతర శాఖలకు మళ్లిస్తున్న ప్రభుత్వం ఆ శాఖను మాత్రం గాలికొదిలేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ధూపదీప నైవేద్య పథకానికి నిధులను సకాలంలో చెల్లించడంతో పాటు, నిబంధనలు పాటించకుండా అన్ని ఆలయాలకు ధూప దీప నైవేద్యాల పథకం అమలు చేయాలను భక్తులు కోరుతున్నారు. అలాగే జీర్ణావస్థలో ఉన్న అన్ని ఆలయాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.
పో రై గంగ 3 ఈ పధకానికి నోచుకోని పురాతన కుళ్ళంపల్లి వీరభద్రస్వామి ఆలయం
గంగ 4 ఆలయంలోని మూలవిరాట్టులు