26, సెప్టెంబర్ 2024, గురువారం

బోగస్ వికలాంగుల మీద ప్రభుత్వం దృష్టి

జిల్లాలో భారీగా బోగస్ వికలాంగులు ఉన్నట్లు నిర్ధారణ 

వైసిపి ప్రభుత్వంలో  బోగస్ వికలాంగులకు భారీగా పించన్లు 

స్వచ్చందంగా వదులుకోవాలని ముఖ్యమంత్రి వినతి 

గ్రామ సభల ద్వారా బోగస్ వికలాంగుల ఏరివేత 

ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు. 

బోగస్ వికలాంగ సర్టిఫికెట్ల మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టిని సారించింది. ఇప్పటికే బోగస్ వికలాంగులు స్వచ్ఛందంగా తన పెన్షన్ వదులుకోవాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. బోగస్ వికలాంగ సర్టిఫికెట్లను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా పరిగణిస్తుంది. వైసీపీ ప్రభుత్వంలో పలువురు బోగస్ వికలాంగ సర్టిఫికెట్లతో పించన్ పోందుతున్నట్టుకు ప్రభుత్వానికి పక్కా సమాచారం అందింది. దీంతో బోగస్ వికలాంగులను ఏరివేయడానికి ప్రభుత్వం త్వరలోనే చర్యలు చేపట్టనుంది. ఇందుకు గ్రామ సభలు నిర్వహించి, ఆ గ్రామ సభలలోనే బోగస్ వికలాంగులను తొలగించడం, అర్హులకు పెన్షన్ ఇవ్వడం వంటి కార్యక్రమాలను చేపట్టనుంది. 


చిత్తూరు జిల్లాలో అన్ని రకాల పింఛన్లు  2,72,864 అందజేస్తున్నారు. ఇందులో వృద్ధాప్య పెన్షన్లు 1,46,024, వితంతు పెన్షన్లు 59,903, ఒంటరి మహిళ  పెన్షన్లు 5,751 ఉండగా వికలాంగుల పించన్లు మాత్రం 35,927 ఉన్నాయి. వైసిపి పాలనలో వికలాంగుల పెన్షన్లలో భారీ ఎత్తున అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. 5 -10 శాతం వికలత్వం ఉన్నా, 90 శాతం ఉన్నట్లు నమోదు చేసి పించన్లు పొందుతున్నట్లు ప్రభుత్వానికి సమాచారం అందింది. ఇందుకోసం డాక్టర్లు కూడా భారీగా ముడుపులు తీసుకొని ద్రువికరణ పత్రాలు అందజేసినట్లు తెలుస్తోంది. గ్రామ, మండల స్థాయిలో వికలాంగుల సమాఖ్యలను  ఏర్పాటు చేసి వారి దగ్గర నుండి స్థానికులు కూడా  భారీగా డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ డబ్బులను డాక్టర్లకి ఇచ్చి  భారీగా బోగస్ వికలాంగ పింఛన్లు పొందుతున్నట్లు తెలుస్తోంది. పెన్షన్లు పొందుతున్న వారిలో ఎక్కువ మంది చెవుడు ఉన్నట్లుగా ధ్రువీకరణ పత్రాలు పొందినట్లు సమాచారం. బాగా వినిపిస్తున్న వాళ్లు కూడా తమకు చెవుడు ఉందని డాక్టర్లను మేనేజ్ చేసి సర్టిఫికెట్లు తెచ్చినట్లు తెలుస్తోంది. పలువురికి స్వల్పంగా వికలాంగత్వం ఉన్న దానిని ఎక్కువగా ఉన్నట్లు, దానివల్ల తాను ఏ పని చేయలేకపోతున్నట్లు నకలి ధ్రువీకరణ పత్రాలు సృష్టించినట్లు తెలుస్తోంది. ఇందుకు అప్పట్లో ఉన్న అధికారులు కూడా సహకరించారని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా సీరియస్ గా పరిగణిస్తుంది. ఈ విషయమై ఇప్పటికే ముగ్గురు మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. బోగస్ వికలాంగ సర్టిఫికెట్లను ఎలా గుర్తించాలి అనేదానిపైన అధ్యయనం చేస్తున్నారు. గ్రామసభలను నిర్వహించి అక్కడే బోగస్ వికలాంగుల భరతం పట్టాలని కూడా ఆలోచిస్తున్నారు. బోగస్ వికలాంగ సర్టిఫికెట్లను అందజేసిన డాక్టర్ల మీద కూడా చర్యలు తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. ప్రభుత్వం రానున్న కాలంలో వికలాంగ ధ్రువీకరణ పత్రాలు పక్కాగా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోనుంది. ఇందుకోసం జిల్లా స్థాయిలో డాక్టర్ల బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఆ బృందం నిర్ధారించిన వారికి మాత్రమే పించన్లు అందజేయనున్నారు. ఇప్పటివరకు ఉన్న బోగస్ వికలాంగ సర్టిఫికెట్లను రద్దుచేసి, కొత్తగా సర్టిఫికెట్లు పొందిన వారికి మాత్రమే పెన్షన్ ఇచ్చే విధానాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళల పించన్లను  3000 రూపాయలు నుండి 4వేల రూపాయలకు పెంచింది. వికలాంగుల పెన్షన్లు మాత్రం 3000 రూపాయలు నుండి 6000 రూపాయలకు పెంచింది. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, మంచానికే పరిమితమైన వరకు 16000 రూపాయల పింఛన్లు అందజేస్తున్నారు. దీంతో ప్రభుత్వం మీద భారీగానే భారం పడుతుంది. నిజమైన వికలాంగులను గుర్తించడంతోపాటు వారికి ఇతర ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఇందులో భాగంగా వారికి వృత్తి విద్యా కోర్సులలో శిక్షణను ఏర్పాటు చేయనుంది. రాష్ట్రస్థాయిలోక్రీడా పోటీలో నిర్వహించడం వంటి విషయాలను కూడా ఆలోచిస్తుంది. ప్రభుత్వం త్వరలోనే వికలాంగ సర్టిఫికెట్లకు మంగళం పలికి, జిల్లాలో కొత్తగా అర్హులైన కొత్త పింఛన్దారులకు పింఛన్ ఇచ్చే విషయాలను కూడా పరిశీలిస్తుంది.  కూటమి ప్రభుత్వం తన ఎన్నికల ప్రణాళికలో భాగంగా 50 సంవత్సరాల బిసి, ఎస్సీ, ఎస్టీ వారికి పింఛన్ అందజేస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు జిల్లాలో లక్ష మంది వరకు ఉండవచ్చని ఒక అంచనాకు వచ్చారు. వికలాంగుల పింఛన్లు ఒక దారిలోకి వచ్చిన తర్వాత 50 సంవత్సరాలు నిండిన వారి నుండి కూడా పింఛన్ నిమిత్తం దరఖాస్తులను స్వీకరించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *