కూటమి నేతల్లో టెన్షన్ టెన్షన్
నామినేటెడ్ పదవి వస్తుందో రాదో అన్న ఉత్కంఠ
పదవి వస్తే చైర్మన్ పదవా డైరెక్టర్ పదవా తెలియక అయోమయం
తమ పేరు ఏ జాబితాలో ఉంటుందో తెలియక తికమక
పదవి రాకుంటే ప్రజల్లోకి ఎలా వెళ్లాలన్న దిగాలు
ప్రభన్యూస్ బ్యూరో, చిత్తూరు.
చిత్తూరు జిల్లా కూటమి నేతల్లో నామినేటెడ్ పదవులు ఉత్కంఠ నెలకొంది. కోటను ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజుల పాలనను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నామినేటెడ్ పోస్టుల పందారం ఉంటుందని పార్టీ అధినేత కూటమి నేతలకు పరోక్షంగా సంకేతాలు పంపారు. రాష్ట్ర కాలుష్య నివారణ మండలి చైర్మన్ గా మాజీ ఐఏఎస్ అధికారి చిత్తూరు జిల్లా కలెక్టర్ గా పనిచేసిన కృష్ణయ్యను నియమించారు. దీంతో ఇక నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రారంభమైందని కూటమి నాయకులు భావిస్తున్నారు. చంద్రబాబు కూడా గతంలో లాగా కాకుండా తొందర్లోనే నామినేటెడ్ పదవుల పందేరం చేయనున్నారని, ఇందుకు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో చురుగ్గా కసరత్తు జరుగుతుందని తెలుస్తోంది. అయితే నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్న వారిలో ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. తమకు నామినేటెడ్ పోస్ట్ వస్తుందా? రాదా? వస్తే చైర్మన్ పదవి లభిస్తుందా? డైరెక్టర్ పదవి లభిస్తుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అలాగే తమ పేరు మొదటి జాబితాలో ఉంటుందా? రెండవ జాబితాలో ఉంటుందా? మూడవ జాబితాలో ఉంటుందా? తెలియక జుట్టు పీక్కుంటున్నారు. జిల్లాలో నామినేటెడ్ పోస్ట్ కు దరఖాస్తు చేసినవాళ్లు అందరూ ప్రోటోకాల్ ఉన్న చైర్మన్ పదవి మీదనే దృష్టిని పెట్టారు. అయితే ఆశావహుల జాబితా బారెడు ఉండగా, పదవులు మాత్రం జానేడే ఉన్నాయి. దీంతో ఎవరికి ఏ పదవి వస్తుందో తెలియక కూటమి నేతలు తికమక పడుతున్నారు. తమకు నామినేటెడ్ పదవి ఖాయమని ఇప్పటికే పలువురు ప్రచారం చేసుకున్నారు. ఏదైనా కారణాలతో నామినేటెడ్ పదవి రాకుంటే ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్లాలని పలువురు దిగాలు పడుతున్నారు. పదవుల కోసం పార్టీలో ముఖ్యమైన నేతలు చుట్టూ తిరగడమే కాకుండా, గుళ్ళు గోపురాలు కూడా తిరుగుతున్నారు. తమకు ప్రోటోకాల్ ఉన్న మంచి నామినేటెడ్ పోస్ట్ కావాలని దేవుళ్ళను కూడా మొక్కుకుంటున్నారు.
ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తమను పదవులు వర్తిస్తాయని చాలా మంది నేతలు భావించారు. చంద్రబాబు తొలి నుంచి పదవులు పంపిణీపై ఊరిస్తున్నారు. అలాగే ఏదో ఒక సాకు చూపి వాయిదా వేస్తున్నారు. కొంత మంది నేరుగా సిఎం చంద్రబాబు నాయుడును కలసి తమకు రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవి ఇవ్వాలని కోరారు. కొందరు మూడు నుంచి ఐదు పదవులను సూచించి అందులో ఒకటి ఇవ్వాలని కోరారు. మరికొందరు స్థానిక ఎమ్మెల్యేల సిఫారసు లేఖలు జత పరిచారు. దీనితో తమకు పదవి గ్యారంటీ అంటూ ప్రచారం కూడా చేసుకున్నారు. అయితే ఏదో ఒక నెపంతో పదవుల పందేరం వాయిదా పడుతూ వస్తోంది. వంద రోజులు పూర్తి అయిన సందర్భంగా సెప్టెంబర్ 20 న పదవులు ప్రకటిస్తారని భావించారు. అయితే అందరి ఆశలు నిరాసలయ్యాయి. దీనితో గురువారం జిల్లాకు వచ్చిన మంత్రి లోకేష్ దృష్టిలో పడేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేశారు. తిరుపతి విమానాశ్రయంలో కొందరు లోకేష్ తో పదవుల ప్రస్తావన తేగా అవన్నీ సిఎం చూసుకుంటారని దాటవేశారని తెలిసింది. అయితే అందరికి