రోడ్డు నిర్మాణ లోపం ప్రయాణికులకు శాపం
వారం రోజులలో 3 ప్రమాదాలు
10 మంది మృతి, 40 మందికి గాయాలు
ప్రమాదాలతో మేల్కొన్న జాతీయ రహదారుల సంస్థ
రూ. 3 కోట్లతో ప్రమాదాల నిర్వహణకు చర్యలు
ప్రమాదాలను సీరియస్ గా తీసుకున్న హై కోర్టు
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మొగలి ఘాట్ రోడ్డు నిర్మాణంలోని లోపాల కారణంగానే మలుపు వద్ద తరుచుగా ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మొగిలి ఘాట్ రోడ్డులో జరుగుతున్న ప్రమాదాలు మీద హైకోర్టు రోడ్డు సేఫ్టీ అథారిటీ కూడా తీవ్రంగా స్పందించడంతో, నష్ట నివారణ చర్యలను ప్రభుత్వం ప్రారంభించింది. అక్కడ ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యల పట్ల దృష్టిని సారించారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఇటీవల జిల్లా ఉన్నత స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మొగిలి ఘాట్ రోడ్డు ప్రమాదాలకు గల కారణాలు, నివారణ ఉపాయాలు గురించి చర్చించారు. ఈ సమావేశం అనంతరం మూడు కోట్ల రూపాయలతో మొగిలి ఘాట్ రోడ్డును మరమ్మతులు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
మొగిలి ఘాటు రోడ్డులోని ప్రమాదకరమైన మలుపు దగ్గర వారం రోజుల్లో మూడు ప్రమాదాలు జరిగాయి. ఈ నెల 13న ప్రమాదంలో ఎనిమిది మంది మృతిచెందగా, 31 మంది గాయపడ్డారు. తిరుపతి నుండి బంగళూరు వెళ్తున్న ఆర్ టి సి బస్సును పలమనేరు నుండి వస్తున్న లారీ అదుపుతప్పి, డివైడర్ ను దాటుకొని వెళ్లి డికొంది. 20న జరిగిన ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. గురువారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. వారం రోజుల్లో వరుసగా మూడు ప్రమాదాలు జరగడంతో జాతీయ రహదారుల నిర్మాణ సంస్థ అప్రమత్తమైంది. ఈ ప్రమాదాలకు కారణాలను విశ్లేషించారు బెంగళూరులోని ఒక కన్సల్టెన్సీ ద్వారా అక్కడ తరచుగా జరుగుతున్న ప్రమాదాల గల కారణాలు, నివారణ ఉపాయాలు గురించి అధ్యాయనం చేపించారు. ఈ అధ్యయనంలో ఘాటు రోడ్డు నిర్మాణంలోని లోపాల కారణంగానే అక్కడ తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని నిర్ధారించారు. పలమనేరు నుండి చిత్తూరుకు వచ్చే రహదారీ పల్లముగా ఉంది. కావున వాహనాలు వేగంగా వస్తున్నాయి. వాహనాలు వచ్చిన తర్వాత ఘాట్ రోడ్లో ఎస్ టైప్ మలుపు ఉంది. ఈ మలుపు వద్ద వాహనాలు నియంత్రణ కావడం లేదు. వాహనాలు నియంత్రణ కావడం కాకపోవడంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అక్కడ మలుపు లేకుంటే ప్రమాదాలు జరిగే అవకాశం లేదని నిపుణులు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. అక్కడ మలుపును తొలగించడానికి జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తాత్కాలికంగా ఇటీవల స్వీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశారు. అయితే స్పీడ్ బెకర్లు ఏర్పాటు చేసిన తర్వాత ఆ స్పీడ్ బ్రేకర్ కారణంగా ప్రమాదం జరగడంతో, ఆ స్పీడ్ బ్రేకర్ ను తొలగించారు. ప్రస్తుతం అక్కడ వేగ నియంత్రణకు జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 40 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగం వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఇందుకు స్పీడ్బ్రేకర్ లాంటి జీబ్రా లైన్స్ వేయాలని భావిస్తున్నారు. అక్కడ ఒక చెక్ పోస్ట్ ను కూడా ఏర్పాటుచేసి, వేగ నియంత్రణను తగ్గించాలని నిర్ణయించారు. మలుపు దగ్గర డివైడర్ ఎత్తు తక్కువ, రోడ్డు వెడల్పు కూడా తక్కువ ఉండడాన్ని గమనించారు. అక్కడ డివైడర్ ను పటిష్టంగా, వెడల్పు చేసి మరింత పొడుగు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రమాదకరమైన మలుపు వద్ద 2019లో జరిగిన ఒక ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. దీని తర్వాత జాతీయ రహదారుల సంస్థ ప్రమాద నివారణకు చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగా ప్రమాదానికి గల కారణాలను అధ్యయనం చేశారు. అప్పట్లో 1.5 కోట్ల రూపాయలతో