kanna lakshminarayana joined in TDP
చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ
పెద్ద ఎత్తున అనుచరులు వెంటరాగా.. చంద్రబాబు సమక్షంలో కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ చేరారు. పార్టీ కండువా కప్పి కన్నాను టీడీపీలోకి ఆహ్వానించారు చంద్రబాబు.
ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరారు. పెద్ద ఎత్తున అనుచరులు వెంటరాగా.. చంద్రబాబు సమక్షంలో కన్నా లక్ష్మీనారాయణ(Kanna Lakshmi Narayana) టీడీపీ చేరారు. పార్టీ కండువా కప్పి కన్నాను టీడీపీలోకి ఆహ్వానించారు చంద్రబాబు(Chandrababu Naidu). కొద్దిరోజుల క్రితం బీజేపీకి రాజీనామా చేసిన కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో(TDP) చేరడంతో.. గుంటూరు జిల్లాలో రాజకీయ సమీకరణాలు తమకు అనుకూలంగా మారతాయని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. కొంతకాలం నుంచి ఏపీ బీజేపీలో అసంతృప్తితోనే కొనసాగుతూ వచ్చిన కన్నా లక్ష్మీనారాయణ.. ఎట్టకేలకు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. దీంతో ఆయన ఏ పార్టీలో చేరతారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఆయనను తమ పార్టీలోకి తీసుకొచ్చేందుకు జనసేన విస్తృత ప్రయత్నాలు చేసింది. ఆ పార్టీ ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ కన్నాను కలిసి చర్చలు జరపడంతో.. ఆయన జనసేనలో చేరతారని చాలామంది అనుకున్నారు. టీడీపీ , జనసేన పొత్తు ఉంటుందని.. కన్నాను ఆయన కోరిన చోట పోటీ చేయించే బాధ్యత తాము తీసుకుంటామని జనసేన నేతలు ఆయనకు చెప్పినట్టు సమాచారం. అయితే జనసేనలో చేరే విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోని కన్నా లక్ష్మీనారాయణ.. రాష్ట్రంలో వైసీపీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పలువురు టీడీపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణను కలిసి చర్చలు జరిపారు. పార్టీలో ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు.
గుంటూరు జిల్లాలో బలమైన కాపు నాయకుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ.. అనేక పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఆయనను పార్టీలో చేర్చుకోవడం వల్ల అనుకూల ఫలితాలు ఉంటాయని టీడీపీ భావించింది. మరోవైపు కన్నా లక్ష్మీనారాయణతో తీవ్రంగా విభేదించే మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సైతం.. ఆయనతో కలిసి పని చేసేందుకు అభ్యంతరం లేదని ప్రకటించడంతో.. కన్నా టీడీపీలో చేరేందుకు లైన్ క్లియర్ అయ్యింది. దీంతో ఈ రోజు ఆయన తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు.
ఇక టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. కన్నా లక్ష్మీనారాయణను సత్తెనపల్లి లేదా గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేయించే ఆలోచనలో టీడీపీ నాయకత్వం ఉందని సమాచారం. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం కన్నాకే వదిలేయాలని భావిస్తున్నట్టు సమాచారం. చంద్రబాబుతో కన్నా లక్ష్మీనారాయణ చర్చించిన తరువాత దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.