తనతో ఫోటోలు తీసుకుని అవకాశం మాత్రం కల్పించారు. అలాగే శుక్రవారం బంగారుపాల్యం లో జరిగిన కార్యక్రమాలలో కూడా లోకేష్ ను పలువురు కలిశారు. అయితే ఎవరికీ పదవీ హామీ దొరక లేదు. ఈ నేపథ్యంలో పదవుల కోసం ప్రయత్నిస్తున్న నేతల్లో ఆందోళనకు గురవుతున్నారు. పని తీరును బట్టి పదవి ఇస్తామని చంద్రబాబు అంటున్నారని తెలిసింది. దీనికి అనుగుణంగా నాలుగు రకాల జాబితాలను రూపొందించి సిద్ధంగా పెట్టుకుని ఉన్నారని తెలిసింది. ఇదిలా ఉండగా వైసిపి నేతలను ఎక్కువగా విమర్శించే వారికి ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. రాష్ట్ర స్థాయిలో దాదాపు 50 క్యాబినెట్ హోదా కల నామినేటెడ్ పదవులు ఉన్నాయి. ఇందులో జిల్లాకు రెండు రావచ్చు అంటున్నారు. దీనితో కొందరు ప్రముఖులు ఆ రెండు పదవులపై దృష్టి పెట్టారు. అవి కాకుంటే ఏదో ఒక రాష్ట్ర స్థాయి పదవి ఆశిస్తున్నారు. మరో వంద వరకు రాష్ట్ర స్థాయి పదవులు ఉన్నాయంటున్నారు. ఏదో ఒక చైర్మన్ పదవీ కావాలని కొందరు పట్టు పడుతుండగా, కనీసం డైరెక్టర్ పదవి ఇచ్చినా చాలని కొందరు సరిపెట్టు కుంటున్నారు. అదీ తప్పితే జిల్లా స్థాయి పదవి దక్కినా చాలనుకుంటున్నారు. చిత్తూరు అసెంబ్లీ నియోజక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సి కె బాబు, మాజీ ఎమ్మెల్యే మనోహర్, మాజీ ఎం ఎల్ సి దొరబాబు పార్లమెంటు అధ్యక్షుడు సి ఆర్ రాజన్, పార్టీ అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్, ప్రధాన కార్యదర్శి కోదండయదవ్, కాజూరు బాలాజీ, కటారి హేమలత, వై వి.రాజేశ్వరి, చెరుకూరు వసంత కుమార్, గుడిపాలకు చెందిన బాలాజీ నాయుడు, యాదమరికి చెందిన ఆరని బాలాజీ, జిల్లా కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. పూతలపట్టుకు చెందిన రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పుష్పరాజ్ ఇటేవల చంద్రబాబును కలసి వచ్చారు. తవనంపల్లికి చెందిన కోడందయ్య కూడా పదవుల రేస్ లో ఉన్నారు. గుడిపాలకు చెందిన పీటర్, మాజీ ఎం ఎల్ ఏ గాంధీ, పుత్తూరుకు చెందిన గ్యాస్ రవికుమార్ కూడా పదవి ఆశిస్తున్నారు. బిజెపి నుండి జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి, బిసి నేత అట్లూరి శ్రీనివాసులు కూడా రేసులో ఉన్నారు. పలమనేరు నుంచి పెద్దగా పేర్లు వినిపించడం లేదు. కుప్పం నుంచి బిసి వర్గానికి చెందిన మునిరత్నం, రాజశేఖర్ లలో ఒకరికి పదవి తప్పదని అంటున్నారు. పుంగనూరు నియోజక వర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డితో తలబడి ఓడిపోయిన చల్లా రామచంద్రా రెడ్డికి పదవి వచ్చే అవకాశం ఉందని తెలిసింది. జి. డి నెల్లూరు నియోజక వర్గం నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి, రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి భీమినేని చిట్టిబాబు నాయుడు, తెలుగు మహిళ అధ్యక్షురాలు అరుణలకు పదవీ యోగం ఉందంటున్నారు. జనసేన ఇంచార్జి డాక్టర్ పొన్న యుగంధర్ కూడా పదవి రేసులో ఉన్నారు. నగరి నియోజకవర్గంలో మాధవ నాయుడు, పోతుగుంట విజయబాబు పదవులను ఆశిస్తున్నారు. అయితే అక్కడ సిద్ధార్థ విద్యాసంస్థలు అధిపతి అశోక్ రాజుకు బిజెపి కోటాలో పదవి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. విశేషం ఏమంటే, అందరు చైర్మన్ పోస్టులపై దృష్టిని పెట్టారు. ఎం ఎల్ ఏ, ఎంపి సిఫారసు లేఖలను జత చేశారు. తనకు పదవి తప్పదని అందరు నాయకులు భావిస్తున్నారు. ఇందులో చంద్రబాబు నాయుడు ఎవరికి ఏ పదవి ఇస్తారో, ఎప్పుడు ప్రకటిస్తారో, ఎంత ప్రాధాన్యత ఇస్తారో మాత్రం వేచి చూడాల్సిందే.