రోడ్డును అభివృద్ధి చేయడానికి ఒక ప్రతిపాదన రూపొందించారు. ఆ ప్రతిపాదన ఇప్పటివరకు అమలు కాకపోవడంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. వారం రోజుల్లో జరిగిన ప్రమాదంలో పదిమంది మృతి చెందగా, 40 మంది వరకు గాయపడ్డారు. ఈ విషయాన్ని హైకోర్టు రోడ్డు సేఫ్టీ అధారింటి చాలా సీరియస్ గా పరిగణించింది. మొగిలి ఘాట్ రోడ్డులో ప్రమాదాలను నివారించడానికి చేపడుతున్న చర్యలు గురించి వెంటనే నివేదికన సమర్పించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఇటేవల జిల్లా కలెక్టర్ జిల్లా స్థాయిలో వివిధ ఇంజనీరింగ్ అధికారులతో ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మొగిలి ఘాట్ రోడ్డులోని ఒకే స్థలంలో ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయో విశ్లేషించారు. అక్కడ రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు గురించి పలువురి సలహాలు తీసుకున్నారు. మొగిలి ఘాటు రోడ్డులో మలుపు లేకుండా రోడ్డును సక్రమంగా చేయగలిగితే ప్రమాదాలను నివారించవచ్చని ఏకాభిప్రాయ వ్యక్తం అయినట్లు తెలుస్తోంది. ఇందుకోసం మరో 1.5 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలను జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ తయారు చేసింది. మొత్తం మూడు కోట్ల రూపాయల వ్యయంతో మొగలి ఘాట్ రోడ్డును మరమతులు చేయడానికి, ప్రమాదాల నివారణకు అంచనాలను రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. అతివేగం కారణంగానే అక్కడ ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని ఒక విశ్లేషణలో తెలిసింది. జాతీయ అరహదారి కావడం ఎక్కడ స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో వందకు మించిన వేగంతో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే చిత్తూరు నుంచి పలమనేరు వెళ్లే దారి ఎత్తు కావడంతో వెళ్లే వాహనాలు ప్రమాదాలకు గురయ్యే అవకాశం చాలా తక్కువ. పలమనేరు వైపు నుండి వస్తున్న వాహనాలు అదుపుతప్పి అటువైపు వెళుతున్న వాహనాలను ఢీకొంటే తప్ప ప్రమాదం జరిగే అవకాశం లేదు. 13వ తేదిన పలమనేరు నుంచి వస్తున్న ఒక లారీ అదుపుతప్పి డివైడర్ ను దాటి తిరుపతి నుంచి బెంగళూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సులు ఢీకొనడంతో ఎనిమిది మంది మృతి చెందారు. ప్రమాదాలు ఎక్కువగా లారీలు, ట్రక్కులు వల్లనే జరుగుతున్నట్లు గుర్తించారు. వేగంగా వస్తున్న కార్లు కూడా ప్రమాదానికి గురవుతున్నాయి. అక్కడ వేగం నియంత్రణ కాకపోవడంతో మలుపు కారణంగానే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించారు. ప్రమాదాలు జరుగుతున్న స్థలంలో రోడ్డు కూడా ఎక్కువ వెడల్పు లేదు. ఇరుగ్గా ఉంది. గతంలో ఆరు లైన్ల రోడ్డు నిర్మాణ జరిగినప్పుడు కొండను చీల్చి రోడ్డును వేశారు. ఆ సమయంలో మలుపు లేకుండా నేరుగా రోడ్డు నిర్మించి ఉంటే ఈ ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉండేది కాదని నిపుణులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగే స్థలంలో రోడ్డు వెడల్పు తక్కువగా ఉండడం, రోడ్డు డివైడర్ బలహీనంగా ఉండడం వలన కూడా అదుపుతప్పి డివైడర్ ను దాటుకొని వాహనాలు వెళుతున్నాయి. ఈ దారిలో వస్తున్న వాహనాల సామర్థ్యం గురించి అంచనా వేసే అవకాశము లేదు. డ్రైవర్లు కొంతమంది మద్యం సేవించడం, నిద్రమత్తులో వాహనాలను నడపడం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అక్కడ వెలుతురు లేకపోవడం కూడా ప్రమాదాలకు మరో కారణం. ప్రస్తుతం మూడు కోట్ల రూపాయల వ్యయంతో వేగ నియంత్రణతో, పాటు మలుపు లేకుండా రోడ్డును మరమతు చేయడానికి చర్యలు తీసుకోమన్నారు. అలాగే రోడ్డు వెడల్పు పెంచడం, డివైడర్ ను పట్టిష్టం చేయడం, లైట్లు వేయడం, చెక్ పోస్టు ఏర్పాటు, వేగ నియంత్రణతో పాటు జీబ్రా లైన్స్ ఎత్తుగా వేయడం వంటి చర్యలు చేపట్టనున్నారు. వీలైనంత తొందరగా ఈ చర్యలు చేపట్టడం అవసరం. లేకుంటే, మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.