13, ఫిబ్రవరి 2025, గురువారం

ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం

నేడే ప్రేమికుల రోజు 

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.

పవిత్రమైన ప్రేమకు అర్థం మారుతోంది. జీవనదిలా నిరంతరం కొనసాగాల్సిన ప్రేమకు ఒక రోజు వచ్చింది. క్రమంగా  వ్యామోహం ప్రేమ ముసుగు వేసుకుంటున్నది. ఆధునిక ప్రేమికులు మత్తులో  తైతక్కలు ఆడుతున్నారు. భారతీయ సంస్కృతిని దెబ్బ తీస్తున్నారు. దీనికి ప్రేమికుల దినోత్సవంగా పేరు పెట్టుకున్నారు. వ్యాపార సంస్థలు లాభాలు గడిస్తున్నారు. ఇదొక విష సంస్కృతిగా సమాజంలో విస్తరిస్తోంది. పలువురు తల్లి తండ్రులు బాధ పడుతున్నారు. ప్రేమకు హద్దులు, సరిహద్దులు లేవు. ప్రేమ తొలి చూపులో పుడుతుందని, దానికి రంగు, రుచి ఉండదని  కొందరు యువతీ యువకులు  అంటున్నారు. సృష్టికి మూలమైన ప్రేమను పంచుకోవడానికి, గుర్తు పెట్టుకోవడానికి ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటే తప్పేమిటని ప్రశ్నిస్తున్నారు.


 ప్రేమ అనేది అపురూపమైన భావన. మనసులో ఉన్న ప్రేమను వ్యక్తపరచడానికి ప్రత్యేక సమయం అవసరం లేదు. అయినా తమ ప్రేమను తెలిపేందుకు ప్రేమికులంతా ప్రేమికుల రోజు కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ప్రేమికుల రోజుకి వారం ముందు అంటే ఫిబ్రవరి ఏడు నుంచే వాలెంటైన్స్‌ వీక్‌ను జరుపుకుంటారు. ఒక్కో రోజును ఒక్కో పేరుతో సెలబ్రేట్‌ చేసుకుంటారు. ఫిబ్రవరి 7న రోజ్‌ డే, 8న ప్రపోజ్‌ డే, 9న చాకొలేట్‌ డే, 10న టెడ్డీ డే, 11న ప్రామిస్‌ డే, 12న హగ్‌ డే, 13న కిస్‌ డే, 14న వాలెంటైన్స్‌ డే జరుపుకుంటారు. ప్రేమికులు ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటూ ఆనందోత్సాహాలతో గడిపేస్తారు. రోమ్‌లో వాలెంటైన్‌ అనే క్రైస్తవ ప్రవక్త... ప్రేమతో జీవించడాన్ని ఇష్టపడేవాడు. ఆ దిశలోనే యువతీ యువకులను ప్రోత్సహించేవాడు. సమాజంలో పెరుగుతున్న హింస, స్వార్థం, ద్వేషం లాంటి చెడు గుణాలపై పోరాడేందుకు ప్రేమను మించిన ఆయుధం లేదని చెప్పేవాడు. రోమ్‌ చక్రవర్తి కూతురు ఇతని పట్ల ఆకర్షితురాలవుతుంది. యువతను తప్పుదోవ పట్టిస్తున్నాడంటూ వాలెంటైన్‌కు రోమ్‌ చక్రవర్తి మరణశిక్ష విధిస్తాడు. ఈ సంఘటన జరిగిన రెండు దశాబ్దాల తరవాత అప్పటి పోప్‌ ఫిబ్రవరి 14ని ప్రేమికుల రోజుగా ప్రకటించాడు. అప్పటి నుంచి వాలెంటైన్‌ పేరు మీద ప్రేమికుల రోజు (వాలెంటైన్స్‌డే)ను జరుపుకుంటున్నారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ ప్రేమికుల రోజు ఉత్సవాన్ని జరుపుకుంటారు. రకరకాల బహుమతులు, పువ్వులు, గ్రీటింగ్‌ కార్డులు, విందులు, వినోదాలతో తమ ప్రేమను తెలియజేస్తుంటారు.  ప్రేమ పరమ పవిత్రమైనది అనడంలో సందేహం లేదు. అయితే వర్తమాన సమాజంలో ప్రేమ ముసుగులో అనేక దురాగతాలకు జరుగుతున్నాయి. తెలిసీ తెలియని వయసులో పలువురు ప్రేమలో పడి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొందరు ప్రేమ తిరస్కారం భరించలేక అన్మాదులుగా మారుతున్నారు. అమాయకులైన అమ్మాయిలపై దాడులకు పాల్పడుతున్నారు. యాసిడ్ పోస్తున్నారు. కొందరు హత్యలు చేయడానికి కూడా వెనుకాడని  సంఘటనలు అప్పుడప్పుడు వార్తలకు ఎక్కుతున్నాయి. కొందలు అమ్మాయిలు ప్రేమ వైఫల్యాన్ని తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మైనర్ బాలికల పెళ్లి నేరమని చట్టాలు చెపుతున్నప్పటికి, కొందరు పాఠశాల స్థాయి విద్యార్థినీ విద్యార్దులు  ప్రేమలో పడుతున్నారు. కొంత మంది అపరిపక్వ ప్రేమకు గురై బతుకులను నాశనం కుంటున్నారు. ఈనేపథ్యంలో ప్రేమలపై పలువురు సామాజిక వేత్తలు, మానసిక నిపుణులు సర్వేలు చేసి వర్గీకరణ చేస్తున్నారు. పరిచయం స్నేహంగా మారి, సాన్నిహిత్యం పెరిగి, ఒకరిని ఒకరు అర్థం చేసుకుని, సహకారం, త్యాగం, క్షమ వంట బట్టించుకున్న ప్రేమలను వాస్తవిక ప్రేమలు అంటారు. దీనికి వయసు, విద్యార్హతలు, కుటుంబ నేపథ్యం తోడైతే జీవిత కాలం నిలుస్తుంది. అయితే కొందరు ఆకర్షణ వల్ల ప్రేమలో పడుతుంటారు. వీరిలో శారీరక తపన అధికంగా ఉంటుంది. ఇలాంటి ప్రేమను వ్యామోహపు ప్రేమగా చెప్పవచ్చు. కొంత మంది యువతీ యువకులు ఒకరిని వదిలి మరోకరితో ప్రేమ వ్యవహారాలు నడిపిస్తుంటారు. ఇలాంటి తరహా ప్రేమను క్రీడాత్మక ప్రేమ అనవచ్చు. అంటే వీరికి ప్రేమ వ్యవహారాలు ఒక ఆటలాగా ఉంటాయి. కొందరు ఆరాధనా భావంతో ప్రేమలో పడుతుంటారు. తరువాత వికటిస్తే జీవితాంతం బాధ పడుతూ జీవనాన్ని సాగిస్తుంటారు. కొందరు శారీరక  కోర్కెలు తీర్చుకోవడానికి వెంటపడి భయపెట్టి లేదా ప్రలోభ పరచి ప్రేమ వ్యవహారం సాగిస్తారు. దీనిని ఉన్మాదపు ప్రేమ అంటారు. చాలా మందిలో హార్మోన్లు ప్రేమకు ప్రేరకాలుగా పనిచేస్తుంటాయి. ఇలాంటి వారు సాంప్రదాయాలు, ఆచారవ్యవహారాలు విలువ ఇవ్వరు. అయితే అన్ని విధాల తగిన వ్యక్తిని ఎంచుకుని కొన సాగించే ప్రేమ కలకాలం ఉంటుందని సామాజిక వేత్తలు అంటున్నారు. కాబట్టి యువతీ యువకులు చదువు, కెరీర్ లాగే ప్రేమను ఒక లక్ష్యంగా ఎంచుకోవాలి. ఏడాదికి ఒక సారి ప్రేమికుల దినోత్సవం చేసుకుని, మిఠాయిలు పంచుకుని, బహుమతులు ఇచ్చుకోవడం మాని ప్రతి రోజూ ప్రేమను పంచుకోవడానికి సంసిద్ధం కావాలి. వ్యామోహాలకు దూరంగా ఉండాలి. భాగస్వామికి నిజమైన ప్రేమను పంచాలి. ప్రేమించిన వ్యక్తిని పెళ్ళాడి ప్రేమను చాటుకోవాలి. జీవితాంతం కలిసి ఉండి సమాజానికి ఆదర్శంగా నిలువాలి. 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *