రాష్ట్ర రాజకీయాల వైపు మిథున్ రెడ్డి చూపు
వచ్చే ఎన్నికలలో పుంగనూరు నుంచి పోటీ
జాతీయ రాజకీయాల నుంచి రాష్ట్ర రాజకీయాలకు
మంత్రి పదవే లక్ష్యంగా రాష్ట్ర రాజకిల్లోకి అరంగ్రేటం
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
రాజంపేట ఎంపి పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి రాష్ట్ర రాజకీయాలపై దృష్టిని సారించారు. 2029 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చసి రాష్ట్ర రాజకీయాలలో క్రియాశీలకం కావాలని భావిస్తున్నారు. తన తండ్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో మంత్రి కావాలని భావిస్తున్నారు. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు ఎంపీగా గెలిచిన మిథున్ రెడ్డి ఇక జాతీయ రాజకీయాలకు స్వస్తి చెప్పే పరిస్థితి కల్పిస్తోంది. రాష్ట్ర రాజకీయాలలో చురుకైన పాత్రను పోషిస్తూ, మంత్రిగా రాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
సోమవారం పుంగనూరు మీడియా సమావేశంలో ఈ విషయాన్ని పరోక్షంగా చెప్పారు. తమ కుటుంబానికి అండగా ఉన్న కన్నతల్లి లాంటి పుంగనూరు నియోజకవర్గం ప్రజల కోసం అవసరం అయితే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పారు. అయితే ప్రస్తుత పుంగనూరు శాసనసభ్యుడు రామచంద్రారెడ్డి రాజకీయాల్లో కొనసాగుతారా లేక రాజకీయాల నుంచి విరమించుకుంటారా అనే దానిపైన స్పష్టత ఇవ్వలేదు. మిథున్ రెడ్డి పుంగనూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే రామచంద్రారెడ్డి భవిష్యత్తు ఏమిటన్న దానిపైన జిల్లాలో జోరుగా ఊహాగాలు కొనసాగుతున్నాయి. 2026 లో నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన తన తండ్రి, మిథున్ రెడ్డిలు ఇద్దరు వేరు వేరు నియోజకవర్గాల నుండి పోటీ చేస్తారని కొందరు భావిస్తున్నారు. రామచంద్రారెడ్డి రాజకీయ వారసుడిగా తనయుడు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి రాష్ట్ర రాజకీయాలలో అరంగ్రేటం చేస్తారని రామచంద్రారెడ్డి విశ్రాంతి తీసుకుంటారని మరికొందరు భావిస్తున్నారు. అయితే పార్లమెంటులో మహిళా బిల్లు తరువాతనే, నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని మిథున్ రెడ్డి చెప్పారు. ఒక వేళ నియోజక వర్గాల విభజన జరగక పోయినా ప్రజల కోసం ఆయన పోటీ చేస్తారని కొందరు భావిస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వయసు రీత్యా రాజకీయాల నుంచి విరమించుకుని తన వారసునిగా మిథున్ రెడ్డిని పోటీ పెట్టే అవకాశాలు ఉన్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పటివరకు ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన పీలేరు నియోజకవర్గం నుంచి మూడు పర్యాయాలు, పుంగనూరు నుంచి మరో మూడు పర్యాయాలు గెలిచారు. 1999 నుంచి వరుసగా అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందుతున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య మంత్రివర్గాలలో అడవులు, పర్యావరణ శాఖ, సాంకేతిక శాఖ మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 2013లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 ఎన్నికలలో పుంగనూరు నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది, జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గనులు, భూగర్భ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల శాఖ బాధ్యతలు కూడా జగన్ రామచంద్రారెడ్డికి అప్పగించారు. ఆయన 1974లో తిరుపతి శ్రీ వెంకటేశ్వర విద్యాలయంలో చదువుతూ విద్యార్థి సంఘ నాయకుడిగా ఎన్నికయ్యారు. అలాగే 1985,1994 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఓటమి పాలయ్యారు. 1999 తరువాత వరస విజయాలతో విజయకేతనం ఎగురవేస్తున్నారు. రామచంద్రా రెడ్డి రాజకీయాలలో ఉన్నత స్థాయికి ఎదిగారు. ఇంకా రామచంద్రా రెడ్డి రాజకీయాలలో కొనసాగాలి అనుకుంటే.. పక్కనే ఉన్న పీలేరు, పలమనేరు నియోజక వర్గాలలో ఒక స్థానం నుంచి పోటీ చేయవచ్చు. మిధున్ రెడ్డి బాబాయి ద్వారకనాధ రెడ్డి 2019 నుంచి తంబళ్లపల్లె ఎమ్మెల్యేగా అన్నారు. 47 ఏళ్ళ వయసు గల మిథున్ 2019 లో తొలిసారి రాజంపేట లోక్ సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 2024 ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి మాజీ సిఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపై విజయం సాధించారు. లోక్ సభ ప్యానెల్ స్పీకరుగా పనిచేశారు. ప్రస్తుతం వైసీపీ తరఫున ఫ్లోర్ లీడర్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఎన్నాళ్ళు ఉన్నా కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉండదని ఆయన భావిస్తున్నారు. రాష్ట్రం అయితే కీలకమైన మంత్రి పదవి చేపట్టవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇప్పటి నుంచే రాష్ట్రంలో కీలక పాత్ర పోషించడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు పాదయాత్ర నిర్వహణ అంత దగ్గరుండి మిథున్ రెడ్డి పర్యవేక్షించారు. పాదయాత్రకు అవసరమైన ఆర్థిక వనరులను కూడా మిధున రెడ్డి సమకూర్చారని తెలుస్తోంది. ప్రస్తుతం పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసిపి అధ్యక్షుడుగా ఉన్నారు. అయితే పరోక్షంగా మిథున్ రెడ్డి నిర్ణయాలకు విలువ ఇస్తున్నారు. యువకుడు అయిన ఆయనకు జిల్లాలో తన తండ్రి ప్రత్యర్థులు అయిన సిఎం చంద్రబాబు నాయుడు, మాజీ సిఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఎదుర్కునే సమర్ధత ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
పో రై గంగ 1 మిధున్ రెడ్డి