6, సెప్టెంబర్ 2024, శుక్రవారం

పక్షం రోజుల్లో నామినేటెడ్ పదవుల పందారం

చిత్తూరు జిల్లాలో రెడ్డి, బలిజ కులాలకు ప్రాధాన్యత 

జనసేన, బిజెపి నాయకులకూ  నామినేటెడ్ పదవులు 

పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేసిన వారికి ప్రాధాన్యత 

జిల్లాకు 200 పైగా నామినేటెడ్ పదవులు వచ్చే అవకాశం 


ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.

ఇంకో పక్షం రోజుల్లో కూటమి ప్రభుత్వం పదవుల పందేరం చేస్తుందని విశ్వసనీయ సమాచారం. జూన్ 12 న టిడిపి నేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. తరువాత మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసారు. ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల పూర్తయిన తరువాత మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తానని ఇటీవల చంద్రబాబు చెప్పారు. అదే సందర్భంలో కేబినెట్ హోదా కల నామినేటెడ్ పదవులు కూడా ప్రకటించడానికి కసరత్తులు చేస్తున్నారని ఒక కీలక నాయకుడు చెప్పారు. టిడిపి తో పాటు జనసేన, బిజెపి నాయకులకు  కూడా నామినేటెడ్ పదవుల అదృష్టం వరించనుంది. జిల్లాకు 200 లకు పైగా పోస్టులు వచ్చే అవకాశం ఉంది.

మొదటి విడతలో ఎమ్మెల్యే టికెట్లు కోల్పోయిన 31 మందికి పదవులు ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే అందులో 10, 12 మంది తమకు నామినేటెడ్ పదవుల వద్దని ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని చంద్రబాబును కోరారని తెలిసింది. ఈ నేపథ్యంలో టికెట్ కోల్పోయిన దాదాపు 20 మందితో పాటు మరో పది మందికి పైగా నాయకులకు పదవులు ఇస్తారని తెలిసింది. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరు నేతలకు పదవీ యోగం ఉంటుందంటున్నారు. అందులో ఒకరికి టీటీడీ పాలక మండలి చైర్మన్ పదవి మరొకరికి రాష్ట్ర స్థాయి పదవి ఇస్తారని సమాచారం.  తరువాత మరో ఐదారు మందికి రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవులు ఇస్తారని అంటున్నారు. కొందరికి సభ్యుడు, డైరెక్టర్ పదవులు ఇస్తారని అంటున్నారు. కాగా జిల్లా స్థాయిలోని పదవులను తరువాత భర్తీ చేస్తారని తెలిసింది. జిల్లాలో కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ పదవికి ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్, కాణిపాకం, బోయకొండ గంగమ్మ   ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ తదితర పది పదవులు ఉన్నాయి. అలాగే 10 వరకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు ఉన్నాయి. ఆ యా సంస్థల సభ్యులు, డైరెక్టర్ల పదవులు ఉన్నాయి. జిల్లా సహకార మార్కెట్ కమిటీ, ప్రింటింగ్ ప్రెస్, జిల్లా డివిజన్, మండల స్థాయి ఆహార సలహా సంఘాలు, అస్సైన్మెంట్ కమిటి,  చితక పదవులు అన్నీ కలిపి జిల్లాలో 200 వందలకు పైగా నామినేటెడ్ పదవులు  భర్తీ అయ్యే అవకాశం ఉన్నందున ప్రతి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి 15, 20 మందికి పదవీ యోగం ఉందంటున్నారు. ఇప్పటికే అన్ని పదవులకు తగిన వ్యక్తులతో జాబితాలు రూపొందించారని తెలిసింది.పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ, రాబిన్ శర్మ టీమ్ , లోకేష్ అంతర్గత బృందం, చంద్రబాబు విడివిడిగా జాబితాలు తయారు చేశారని అంటున్నారు. అన్నింటిని క్రోడీకరించి తుది జాబితా రూపొందుతున్నదని తెలిసింది. ఇదిలా ఉండగా జనసేన, బిజెపి రాష్ట్ర కమిటీలు పంపిన జాబితాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. గత ఐదేళ్లలో జగన్ పాలనపై పోరాటం చేసిన వారికే పదవుల పంపిణీలో ప్రాధాన్యత ఉంటుంది. కొన్ని పదవులు ఆర్థిక సాయం చేసిన దాతలకు దక్కే అవకాశాలు ఉన్నాయంటున్నారు. నామినేటెడ్ పోస్టులు భర్తీలో కులాల సమతుల్యం పాటించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో ఈ పర్యాయం ఎక్కువ అసెంబ్లీ స్థానాలు కమ్మ సామాజిక వర్గానికి కేటాయించారు. జిల్లాలో బలిజ సామాజిక వర్గానికి ఒక స్థానం కూడా కేటాయించలేదు. కావున నామినేటెడ్ పోస్టుల భర్తీలు చిత్తూరు జిల్లా నుండి రెడ్డి బలిజ సామాజిక వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే మహిళలు, బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీలకు తగిన ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. వీరితోపాటు జనసేన పార్టీ, బిజెపి పార్టీ నాయకులు కూడా నామినేటెడ్ పోస్టులను ఆశిస్తున్నారు. వారి పనితీరును బట్టి ,అధిష్టాన వర్గం సిఫార్సుల మేరకు వారికి కూడా నామినేటెడ్ పోస్టులు కేటాయించే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో పార్టీ కోసం శ్రమించిన వారికి,  నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థులు గెలుపుకు విశేషంగా కృషి చేసిన వారికి, అభ్యర్థులకు ఆర్థిక సహాయం చేసిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. చిత్తూరు జిల్లాలో పలువురు ఎమ్మెల్సీ పదవి పైన దృష్టిని సారించారు. అయితే ఇప్పట్లో ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో రాష్ట్రస్థాయి చైర్మన్ పోస్టులను ఎక్కువ మంది నాయకులు ఆశిస్తున్నాను. కొందరు జిల్లా స్థాయిలోని చుడా చైర్మన్, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, జిల్లా గ్రంధాలయ సంస్థ పదవులను కూడా ఆశిస్తున్నారు. చిత్తూరుఅర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పోస్ట్ కు భారీగా పోటీ ఉంది. పలువురు నాయకులు ఇందుకు పోటీపడుతున్నారు. ఒక యువ నాయకుడు జిల్లాలోని ఎమ్మెల్యేల సిఫార్సులను, ఎంపీ సిపారసును సమీకరించి ఆ పోస్టు కోసం ప్రయత్నం చేస్తున్నారు. చిత్తూరు పట్టణానికి చెందిన ఒక మహిళ నేతకు ఇప్పించటానికి ఒక సీనియర్ నేత ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, చుడా చైర్మన్ పోస్టులకు ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అందరి బయో డేటాలను తెప్పించుకొని, పార్టీ పార్టీ అధికారంలోకి రావడానికి వారి తోడ్పాటున దృష్టిలో ఉంచుకొని నామినేటెడ్ పదవుల భర్తీలో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. ఏది ఏమైనా మరో పక్షం రోజుల్లో నామినేటెడ్ పోస్టుల కల నెరవేరునుంది. దశలవారీగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు సమాచారం. మొత్తము ప్రక్రియ పూర్తి అయితే, జిల్లాకు 200 పైగా నామినేటెడ్ పోస్టులు లభించే అవకాశం ఉంది.


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *